Govinda: శ్రీవేంకటేశ్వరుని గోవిందనామ రహస్యం... ఇలా పిలిస్తే సులభంగా పలుకుతాడు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని ఎన్ని నామాలతో పిలిచినా...గోవిందా అనే నామం ఆయనకు అత్యంత ప్రీతికరమైనది.
Govinda: కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడైన ఆ శ్రీవేంకటేశ్వరుడిని భక్తులు ఎన్నో నామాలతో కొలుస్తారు. కానీ, గుండె లోతుల్లోంచి కష్టం వచ్చినా, ఆనందం కలిగినా పెదవులపై దాసోహమంటూ పలికే ఏకైక మంత్రం...‘గోవింద’. తిరుమల కొండలను ఎక్కే భక్తుల అలసటను హరించే ఈ శక్తివంతమైన నామం స్వామివారికి ఎలా వచ్చింది? అసలు ఈ నామాన్ని మొదటిసారి ఎవరు పలికారు? ఈ ప్రశ్నల వెనుక ఒక పరమ పవిత్రమైన, ఆసక్తికరమైన పురాణ గాథ దాగి ఉంది. అదే అగస్త్య మహామునితో ముడిపడిన గోవు వృత్తాంతం. అదేంటో తెలుసుకుందాం.
అగస్త్యుని ఆశ్రమం.. శ్రీనివాసుని కోరిక
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా గోవులను కాపాడిన పరమాత్ముడే, కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించాడు. గోవులంటే స్వామివారికి ప్రాణం. ఈ క్రమంలో ఒకనాడు శ్రీనివాసుడు అగస్త్య మహాముని ఆశ్రమానికి విచ్చేసి, తనకు ఒక గోవును దానంగా ఇవ్వవలసిందిగా కోరతాడు. వేద ధర్మాల ప్రకారం ఒంటరిగా ఉన్న పురుషుడు గోదానం తీసుకోకూడదని, సహధర్మచారిణి సమేతంగా వస్తేనే గోవును ఇస్తానని అగస్త్యుడు చెబుతాడు. వకుళాదేవి కోరికను స్వామివారు తీర్చింది కూడా ఇక్కడే. దీని కోసమే యశోదా కలియుగంలో వకుళాదేవిగా జన్మించారు.
అలిగిన స్వామి.. అనుసరించిన మునిగణం
కొంతకాలం తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకుని, ఆమెతో కలిసి తిరిగి ఆశ్రమానికి వస్తాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమయంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో ఉండరు. గురువుగారు వచ్చేవరకు వేచి ఉండాలని అక్కడి శిష్యులు కోరడంతో, నిరీక్షించలేక స్వామివారు కాస్త అలిగి, వేగంగా తిరుమల కొండల వైపు నడక సాగిస్తారు.ఆశ్రమానికి తిరిగి వచ్చిన అగస్త్యుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆందోళన చెందుతాడు. స్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక ఉత్తమమైన గోవును, తన శిష్యులను వెంటబెట్టుకుని వేగంగా కొండ వైపు పరుగు తీస్తాడు.
‘గో ఇంద’ నుండి ‘గోవిందా’ వరకు!
వేగంగా వెళ్తున్న స్వామివారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు అగస్త్య మహాముని, ఆయన శిష్యులు వెనుక నుండి సంస్కృతంలో ‘గో ఇంద’ అని బిగ్గరగా అరవడం ప్రారంభించారు. గో ఇంద అంటే "స్వామీ! ఇదిగో గోవు, తీసుకో" అని తెలుగు అర్థం. స్వామి ఆగకుండా వెళ్తుండటంతో వెనుక వస్తున్న అగస్త్య మహాముని, శిష్యులు వేగంగా వెంటపడుతూ శ్వాసపై ధ్యాస లేకుండా గో ఇంద... గో ఇంద అని బిగ్గరగా పిలుస్తున్నారు. ఆ వేగంలో భక్తి పారవశ్యంలో గో ఇంద అనే పదం కాస్త గోవిందగా మారిపోయింది. అప్పటివరకు వెనక్కి తిరిగి చూడని ఆ శ్రీహరి, ‘గోవింద’ అని ఆర్తితో కూడిన పిలుపును వినగానే ఒక్క క్షణం పాటు ఆగి, వెనక్కి తిరిగి చిరుమందహాసం చిందించారు. ఆ పిలుపులోని భక్తికి కరిగిపోయి, అక్కడే అదృశ్యమయ్యారు.
భక్తులకు అభయ హస్తం
అగస్త్య మహాముని నోట మొదటగా వెలువడిన ఆ ‘గోవింద’ నామానికి స్వామివారు ఎంతగానో కరిగిపోయారు. అందుకే, కలియుగంలో ఎవరైతే తమ కష్టాలను మరిచి, నిష్కల్మషమైన మనసుతో ‘గోవిందా’ అని మూడుసార్లు స్మరిస్తారో, వారిని ఆపదలనుండి కాపాడి కోరిన కోర్కెలు నెరవేరుస్తానని స్వామి అభయమిచ్చారు. తిరుమల కొండపై నేటికీ 3,550కి పైగా మెట్లు ఎక్కుతూ భక్తులు పలికే ఈ నామం, ఆనాటి భక్తి మహోత్సవానికి సజీవ సాక్ష్యం. మెట్లు ఎక్కే సమయంలో అలసట చెందిన భక్తులు ఆర్తితో గోవింద అని పిలిస్తే చాలు. ఏదో ఒక రూపంలో స్వామివారు వారి అలసటను తీరుస్తారని భక్తులు నమ్ముతారు.




