Shiva Puranam: కష్టాల నుంచి గట్టెక్కాలంటే...శివపురాణంలో చెప్పినట్టుగా ఇలా చేయాలి

మనిషికి తమ కర్మలను అనుసరించి కష్టాలు, వ్యాధులు ఆటంకాలు సంభవిస్తుంటాయి. వీటి నుంచి విముక్తి పొందాలంలే శివపురాణంలో చెప్పిన విధంగా చేయాలని పండితులు చెబుతున్నారు.

Balachander
Published on: 29 Aug 2026 8:03 AM IST
Shiva Puranam: కష్టాల నుంచి గట్టెక్కాలంటే...శివపురాణంలో చెప్పినట్టుగా ఇలా చేయాలి
X

Shiva Puranam: మానవ జీవితంలో ఎదురయ్యే సకల కష్టాలు, వ్యాధులు, ఆటంకాల నుంచి ఉపశమనం పొందడానికి శివమహాపురాణం అద్భుతమైన మార్గాన్ని ఉపదేశిస్తోంది. శివపురాణంలోని 'విద్వేశ్వర సంహిత' 14వ అధ్యాయం ప్రకారం వారంలోని ఏడు రోజులలో ఏయే దేవతలను ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, దానధర్మాల ద్వారా ఎలాంటి దివ్య ఫలితాలు లభిస్తాయో విపులంగా వివరించబడింది. ఏ రోజున ఏ దేవతను పూజించినప్పటికీ, ఆ పూజా ఫలాన్ని పరమశివుడే స్వయంగా భక్తులకు ప్రసాదిస్తాడని శాస్త్రవచనం. వారం రోజుల్లో ఆచరించాల్సిన పవిత్ర పూజా విధానాలు, వాటి దివ్య ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.

ఆదివారం ...సూర్యారాధన

ఆదివారం నాటి అధిదేవత ఆదిత్యుడు. ఈ రోజున సూర్యునితో పాటు ఇతర దేవతలను, వేద పండితులను ఆరాధించాలి. సూర్యారాధన వల్ల నేత్ర రోగాలు, శిరోబాధలు, చర్మ వ్యాధులు సమసిపోతాయి. శక్తిని బట్టి ఒక రోజు నుండి నెల, సంవత్సరం లేదా మూడు సంవత్సరాల పాటు నియమబద్ధంగా ఈ పూజ ఆచరిస్తే సూర్యానుగ్రహం లభిస్తుంది.

సోమవారం...లక్ష్మీ పూజ

సంపద, ఐశ్వర్యం కొరవడకుండా నిలవాలంటే సోమవారం రోజున శ్రీలక్ష్మీదేవిని ఉపాసించాలి. పూజానంతరం వేద పండిత దంపతులకు నెయ్యితో కూడిన భోజనాన్ని తాంబూలంతో సమర్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది.

మంగళవారం ...కాళీమాత అర్చన

ఆరోగ్య ప్రాప్తికి మంగళవారం నాడు కాళీమాతను ఆరాధించాలి. కంది, మినుము, పెసరపప్పులతో తయారుచేసిన పవిత్ర పదార్థాలను అమ్మవారికి నివేదన చేసి, అనంతరం పేదలకు అన్నదానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి.

బుధవారం ...శ్రీమహావిష్ణు ఆరాధన

బుధవారం నాడు శ్రీమహావిష్ణువును పూజించి, స్వచ్ఛమైన పెరుగు అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజా ప్రభావం వల్ల కుటుంబ సభ్యులందరికీ పరిపూర్ణ ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది.

గురువారం, శుక్రవారం ...ఇష్టదైవ ఆరాధన

గురువారం రోజున తమ ఇష్టదైవానికి పాలు, నెయ్యితో చేసిన పిండివంటలు, వస్త్రాలు సమర్పించి అర్చిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. ఇక శుక్రవారం రోజున ఇష్టదేవతను ఆరాధించి వేద పండితులకు షడ్రుచులతో కూడిన భోజనం పెట్టాలి. అలాగే పుణ్యస్త్రీలకు నూతన వస్త్రాలు బహూకరిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి.

శనివారం... రుద్రాది దేవతల ఆరాధన, అపమృత్యు నివారణ

శనివారం నాడు పరమశివుడిని, రుద్రాది దేవతలను ఉపాసించాలి. అపమృత్యు భయాలు, శని దోషాలు తొలగిపోవాలంటే నువ్వులతో హోమం చేసి, నువ్వులను దానం ఇవ్వాలి. అలాగే నువ్వుల అన్నాన్ని పండితులకు భోజనంగా సమర్పిస్తే అకాల మృత్యు గండాలు తొలగి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించే మనుషులకు కష్టాలు, వ్యాధులు సంభవిస్తాయి. దుష్కర్మలను విడిచిపెట్టి, శివపురాణంలో చెప్పిన ఈ పూజా విధానాల (జపం, హోమం, దానం, తపస్సు, సమారాధన) ద్వారా సమారాధన మార్గాన్ని ఎంచుకుంటే పాపాలు నశించి దివ్యమైన శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story