Miracle Temple:సంతోషంతో నవ్వుతూ దర్శనమిచ్చే ఉగ్ర నరసింహుడు...గిరి ప్రదక్షిణ చేస్తే జంటగా మారిపోతారు

దోనగుట్టపై వెలసిన నరసింహస్వామి ఉగ్రరూపంలో కాకుండా నవ్వుతూ భక్తులకు దర్శనం ఇస్తాడు. గిరి ప్రదక్షిణ చేసిన వారి కోరికలు నెరవేరుస్తాడు.

Balachander
Published on: 15 May 2026 9:40 AM IST
Miracle Temple:సంతోషంతో నవ్వుతూ దర్శనమిచ్చే ఉగ్ర నరసింహుడు...గిరి ప్రదక్షిణ చేస్తే జంటగా మారిపోతారు
X

Miracle Temple: ఎక్కడైనా సరే నరసింహస్వామి అంటే మనకు ఉగ్రరూపం కనిపిస్తుంది. ఉగ్రంతో ఉండే ఆయన రూపాన్ని దర్శించుకోవాలంటే ఓ విధంగా భయం కూడా ఉంటుంది. హిరణ్యకశివుని సంహరించిన ఉగ్రరూపంతోనే ఆయన ఆలయాల్లో దర్శనమిస్తారు. కానీ, హనుమకొండ నగరంలోని ఒక పుణ్యక్షేత్రంలో స్వామివారు ముఖంపై చిరునవ్వుతో, ప్రశాంత వదనంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అదే శ్రీ సంతోష లక్ష్మీనరసింహస్వామి ఆలయం. కొండను రెండుగా చీల్చుకుని స్వయంభూగా అవతరించిన ఈ స్వామివారి క్షేత్రం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఈరోజు ఈ ఆలయం విశేషాలను తెలుసుకుందాం.

ఋషికొండ నుంచి దోనగుట్ట వరకు

హనుమకొండలోని శాయంపేట ప్రాంతంలో ఉన్న ఈ కొండను పూర్వం 'ఋషికొండ' అని పిలిచేవారు. సిద్ధులు, మునులు ఇక్కడ తపస్సు చేసేవారట. సుమారు 56 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన గ్రంధి సూర్యనారాయణ-సత్యవతి దంపతులు ఈ క్షేత్ర మహత్తును గుర్తించారు. నిత్యం యాదగిరిగుట్టకు వెళ్లే ఆ దంపతులకు, ఈ కొండపై స్వామివారు ఉన్నారన్న విషయం తెలిసింది. 2002లో భక్తుల సహకారంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి ముఖంలో వెలిగే ఆనందాన్ని చూసి, ఆయనకు 'సంతోష నరసింహస్వామి' అని నామకరణం చేశారు.

ఎన్నటికీ ఇంకిపోని 'దోన' నీరు

ఈ క్షేత్రంలో మరో వింత ఏమిటంటే.. కొండ దిగువన ఉండే నీటి గుండం. ఎంతటి కరువు వచ్చినా, ఎండలు మండినా ఈ దోనలోని నీరు అస్సలు ఇంకిపోదు. పూర్వం ఇందులో ఒక కర్రను వేస్తే, అది ఎక్కడో ఉన్న బావిలో తేలిందని స్థానికులు చెప్పుకుంటారు. ఈ పవిత్ర జలంతోనే స్వామివారికి నిత్య అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే ఈ కొండకు 'దోనగుట్ట' అనే పేరు స్థిరపడిపోయింది. ఈ దోనగుట్టలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు.

మహిమగల గిరి ప్రదక్షిణ

ఈ ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఒక ప్రత్యేకత ఉంది. శనివారం రోజున వివాహం కానివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, వైవాహిక దోషాలు ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఈ ఆలయం వద్దకు చేరుకొని దోనగుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇలా ప్రదక్షిణ చేస్తే వారికి కళ్యాణ ఘడియలు సమీపిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇలా ఒంటరిగా వచ్చి ప్రదక్షిణ చేసిన వారు జంటగా మారిపోతారని భక్తుల నమ్మకం. సంతానం లేని దంపతులకు కూడా సంతానభాగ్యం కలుగుతుందని చెబుతారు. అంతేకాదు, స్వామివారి నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం, పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉగ్రరూపం చూసి భయపడే భక్తులకు ఈ సంతోష ఉగ్ర నరసింహస్వామి మానసిక ధైర్యాన్ని, జీవితంలో సుఖశాంతులను ప్రసాదిస్తాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story