Diabetes Cure Temple: మధుమేహాన్ని దూరం చేసే శివాలయం... చీమలే సాక్ష్యం

మధుమేహం ఒక్కసారి వచ్చిందే అంటే మందులతో జీవించాల్సిందే. ప్రపంచంలో కోట్లాదిమందిని పట్టిపీడిస్తున్న మహమ్మారి ఇది. పత్యం చేస్తూ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం తప్పించి మరేం చేయలేం.

Balachander
Published on: 9 May 2026 8:30 AM IST
Diabetes Cure Temple: మధుమేహాన్ని దూరం చేసే శివాలయం... చీమలే సాక్ష్యం
X

Diabetes Cure Temple: మధుమేహం ఒక్కసారి వచ్చిందే అంటే మందులతో జీవించాల్సిందే. ప్రపంచంలో కోట్లాదిమందిని పట్టిపీడిస్తున్న మహమ్మారి ఇది. పత్యం చేస్తూ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం తప్పించి మరేం చేయలేం. కానీ, తమిళనాడులోని ఓ పురాతన శివాలయం ఈ మహమ్మారిని చాలా సులభంగా తొలగించేస్తుందట. ఇది అక్షర సత్యం. తమిళనాడులోని అమ్మపేటలో కొలువై ఉన్న శ్రీ వెన్ని కురుంబేశ్వర స్వామి ఆలయం మధుమేహ బాధితులకు ఒక సంజీవనిలా మారింది. ఇక్కడ జరిగే 'చీమల వైద్యం' వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

5000 ఏళ్ల చరిత్ర.. శ్రీకృష్ణుడి ప్రతిష్ఠ

తంజావూరుకు సుమారు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు 5000 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణ గాథలు చెబుతున్నాయి. పురాతన కాలం నాటి శిల్పకళ, ఆధ్యాత్మిక శక్తి కలబోసిన ఈ క్షేత్రం నేడు దేశవిదేశీ భక్తులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఎందరికో వ్యాధి నయమైనట్టుగా కూడా భక్తులు చెబుతున్నారు.

ఆశ్చర్యపరిచే 'చక్కెర-రవ్వ' పరీక్ష

ఈ ఆలయంలో మధుమేహం నయం కావడానికి అనుసరించే పద్ధతి చాలా విభిన్నంగా ఉంటుంది. భక్తులు సమాన పరిమాణంలో సుజీ రవ్వను, చక్కెరను కలిపి తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తారు. అనంతరం ఆ మిశ్రమాన్ని ఆలయ ప్రాంగణంలో లేదా వెలుపల చల్లుతారు. ఇలా రవ్వ, చక్కెర కలిపిన ఈ మిశ్రమాన్ని తినేందుకు చీమలు వస్తాయి. చక్కెరను మాత్రమే తినేసి రవ్వను వదిలేస్తే వారికి మధుమేహం తగ్గిపోతుందని భావిస్తారు. శరీరంలో క్రమంగా చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు ఇక్కడికి వచ్చిన తరువాత...చాలా మంది మధుమేహం పరీక్ష చేయించుకోగా...చక్కెర స్థాయిలు తగ్గినట్టుగా గుర్తించారు. అలా కాకుండా సుజీ రవ్వను చీమలు తీసుకుంటే వారికి మధుమేహం తగ్గదని అంటారు.

ఆలయాన్ని రక్షించిన చీమల సైన్యం

ఇక్కడి చీమలను శివుడు పంపిన సైన్యంగా చెబుతారు. వీటిని దైవ స్వరూపాలుగా పూజిస్తారు. గతంలో మొఘల్ రాజులు ఈ ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, వేల సంఖ్యలో చీమలు దండెత్తి వచ్చి వారిని తరిమికొట్టాయని, అలా ఆలయాన్ని కాపాడాయని స్థానికులు చెబుతుంటారు. ఇక ఈ క్షేత్రంలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అయస్కాంత తరంగాలు, ఇక్కడి మట్టిలోని గుణాలపై పరిశోధనలు జరిపారు. ఇక్కడ ఏదో తెలియని ఒక దివ్యశక్తి దాగి ఉందని అంగీకరిస్తున్నారు. భక్తితో వెళ్లే వారికి ఆ భోళాశంకరుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ఆధునిక వైద్యానికి సవాలు విసురుతున్నాడు. మీరు కూడా మధుమేహ సమస్యతో బాధపడుతుంటే, ఒక్కసారి అమ్మపేట వెన్ని కురుంబేశ్వరుడిని దర్శించుకుని ఆ 'చీమల మహిమ'ను కళ్లారా వీక్షించండి!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story