ఈ శివాలయంలో మట్టినే ప్రసాదం... దీర్ఘకాలిక వ్యాధులు మటుమాయం

తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా తమిరబరణి నది ఒడ్డున వెలసిన ఎరల్‌ చైర్మన్‌ అరుణాచల్‌ స్వామి ఆలయంలో మట్టిని ప్రసాదంగా, సిరాను దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం ఇస్తారు.

Balachander
Published on: 28 April 2026 9:13 AM IST
ఈ శివాలయంలో మట్టినే ప్రసాదం... దీర్ఘకాలిక వ్యాధులు మటుమాయం
X

Mud Prasadam Temple: సాధారణంగా ఆలయాల్లో ప్రసాదంగా పులిహోర, లడ్డు, చెక్కర పొంగళి వంటి వాటిని ప్రసాదంగా ఇస్తారు. కానీ, తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా తమిరబరణి నది ఒడ్డున వెలసిన ఎరల్‌ చైర్మన్‌ అరుణాచల్‌ స్వామి ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ భక్తులకు మట్టినే ప్రసాదం. ఇదే ఇక్కడి ప్రత్యేకత.

జీవ సమాధిపై కొలువుదీరిన శివలింగం

దైవం మనుష్య రూపేణా అంటారు పెద్దలు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ క్షేత్రం. తమిళనాడులోని తమిరబరణి నది తీరాన వెలసిన ఈ ఆలయం ఒక మహనీయుని త్యాగనిరతికి, ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఈ క్షేత్రం గురించి పూర్తిగా తెలియాలంటే మనం 1880 నాటికి వెళ్లాలి. 1880వ సంవత్సరంలో జన్మించిన అరుణాచల్ స్వామిగళ్, ఎరల్ పంచాయతీకి ఛైర్మన్‌గా పనిచేశారు. సాధారణంగా రాజకీయం అంటే అధికారం అనుకుంటారు, కానీ ఆయన మాత్రం దానిని సేవగా భావించారు. ఆయన నిస్వార్థ సేవకు ముగ్ధులైన ప్రజలు ఆయనను భక్తితో 'చెర్మన్ స్వామి' అని పిలుచుకునేవారు. ప్రజల మనసులు గెలుచుకున్న ఎరల్‌ స్వామి నిరంతం దైవభక్తిలో మునిగి ఉండేవారు. భగవంతునిపై ఉన్న ఈ భక్తే...ఆయన్ను మహనీయుడిగా నిలబెట్టింది. మరణం సమీపించబోతుందని ముందుగానే అంచనా వేశారు. అందుకే ఆయన తనను అభిమానించి ఆరాధించే ప్రజల సమక్షంలోనే జీవసమాధి పొందారు. ఎరల్‌ స్వామి జీవ సమాధి పొందిన ప్రదేశంలో శివలింగం ఏర్పాటు చేశారు. ఎరల్‌ స్వామిని శివ స్వరూపంగా భావించి నిత్యం పూజలు చేస్తున్నారు.

మట్టి ప్రసాదం - నల్ల సిరా - ఆధ్యాత్మిక వింత

ఈ ఎరల్‌ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకున్న తరువాత ప్రసాదంగా మట్టిని, నల్ల సిరాను అందిస్తారు. గత 140 ఏళ్లుగా ఇలా మట్టి, నల్లసిరానే ప్రసాదంగా ఇస్తున్నట్టు భక్తులు చెబుతారు. దీని వెనుక ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేతవారు, వైద్యులు కూడా నయం చేయలేని మొండి రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు మట్టిని ఒంటికి రాసుకుంటారు. ఇలా చేయడం వలన వారు ఆయా రోగాల నుంచి విముక్తి పొందుతారని అంటారు. కేవలం భక్తి, మూడనమ్మకం మాత్రమే కాదని, ఎందరికో స్వయంగా నిరూపణ జరిగిందని అంటారు భక్తులు. అంతేకాదు, దుష్టశక్తుల చేత పీడించబడుతున్న వారు ఇక్కడ ఇచ్చే నల్లసిరా రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్మకం. ప్రతిరోజు వందల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. చిన్నారులను ఎక్కువగా ఈ ఆలయానికి తీసుకొస్తుంటారు.

కులమతాలకు అతీతంగా...

ఈ ఆలయంలో ఎలాంటి కులమతాలు ఉండవు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆదివారం, అమావాస్య, ఆదివారం అమావాస్య రోజుల్లో ఎక్కువమంది భక్తులు వస్తారు. ఇక ప్రతి ఏడాది శ్రావణమాంలో వచ్చే ఆదివారం అమావాస్య రోజున ఇక్కడ భారీ ఉత్సవం జరుగుతుంది. ఆరోజున లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామిని దర్శించుకుంటారు. తమ పాపాలు, రోగాలను దూరం చేసుకుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story