Shravana Nakshatra Puja: శ్రవణా నక్షత్రం రోజున ఏడుకొండలవాడిని ఇలా పూజిస్తే... కష్టాలు దూరం

శ్రవణా నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన అనే ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

Balachander
Published on: 26 Aug 2026 7:38 AM IST
Shravana Nakshatra Puja: శ్రవణా నక్షత్రం రోజున ఏడుకొండలవాడిని ఇలా పూజిస్తే... కష్టాలు దూరం
X

Shravana Nakshatra Puja:శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం అత్యంత పవిత్రమైనది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రమే కావడమే ఇందుకు ముఖ్య కారణం. శ్రావణ పౌర్ణమినాడు శ్రీవారు అవతరించారని 'శ్రీ వేంకటాచల మహత్యం' పురాణ గ్రంథం వివరిస్తోంది. ఆపదమొక్కులవాడైన ఏడుకొండలస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇంట్లోనే నిష్టతో పూజించడం వల్ల సకల కష్టాలు తొలిగి, కుటుంబంలో అఖండ ఐశ్వర్యం, శాంతి లభిస్తాయి.

శ్రీమహావిష్ణువు స్వరూపమైన వేంకటాచలపతి భూలోకంలో వైకుంఠాన్ని నెలకొల్పి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. నారాయణుడు భూమిపై పద్మావతి దేవిని పరిణయమాడి శేషాచల కొండలపై స్వయంభూగా వెలిశాడు. తిరుమలలో ప్రతి నెలా శ్రవణా నక్షత్రం రోజున స్వామివారికి విశేష ఆర్జిత సేవలు, ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీవారి శ్రవణా నక్షత్ర పూజ

శ్రావణ పౌర్ణమితో కూడిన శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారికి చేసే పూజకు కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుంది. ఈరోజున నానబెట్టిన బియ్యం పిండిలో బెల్లం, ఆవు నెయ్యి కలిపి తయారు చేసిన పిండి దీపం (శ్రీవారి దీపం) వెలిగించడం అత్యంత శుభకరం. అంతేకాదు, స్వామివారికి పసుపు రంగు పువ్వులు, తులసి దళాలు సమర్పించి 'శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి' పఠించాలి. ఇక చక్రపొంగలి, తిరుమల లడ్డూ, వడ, పచ్చకర్పూరంతో చేసిన ప్రసాదాలు శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరం.

ఇంట్లోనే పూజించే విశేష విధానం

శ్రవణా నక్షత్రం రోజున ఉదయమే తలస్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను లేదా చిత్రపటాన్ని తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠించాలి. ఆవు నేతితో దీపం వెలిగించి, స్వామివారికి గంధం, కుంకుమలతో అలంకారం చేయాలి. బియ్యపు పిండి, బెల్లం, ఆవు నెయ్యితో ప్రమిదను తయారుచేసి, అందులో దూది ఒత్తి వేసి 'శ్రీవారి పిండి దీపాన్ని' వెలిగించాలి. పూజ పూర్తయ్యే వరకు ఈ దీపం ఆరిపోకుండా చూసుకోవడం ముఖ్యం. అనంతరం శ్రీవారి నామాలు పఠిస్తూ తులసి దళాలతో అర్చన చేయాలి. పచ్చకర్పూరం వేసిన కొబ్బరినీళ్లు లేదా చక్రపొంగలిని నైవేద్యంగా నివేదించి, పచ్చకర్పూరపు నీరాజనం ఇస్తూ గోవింద నామస్మరణ చేయాలి. ఈ పవిత్ర రోజున శ్రీనివాసుడిని నిజమైన భక్తితో ఆరాధిస్తే జాతకంలోని దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని క్షేత్ర పురాణాలు చెబుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story