Simhachalam Nijaroopa Darshan: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. మోక్షానికి సులువైన మార్గం

Simhachalam Nijaroopa Darshan: వైశాఖమాసం అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది సింహాచలం క్షేత్రం.

Balachander
Published on: 20 April 2026 8:34 AM IST
Simhachalam Nijaroopa Darshan
X

Simhachalam Nijaroopa Darshan: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. మోక్షానికి సులువైన మార్గం

Simhachalam Nijaroopa Darshan: వైశాఖమాసం అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది సింహాచలం క్షేత్రం. ఈ క్షేత్రంలో జరిగే చందనోత్సవం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఒక్కరోజు మాత్రమే భక్తులకు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం 12 గంటలపాటు లభిస్తుంది. సాధారణ రోజుల్లో స్వామివారి విగ్రహం పూర్తిగా చందనంతో కప్పబడి ఉంటుంది. ఎవరైతే నిజరూప దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

విలక్షణ రూపం: ముఖం వరాహం.. తోక సింహం

సాధారణంగా నరసింహస్వామి ఆలయాల్లో స్వామివారి విరాట్‌రూపాన్ని పరిశీలిస్తే ముఖం సింహాకృతిలో, శరీరం మానవాకృతిలో ఉంటుంది. కానీ, సింహాచలం క్షేత్రంలో స్వామివారి ముఖం వరాహ రూపం కాగా శరీరం మానవాకృతిలో వాలం సింహం తోకమాదిరిగా ఉంటుంది. ఇటువంటి రూపాన్ని మనం ఏ క్షేత్రంలో కూడా దర్శించలేం. అందుకే స్వామివారిని వరాహ లక్ష్మీనరసింహస్వామిగా ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడిని చంపిన వరాహమూర్తి, హిరణ్యకశ్యపుడిని సంహరించిన నరసింహమూర్తి కలిసి ఇక్కడ కొలువయ్యారు.

చందన లేపనం ఎందుకు?

అత్యంత కిరాతకుడు, హరిద్వేషి అయిన హిరణ్య కశ్యపుడిని సంహరించిన తరువాత నరసింహస్వామి విపరీతమైన క్రోధాగ్నితో రగిలిపోయారట. ఆ ఉగ్రత్వాన్ని తగ్గించి స్వామిని వీలైనంత వరకు శాంతింపజేయడానికి దేవతలు చందనాన్ని అద్దిజట్టుగా చెబుతారు. ఆ చందనం క్రమంగా స్వామివారిని చల్లబరిచింది. అందుకే సింహాచలంలో అప్పన్న స్వామి నిత్యం చందనంతో కప్పబడి ఉంటారు. అక్షయతృతీయనాడు ఆ చందనాన్ని ఒలిచినపుడు స్వామివారి దివ్యతేజస్సు మన కంటికి కనిపిస్తుంది. నిజరూప దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అప్పన్న సన్నిధికి చేరుకుంటారు.

పురూరవ చక్రవర్తి పుణ్యమే ఈ దర్శనం

కృతయుగంలో ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం కాలక్రమేణా మరుగున పడిపోగా, కలియుగంలో పురూరవ చక్రవర్తికి స్వామి స్వప్నంలో కనిపించి తనను వెలికితీయమన్నారట. అయితే, స్వామి విగ్రహాన్ని తీసే క్రమంలో పాదాలు భూమిలోనే ఉండిపోయాయి. అందుకే నేటికీ సింహాచలంలో స్వామివారి పాద దర్శనం లభించదు. కేవలం అక్షయ తృతీయ నాడు 4 విడతలుగా (ఒక్కో విడత 120 కిలోల పైగా) చందనాన్ని అప్పన్నకు సమర్పిస్తారు.

మోక్షానికి సులువైన మార్గం

జ్యోతిష్య శాస్త్ర రీత్యా అక్షయ తృతీయ నాడు చేసే దానధర్మాలు, దైవ దర్శనాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు సింహాద్రి అప్పన్నను నిజరూపంలో దర్శించుకున్న వారికి జాతకంలోని కుజ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. అంతేకాదు, శాస్త్రం చెప్పిన ప్రకారం, ఈ రోజు స్వామి నిజరూపాన్ని దర్శించినవారు ఐహిక సుఖాలతో పాటు పరమపదం పొందుతారని చెబుతారు. అందుకే వేలాది మంది భక్తులు ఈ రోజున సింహాచలానికి చేరుకుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story