Sabarimala: ఇరుముడితో 18 మెట్లు ఎక్కడం వెనుక అసలు రహస్యం ఇదే.! ఆసక్తికర విషయాలివిగో..!
Sabarimala: శబరిమలలో ఇరుముడితో 18 మెట్లు ఎక్కడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? ఇదే ఆధ్యాత్మిక రహస్యం.
Sabarimala: ఇరుముడితో 18 మెట్లు ఎక్కడం వెనుక అసలు రహస్యం ఇదే.! ఆసక్తికర విషయాలివిగో..!
Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు 41 రోజుల పాటు మండల దీక్ష పాటిస్తారు. నల్లటి వస్త్రాలు ధరించి, ఇరుముడి తలపై పెట్టుకుని కొండలు ఎక్కుతారు. చివరగా స్వామి సన్నిధిలోని 18 పవిత్ర మెట్లను అధిరోహిస్తారు. ఈ మెట్లనే పతినెట్టాంపడి అంటారు. దీక్ష చేయకుండా, ఇరుముడి లేకుండా ఈ మెట్లు ఎక్కడం సాధ్యం కాదని భక్తుల విశ్వాసం.
ఈ 18 మెట్లకు ఆధ్యాత్మికంగా లోతైన అర్థం ఉందని భక్తులు నమ్ముతారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను సూచిస్తాయి. అవి కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తర్వాతి 8 మెట్లు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, అహంకారం వంటి అంతర్గత శత్రువులకు ప్రతీక. తర్వాతి 3 మెట్లు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యకు సంకేతం. ఈ మెట్లు ఎక్కడం అంటే భౌతిక బంధాలను వదిలి దైవత్వం వైపు సాగడమని చెబుతారు.
ఈ సంఖ్యకు మరికొన్ని వివరణలు కూడా ప్రచారంలో ఉన్నాయి. శబరిమల చుట్టూ ఉన్న 18 కొండలకు ఈ మెట్లు ప్రతీక అని కొందరు చెబుతారు. అయ్యప్ప 18 ఆయుధాలను ధరించి, సన్నిధానంలో విలీనమయ్యే ముందు ఒక్కో మెట్టు వద్ద ఒక్కో ఆయుధాన్ని విడిచిపెట్టారని మరో విశ్వాసం. 18 పురాణాలకు కూడా ఈ మెట్లను అన్వయిస్తారు. ఈ మెట్లపై 18 మంది దేవతలు కొలువై ఉంటారని భావించి, పడిపూజలో వారిని ఆరాధిస్తారు.
మెట్లు ఎక్కేముందు భక్తులు కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. కుడి కాలు ముందుగా మెట్టుపై పెట్టి ఎక్కడం ఆచారం. దిగేటప్పుడు సన్నిధానం వైపు చూస్తూ వెనక్కి నడుస్తూ దిగుతారు. ఇరుముడి తలపై ఉండాల్సిందే. ఇరుముడిలోని కొబ్బరికాయ, నెయ్యి సమర్పణకు చిహ్నం. ఎవరైనా 18 సార్లు ఈ మెట్లు ఎక్కితే శబరిమలలో కొబ్బరి మొక్క నాటాలనే సంప్రదాయం కూడా ఉంది. స్వామియే శరణం అయ్యప్ప.




