Shivling Worship: శ్రావణంలో ఏ శివలింగాన్ని పూజించాలి? ఏ పూజకు ఎలాంటి ఫలితం లభిస్తుంది?

శ్రావణమాసంలో శివకేశవులు ఇద్దరినీ ఆరాధిస్తారు. అయితే, ఈ మాసంలో నాలుగు సోమవారాలు శివుడిని మనోభిష్టం అనుసరించి శివలింగాలను ఎంచుకొని ఆరాధించాలి.

Balachander
Published on: 1 Aug 2026 8:20 AM IST
Shivling Worship: శ్రావణంలో ఏ శివలింగాన్ని పూజించాలి? ఏ పూజకు ఎలాంటి ఫలితం లభిస్తుంది?
X

Shivling Worship: శ్రావణ మాసం వస్తే చాలు ఇళ్లలో, దేవాలయాలలో శివనామ స్మరణ మారుమోగిపోతుంది. పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు రకరకాల ఉపచారాలతో, పూజలతో స్వామిని ఆరాధిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం శ్రావణంలో ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి దివ్య ఫలాలు లభిస్తాయో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. శివలింగాలలో ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు. ప్రతీ లింగ రూపం శివునిలోని ఒక్కో విశేష శక్తికి ప్రతీక. మన జీవితంలో ఏ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నామో, దానికి తగినట్లుగా లింగ రూపాన్ని ఎంచుకుని పూజించడం మన పూర్వీకులు అందించిన పవిత్ర సంప్రదాయం. ఈ సారి శ్రావణంలో గ్రహాల స్థితిగతులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. కర్కాటకరాశిలో గురుడు, సూర్యుల కలయిక, మీనరాశిలో శని, నెప్ట్యూన్‌ల వక్ర గమనం కారణంగా... మనస్సును, భావోద్వేగాలను, ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఏడు ప్రత్యేక శివలింగాల ఆరాధనా ఫలాల వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం.

ఏ శివలింగంతో ఎలాంటి ఫలితం

పాదరస శివలింగంః జీవితంలో అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి కోరుకునేవారు పాదరస శివలింగాన్ని పూజించాలి. ఇది సకల విఘ్నాలను తొలగించి, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మరియు ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదిస్తుంది.

స్ఫటిక శివలింగంః మానసిక ఒత్తిడితో బాధపడేవారికి, ఏకాగ్రత కొరవడినవారికి స్ఫటిక శివలింగ పూజ ఒక దివ్యౌషధం. ఇది మనస్సును ప్రశాంతపరిచి, ఇంట్లో ధనాత్మక శక్తిని నింపుతుంది.

వెండి శివలింగంః కుటుంబంలో సంతోషం, భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి వెండి శివలింగాన్ని ఆరాధించాలి. ఇది గృహంలో ప్రశాంతతను, భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది.

స్వర్ణ శివలింగంః ఆర్థిక ఎదుగుదల, నూతన వ్యాపారాల్లో లాభాలు, సమాజంలో గౌరవ మర్యాదలు కోరుకునేవారు స్వర్ణ శివలింగాన్ని పూజిస్తే శ్రీహరి, లక్ష్మీదేవి సమేత శివానుగ్రహం లభిస్తుంది.

పార్థివ శివలింగంః శ్రావణ మాసంలో పుట్టమన్నుతో తయారుచేసిన పార్థివ శివలింగానికి పూజ చేయడం శ్రేష్ఠం. మనస్సులోని కోరికలు నెరవేరడానికి, పూర్వజన్మ పాపాలు తొలగిపోవడానికి ఇది ఉత్తమమైన మార్గం.

నర్మదేశ్వర శివలింగంః పవిత్ర నర్మదా నదిలో సహజసిద్ధంగా ఏర్పడే ఈ లింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తే స్థిరమైన సంపద, రక్షణ, ఇంట్లో శాంతి నెలకొంటాయి.

నల్ల రాతి శివలింగంః దేవాలయాల్లో ఎక్కువగా కనిపించే ఈ కృష్ణ శిల శివలింగ ఆరాధన వల్ల విశ్వాసం పెరుగుతుంది, నిగ్రహం అలవడుతుంది. దుష్టశక్తుల ప్రభావం నుండి పరిపూర్ణ రక్షణ లభిస్తుంది.

మన కోరికలు, దోషాలను అనుసరించి ఈ ఏడు రకాలైన శివలింగాల్లో ఏది అవసరమో దానిని ఎంచుకొని పూజించాలి. శ్రావణంలో ఇలా పూజించడం వలన మనం కష్టాల నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story