Sravana Month: కొత్తగా పెళ్లైందా... ఆగస్టులో ఇలా చేస్తే ఎప్పటికీ విడిపోరు
శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లైనవారు తప్పకుండా కొన్ని నోములు, వ్రతాలు చేయాలని పండితులు చెబుతున్నారు.
Sravana Month: ఈ ఏడాది అధికమాసం రావడంలో జ్యేష్ఠమాసం రెండు నెలలపాటు కొనసాగింది. సాధారణ జ్యేష్ఠంతో పాటు నిజ జ్యేష్ఠమాసం కూడా రావడంతో ఆషాఢం కాస్త ఆలస్యమైంది. ఆషాఢ అమావాస్యతో అంటే ఆగస్టు 12తో ఆషాఢం ముగుస్తుంది. ఆ తరువాత ఆగస్టు 13 నుంచి శ్రావణం ప్రారంభం అవుతుంది. కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో దూరంగా ఉంటారు. శ్రావణం ప్రారంభం కావడంతోనే పుట్టింటి నుంచి అత్తగారింటికి తిరిగి వస్తారు. కొత్తగా పెళ్లైన జంటలు శ్రావణంలో వచ్చే శ్రావణ సోమవారాలు, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. శ్రావణ సోమవారాల వ్రతం చేయడం వలన దీర్ఘాయుష్షు కలుగుతుంది. మంగళగౌరి వ్రతం చేయడం వలన భర్త ఆయురారోగ్యంతో పాటు, వారి మధ్య బంధం బలంగా మారుతుంది. ఇక శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం చేయడం వలన అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని పండితులు చెబుతున్నారు.
శ్రావణ సోమవారం వ్రతాలు
శ్రావణమాసం ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 11తో ముగుస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజూ మంచిదే అయినప్పటికీ...శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు. ఈ శ్రావణమాసంలోని సోమవారాల్లో మహాశివుడికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. తెల్లవారు జామునే లేచి శుచిగా కార్యక్రమాలు ముగించుకొని శివలింగాన్ని అర్చించాలి. ఇతోధికంగా ఆరాధించి పంచామృతంలో లేదా జలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన దీర్ఘాయుష్షు లభించడమే కాకుండా, దోషాలు తొలగిపోతాయని, వివాహ బంధం బలపడుతుందని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 17 మొదటి సోమవారంతో పాటు పంచమి తిథి కూడా రావడంతో నాగపంచమిని జరుపుకుంటారు. ఇక రెండో సోమవారం ఆగస్టు 24న వస్తుంది. మూడో సోమవారం ఆగస్టు 31న, నాలుగో సోమవారం సెప్టెంబర్ 7న వస్తుంది.
మంగళగౌరీ నోములు
శ్రావణమాసంలో మహిళలు ఆచరించే అత్యంత ముఖ్యమైన నోములు మంగళగౌరి నోములు. మాంగళ్య బంధం దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఆదిదేవత పార్వతీదేవిని ఇతోధికంగా పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే బార్యభర్తల బంధం చిరకాలం వర్థిల్లుతుందని నమ్మకం. కాగా శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారం ఆగస్టు 18న వస్తుంది. అదేవిధంగా రెండో మంగళవారం ఆగస్టు 25న, మూడో మంగళవారం సెప్టెంబర్ 1న, నాలుగో మంగళవారం సెప్టెంబర్ 8న వస్తుంది. ఈ తేదీల్లో వివాహిత మహిళలు మంగళగౌరి వ్రతాలు నిర్వహించి వాయినాలను సమర్పిస్తారు.
వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మహిళలు నిర్వహించే ప్రధానమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాల్లో వరలక్ష్మీవ్రతం చేసుకున్నా... శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే అత్యంత విశిష్టమైనది. అంటే ఆగస్టు 21వ తేదీన మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతం చేసుకోవడం వలన కుటుంబంలో సిరిసంపదలు సమృద్ధిగా ఉంటాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాగుతుందని, అష్టలక్ష్ములతో ఇల్లు కళకళలాడుతుందని భక్తుల విశ్వాసం.
ప్రధాన పండుగలు
శ్రావణమాసంలో వచ్చే ప్రధానమైన పండుగలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి నాగపంచమి. ఇది ఆగస్టు 17వ తేదీన సోమవారం రోజున వస్తుంది. నాగదోషం ఉన్నవారు నాగపంచమి రోజున పుట్టలో పాలుపోసి స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు. కేవలం ఏడాదిలో ఒక్క నాగపంచమి రోజున మాత్రమే ఉజ్జయినీలోని నాగ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయం తెరుచుకుంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే అక్కడ దర్శనాలు ఉంటాయి. లక్షలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఇక, ఈ శ్రావణంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో మరొకటి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి. ఈ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున వస్తుంది. రాఖీపౌర్ణమికి సోదరులకు సోదరిలు రక్షాబంధన్ కడతారు. ఇదే రోజును జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజున నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.




