Giri Pradakshina: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ... 32 కిమీ ఆధ్యాత్మిక పాదయాత్ర...ఎలా చేయాలంటే

సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ఈరోజు మధ్యాహ్నం నుండి ప్రారంభమై రేపటి వరకు ఉంటుంది. చతుర్థశి రోజున 50 వేల మంది, పౌర్ణమి రోజున 80 వేల మంది ప్రదక్షిణ చేయనున్నారు.

Balachander
Updated on: 28 July 2026 10:21 AM IST
Giri Pradakshina: సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ... 32 కిమీ ఆధ్యాత్మిక పాదయాత్ర...ఎలా చేయాలంటే
X

Giri Pradakshina: అరుణాచలం వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్నారా? కేవలం 14 కిలోమీటర్లు కాకుండా, 32 కిలోమీటర్ల మహా దివ్య పాదయాత్ర చేసే అద్భుత అవకాశం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది! ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పే అరుణాచల గిరి ప్రదక్షిణ మహిమ ఎంతటిదో అందరికీ తెలిసిందే. సరిగ్గా అదే స్థాయి ఆధ్యాత్మిక అనుభూతిని పంచే సింహాద్రి అప్పన్న మహా గిరి ప్రదక్షిణ వేళ వచ్చేసింది! ఈరోజు ఈ పవిత్ర పాదయాత్ర వైభవంగా ప్రారంభం కానుంది. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన సింహాచలం కొండ చుట్టూ జరిగే ఈ యాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు సింహాచలం తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ దివ్య యాత్ర లాంఛనంగా మొదలుకానుంది.

భక్తుల కోసం భారీ ఏర్పాట్లు

ఈ ఏడాది భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28వ తేదీన 50 వేల మంది, పౌర్ణమి రోజైన 29న 80 వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రదక్షిణ మార్గంలో భక్తుల సౌకర్యార్థం 120 కొబ్బరికాయలు కొట్టే స్టాండ్లు, 28 ప్రాంతాల్లో తాగునీటి వసతి, అలాగే తొలిపావంచా వద్ద 50 క్యూలైన్లను సిద్ధం చేశారు. దీంతో పాటు ఈ యాత్రలో 5 వేల మంది పోలీసులు, 100 మంది ఉన్నతాధికారులు, 500 మంది రెవెన్యూ, జీవీఎంసీ, దేవస్థానం సిబ్బంది నిరంతరం పర్యవేక్షించనున్నారు. అత్యవసర సేవల కోసం 31 ఉచిత వైద్య శిబిరాలు, 22 అంబులెన్స్‌లు, 7 కంట్రోల్ రూమ్‌లు, 90 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

గిరి ప్రదక్షిణ సాగే మార్గం ఇదే!

ఎలాంటి గందరగోళం లేకుండా సాగిపోయేందుకు అధికారికంగా నిర్దేశించిన 32 కిలోమీటర్ల మార్గం వివరాలు ఇలా ఉన్నాయి. తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభమైన యాత్ర పాత అడివివరం, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతువాక కూడలికి చేరుకుంటుంది. అక్కడి నుంచి విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ డబుల్ రోడ్డు, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, అల్లూరి విగ్రహం మీదుగా బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు వెళుతుంది. తదుపరి పోర్టు స్టేడియం, కంచరపాలెం, డిఎల్‌బి క్వార్టర్లు, మాధవధార, మురళీనగర్, ఎన్ఎస్టీఎల్ మీదుగా కొండవాలు మార్గంలో గోపాలపట్నం కుమారి కల్యాణ మండపానికి చేరుకుంటుంది. ఇక ఇక్కడి నుంచి చివరిగా ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, పాత గోశాల మీదుగా తిరిగి తొలిపావంచా చేరుకుని మరో కొబ్బరికాయ కొట్టడంతో ఈ 32 కిలోమీటర్ల మహా యాత్ర సంపూర్ణమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పాదయాత్ర చేయాలని పండితులు చెబుతున్నారు. అప్పన్న నామస్మరణతో సాగే ఈ గిరి ప్రదక్షిణ కేవలం పాదయాత్ర మాత్రమే కాదు. ఇది జన్మజన్మల పాపాలను హరించే దివ్య అనుభూతి. భూప్రదక్షిణ చేసినంత పుణ్యాన్ని ప్రసాదించే ఈ యాత్రలో పాలుపంచుకుని సింహాద్రి అప్పన్న కృపకు పాత్రులు కావాలని మనమంతా కోరుకుందాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story