Sarv Pitru Amavasya: సర్వ పితృ అమావాస్య 2026 - పితృ పక్షం చివరి రోజు ఏం చేయాలి?
సర్వ పితృ అమావాస్య 2026 అక్టోబర్ 10న జరుపుకోనున్నారు. పితృ పక్షం చివరి రోజున శ్రాద్ధం, తర్పణం, దీపదానం, పితృ విసర్జనం ఎలా చేయాలి? ముఖ్యమైన ముహూర్తాలు, ఆచారాలు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
Sarv Pitru Amavasya: పితృ పక్షం ముగింపు రోజైన సర్వ పితృ అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తమ పూర్వీకుల మరణ తిథి తెలియని కుటుంబాలు ఈ రోజున శ్రాద్ధం, తర్పణం చేయడం ఆనవాయితీ. అంతేకాదు.. పితృదేవతలకు వీడ్కోలు పలికే రోజుగా భావించే ఈ అమావాస్య సాయంత్రం దీపదానం చేయడం కూడా ముఖ్యమైన ఆచారంగా చెబుతారు. 2026లో పితృ పక్షం చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య శ్రాద్ధాలు వరుసగా జరుగుతాయి.
అక్టోబర్ 7న ద్వాదశి శ్రాద్ధం
అక్టోబర్ 7, బుధవారం నాడు ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి తిథి రాత్రి 11:17 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున ద్వాదశి శ్రాద్ధం నిర్వహిస్తారు. సన్యాసులు, సాధువులుగా జీవించిన పూర్వీకుల కోసం ఈ తిథిలో శ్రాద్ధకర్మలు చేయడం సంప్రదాయం.
అక్టోబర్ 8న త్రయోదశి శ్రాద్ధం
అక్టోబర్ 8, గురువారం నాడు కృష్ణ త్రయోదశి తిథి రాత్రి 10:17 గంటల వరకు కొనసాగుతుంది. ఈ రోజున త్రయోదశి శ్రాద్ధం నిర్వహిస్తారు.
అక్టోబర్ 9న చతుర్దశి శ్రాద్ధం
అక్టోబర్ 9, శుక్రవారం నాడు కృష్ణ చతుర్దశి తిథి రాత్రి 9:36 గంటల వరకు ఉంటుంది. చతుర్దశి శ్రాద్ధానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రమాదాలు, ఆయుధాలు, విషప్రయోగం వంటి కారణాలతో అకాల మరణం పొందిన పూర్వీకులకు ఈ రోజున శ్రాద్ధం చేయడం శాస్త్ర సంప్రదాయంలో ముఖ్యంగా భావిస్తారు.
అక్టోబర్ 10న సర్వ పితృ అమావాస్య
అన్నింటికంటే ముఖ్యమైన రోజు అక్టోబర్ 10, శనివారం. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ అమావాస్య తిథి రాత్రి 9:20 గంటల వరకు ఉంటుంది. ఈ రోజున అమావాస్య శ్రాద్ధంతో పాటు పితృ విసర్జనం నిర్వహిస్తారు. పూర్వీకుల మరణ తేదీ లేదా తిథి తెలియని వారికి ఈ రోజున శ్రాద్ధం చేయడం ప్రత్యేకంగా మంచిదని సంప్రదాయం చెబుతోంది. అందుకే దీనిని సర్వ పితృ అమావాస్య అని పిలుస్తారు. ఈసారి ఇదే రోజు శనిశ్చరి అమావాస్య కూడా కావడం మరో విశేషం. అదనంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు గజఛాయ యోగం ఏర్పడుతుందని పంచాంగ వివరాలు చెబుతున్నాయి.
అమావాస్య సాయంత్రం దీపదానం ఎలా చేయాలి?
పితృదేవతలకు వీడ్కోలు పలికే సమయంలో సాయంత్రం దీపదానం చేయడం ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి, పూర్వీకులు తమ తమ లోకాలకు శాంతిగా తిరిగి వెళ్లాలని ప్రార్థిస్తారు. ఈ దీపాన్ని దక్షిణ దిశ వైపు ఉంచడం సంప్రదాయం. అలాగే రావిచెట్టు మొదట్లో నెయ్యి దీపం, ఆవ నూనె దీపం, నువ్వుల నూనె దీపం వెలిగించవచ్చు. అనంతరం చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణ చేసి, పవిత్రమైన దారాన్ని చెట్టుకు కట్టడం కూడా ఆచారాల్లో ఉంది. సంప్రదాయ విశ్వాసం ప్రకారం నెయ్యి దీపం ఐశ్వర్యానికి, ఆవ నూనె దీపం అనారోగ్య నివారణకు, నువ్వుల నూనె దీపం పితృదేవతల సంతృప్తికి సూచికగా భావిస్తారు.
బ్రాహ్మణ భోజనం, వస్త్రదానం
సర్వ పితృ అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా మంచిదని సంప్రదాయం చెబుతోంది. పితృదేవతలను స్మరించుకుంటూ తమ శక్తికి తగిన విధంగా దానం చేయడం ఈ పర్వదినం ఉద్దేశం.
శ్రాద్ధం, తర్పణానికి ముఖ్యమైన సమయాలు
అక్టోబర్ 10న శ్రాద్ధం, తర్పణం ఇచ్చిన ముఖ్యమైన ముహూర్తాలు ఇవి. మొదటి ముహూర్తం ఉదయం 11:34 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు, రెండో ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:07 వరకు ఉంటుంది. పితృ పక్షం చివరి రోజైన సర్వ పితృ అమావాస్య కేవలం ఒక ఆచారంతో ముగిసే రోజు కాదు. తమ పూర్వీకులను గుర్తు చేసుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసి, కుటుంబంలో వారి జ్ఞాపకాలను కొనసాగించే సందర్భం కూడా. అందుకే ఈ రోజున శ్రాద్ధం, తర్పణం, దీపదానం వంటి సంప్రదాయాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.




