Salagrama Puja Benefits: అట్టడుగున ఉన్నవాళ్లు కూడా అదృష్టవంతులౌతారు... వీటిని ఇంట్లో పెట్టుకొని పూజించండి
ఇంట్లో సాలగ్రామాన్ని పూజించవచ్చా? అంటే పూజించవచ్చు...కాకపోతే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో...ఎందుకు పెద్దలు ఇలా చెప్పారో తెలుసుకుందాం.
Salagrama Puja Benefits:
హిందూ సనాతన ధర్మంలో ఎన్నో రకాల పూజా పద్ధతులు, అర్చనా విధానాలు ఉన్నాయి. వాటిలో అత్యంత మహిమాన్వితమైనది, భీతితో కూడిన భక్తిని కలిగించేది సాలగ్రామ పూజ. ఆ శ్రీమహావిష్ణువు స్వరూపమే ఈ సాలగ్రామ శిల. నేడు సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్లు కూడా అఖండ ఐశ్వర్యవంతులు కావాలన్నా, లేదా ఎంతటి సంపన్నులైనా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడాలన్నా ఈ సాలగ్రామ పూజా విధానంలో జరిగే పొరపాట్లే కారణం. ఇంట్లో సాలగ్రామాన్ని ఉంచి పూజిస్తే ఎలాంటి అనంత కోటి ఫలితాలు దక్కుతాయి, అలాగే ఎలాంటి కఠిన నియమాలు పాటించాలో స్పష్టంగా తెలుసుకుందాం.
విష్ణు రూపం... లక్ష్మీ నివాసం
గండకీ నదిలో లభించే పవిత్రమైన నల్లటి శిలలే సాలగ్రామాలు. వీటిలో ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో స్వయంభువుగా విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. ఎక్కడైతే సాలగ్రామం ఉంటుందో... అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ శిలను భక్తితో పూజించే వారి ఇంట్లో దరిద్రం అనే మాటే వినిపించదు.
ప్రతిరోజూ పాటించాల్సిన కఠిన నియమాలు
సాలగ్రామ పూజ అనేది సాధారణ దేవతా విగ్రహాల పూజ వంటిది కాదు. దీనికి కొన్ని కఠినమైన వాస్తు, వైదిక నియమాలు ఉన్నాయి. సాలగ్రామానికి ప్రతిరోజూ తప్పనిసరిగా తులసి దళాలతో పూజ, జలంతో లేదా పాలతో అభిషేకం చేయాలి. ఏదో ఒక నైవేద్యం తప్పక సమర్పించాలి. పూజా మందిరం అత్యంత పవిత్రంగా ఉండాలి. మహిళలు నెలసరి సమయంలో ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలి. ఏ రోజైనా అత్యవసర ప్రయాణాలు ఉండి పూజ చేయలేని పరిస్థితి వస్తే, ఆ శిలను పక్కనే ఉన్న ఏదైనా వైష్ణవ ఆలయంలో లేదా నిత్యం పూజలు చేసే వేరే బ్రాహ్మణుడి ఇంట్లో అప్పగించాలి గానీ, పూజ లేకుండా ఇంట్లో ఉంచకూడదు.
తరతరాల వారసత్వం
ఇంట్లో ఒక్కసారి సాలగ్రామ పూజ ప్రారంభమైతే, ఆ పూజా విధానాన్ని వంశ పారంపర్యంగా తరతరాలుగా కొనసాగించాల్సి ఉంటుంది. ఏ ఒక్క తరం వారు నిర్లక్ష్యం చేసినా, పూజలు ఆపేసినా ఆ కుటుంబానికి తీవ్రమైన పితృదోషాలు, వంశహాని కలిగే ప్రమాదం ఉందని పెద్దలు చెబుతారు. నేటి ఆధునిక బిజీ లైఫ్‌లో ఇన్ని నియమాలు పాటించడం సామాన్యులకు చాలా కష్టం. అందుకే పెద్దలు ఇంట్లో సాలగ్రామాలు పెట్టవద్దని ముందే హెచ్చరిస్తుంటారు. ఒకవేళ మీరు నిష్ఠగా, నియమబద్ధంగా పూజించగలము అనే సంకల్పం ఉంటేనే సాలగ్రామాన్ని తెచ్చుకోండి. అప్పుడు మీ జీవితంలో అపారమైన అదృష్టం, మోక్షం లభించడం ఖాయం!




