Shani Jayanti Remedies: శని జయంతి రోజున ఇలా చేస్తే...ఏలినాటి శని దోషాల నుంచి విముక్తి
జాతకంలో 'ఏలినాటి శని' నడుస్తోందని తెలియగానే చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, శని భగవానుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, క్రమశిక్షణ నేర్పి జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే కర్మఫలదాత.
Shani Jayanti Remedies: జాతకంలో 'ఏలినాటి శని' నడుస్తోందని తెలియగానే చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, శని భగవానుడు కేవలం శిక్షించేవాడు మాత్రమే కాదు, క్రమశిక్షణ నేర్పి జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే కర్మఫలదాత. ఈ ఏడాది మే 16, 2026 శనివారం నాడు వైశాఖ బహుళ అమావాస్య తిథి వచ్చింది. బహుళ అమావాస్య రోజున శని జయంతి జరుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు శనివారం కావడంతో అత్యంత అరుదైన విశిష్టమైన ఆధ్యాత్మిక యోగంగా పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి సులభంగా చేసుకోదగిన అద్భుతమైన పరిహారాలు, పూజా విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఏలినాటి శని అంటే ఏమిటి? భయపడాలా?
జ్యోతిష్య శాస్త్ర గణన ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన రాశి (చంద్ర రాశి) కి వెనుక రాశి (12వ ఇల్లు), సొంత రాశి (1వ ఇల్లు), తర్వాతి రాశి (2వ ఇల్లు)... ఈ మూడు స్థానాల్లో శని దేవుడు సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. శని ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాల చొప్పున మొత్తం 7.5 సంవత్సరాల పాటు (ఏడున్నర ఏళ్లు) ఉంటాడు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. మానవ జీవిత చక్రంలో ప్రతి 30 ఏళ్లకు ఒకసారి ఈ దశ రావడం ప్రకృతి నియమం. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇక శని మందగమనుడు కావడం చేత మనం తలపెట్టే పనులలో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్యం వంటివి ఎదురవుతాయి. ఇక్కడ ఓ రహస్యమేమంటే...శని ఆయుష్షును ఇచ్చే కారకుడు. ఒక వ్యక్తి జీవితంలో వివాహం జరగాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా శని దేవుని అనుగ్రహం తప్పనిసరి. ఆయన నాశనం చేయడు, అహంకారాన్ని తొలగించి సత్ప్రవర్తనను నేర్పుతాడు.
శని జయంతి నాటి విశిష్ట పరిహారాలు
శని జయంతి రోజున భయంతో కాకుండా భక్తితో, కృతజ్ఞతా భావంతో శనీశ్వరుడిని పూజించాలి. పూజా మందిరంలో శనీశ్వరుని నల్లని చిన్న చిత్రపటం లేదా నవగ్రహాల పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపమాలతో 108 సార్లు జపించాలి. జపం తరువాత శుభ్రమైన తమలపాకులో నల్లనువ్వులు, కొద్దిగా బెల్లం ముక్కను కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈరోజు కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకు ఆహారం తినిపించడం, చీమలకు పంచదార లేదా నూకలు వేయడం వలన శని దోషాలు, ఏలినాటి శని దోషాలు సగానికి పైగా తగ్గిపోతాయి.
దేవాలయంలో చేయవలసిన పూజలు
శని అమావాస్య నాడు నవగ్రహాలు ఉన్న శివాలయానికి వెళ్లడం సర్వశ్రేష్ఠం. శనిదేవుని విగ్రహానికి నూనెతో స్వయంగా తైలాభిషేకం చేయాలి. నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. వీలైతే ఆలయం వద్ద ఉండే పేదలకు లేదా ఆలయ పూజారికి నల్లని వస్త్రాలు దానం ఇవ్వాలి. నల్ల నువ్వులు, దక్షిణ తాంబూలాలతో కలిపి దానం ఇవ్వడం మంచిది.
ఈ రోజంతా వీలైనంత వరకు ఉపవాసం ఉండటం మంచిది. శారీరక ఇబ్బందులు ఉన్నవారు ఒక్క పొద్దు ఉండవచ్చు. శనివారం సాయంత్రం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలు పఠించడం వల్ల శని దోషాల నుంచి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. ఎందుకంటే హనుమంతుని భక్తులను తాను ఎప్పటికీ బాధించనని శని దేవుడు స్వయంగా వరం ఇచ్చాడు. శని జయంతి రోజైన మే 16న అబద్ధాలు ఆడకుండా, ఎవరినీ మోసం చేయకుండా, ధర్మబద్ధంగా ఉంటూ ఈ పరిహారాలు పాటిస్తే, ఏలినాటి శని కాలం కూడా ఎంతో సుఖవంతంగా, ప్రశాంతంగా సాగిపోతుంది.




