Shani Shingnapur: శనిభగవానుడి మహిమ... ఆ గ్రామంలో దొంగను శనీశ్వరుడే పట్టుకుంటాడట
శని భగవానుడికి విశిష్టమైన ఆలయం ఎక్కడ ఉంది అంటే టక్కున గుర్తుకు వచ్చేది శని శింగనాపూర్. ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలియడంతో గ్రామంలోని ఇళ్లకు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తలుపులు ఉండవు.
Shani Shingnapur: తలుపులు, తాళాలు లేని విచిత్రమైన ఊరు... స్వయంగా శనీశ్వరుడే కాపలా కాచే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసా? ఇళ్లకు, ఆసుపత్రులకు, బ్యాంకులకు తలుపులు ఉండవు... దొంగతనం చేస్తే ఊరి పొలిమేర దాటేలోపే మరణం సంభవిస్తుందట. 6000 మంది జనాభా ఉన్న మహారాష్ట్ర శని శింగనాపూర్ దైవిక అద్భుతం... ప్రత్యక్ష అనుభూతిని ఇచ్చే క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం.
సాధారణంగా మనం నివసించే ఇళ్లకు, వ్యాపార సంస్థలకు రక్షణ కోసం తలుపులు, గొళ్ళేలు, తాళాలు వేసుకోవడం సహజం. కానీ మన దేశంలోనే దాదాపు 6000 మంది జనాభా నివసించే ఒక గ్రామంలో ఇళ్లకు, ఆఖరికి బ్యాంకులు, పోస్టాఫీసులకు కూడా అసలు తలుపులే ఉండవంటే నమ్మగలరా? ఆ విచిత్ర పుణ్యక్షేత్రమే మహారాష్ట్రలోని 'శని శింగనాపూర్'. షిరిడీ, ఔరంగాబాద్ నగరాల మధ్య వెలసిన ఈ గ్రామంలో దొంగల భయం అనేది ఉండదు. ఈ గ్రామానికి, ఇక్కడి ప్రజల సంపదకు స్వయంగా శనిభగవానుడే రక్షకుడిగా ఉంటాడనేది అనాదిగా వస్తున్న బలమైన విశ్వాసం.
ఆకాశమే హద్దుగా వెలసిన శనీశ్వరుడు
శని శింగనాపూర్‌లో కొలువుదీరిన శనీశ్వర స్వామి రూపం ఎంతో విలక్షణమైనది. ఇక్కడ శనిభగవానుడికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలయ గోపురం లేదా కప్పు ఉండదు. నల్లటి, గంభీరమైన రాతి విగ్రహ రూపంలో స్వామివారు ఆరుబయట స్వయంభువుగా దర్శనమిస్తారు. పండితులు చెబుతున్న స్థలపురాణం ప్రకారం, పూర్వం ఒక గొర్రెల కాపరి తన చేతిలోని కర్రతో ఆ రాతిని తాకినప్పుడు దాని నుండి రక్తం చిమ్మింది. అదే రాత్రి శనీశ్వరుడు అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, తాను స్వయంభువుగా అక్కడ వెలిశానని చెబుతాడు. అయితే, ఆ కాపరి తాను చేసిన తప్పుకు ఆలయం నిర్మిస్తానని వేడుకోగా... ఆకాశమే తనకు నీడ అని తానే పరమేశ్వరుడినని, భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటమే తనకు ఇష్టమని తెలిపి ఆలయ నిర్మాణం వద్దని ఆజ్ఞాపించాడట. ప్రతిరోజూ పూజలు చేస్తూ శనివారాల్లో తైలాభిషేకం చేయాలని సూచించాడు శనిభగవానుడు.
దొంగతనానికి పాల్పడితే మరణమే శిక్ష!
గ్రామానికి రక్షణగా ఉంటానని స్వామి ఇచ్చిన అభయం కారణంగా, శని శింగనాపూర్‌లో కలియుగం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఏ ఇంటికి తలుపులు కానీ, తాళాలు కానీ బిగించలేదు. ఎవరైనా ఈ శనిదేవుని మహత్యాన్ని కాదని దొంగతనానికి పాల్పడితే, వారు ఊరి పొలిమేర దాటేలోపే రక్తం కక్కుకుని మరణిస్తారని లేదా పిచ్చివారిగా మారిపోతారని స్థానికులు చెబుతారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ రికార్డులు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆ నమ్మకమే ఇప్పటి వరకు ఇళ్లకు తలుపులు, తాళాలు వంటివి లేకుండా చేసింది. ఇక, గ్రామంలోని ప్రజలు వేరే ఊళ్లకు లేదా దూర ప్రాంతాలకు వెళ్ళినా ఇళ్లను తెరిచే ఉంచి వెళ్తారు. స్వామివారిపై ఉన్న భక్తిశ్రద్ధలే వారి సంపదకు శ్రీరామరక్షగా భావిస్తారు. అంతేకాదు, శనివారం, శని త్రయోదశి, శని జయంతి రోజుల్లో ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. తైలాభిషేకం నిర్వహిస్తారు. శనిదోషాల నుండి విముక్తి పొందుతారు.




