Sravana Masam: శ్రావణమాసంలో పూజలు, నోములు ఎందుకు చేస్తారు... పూర్వీకులు చెప్పిన రహస్యాలు

శ్రావణ మాసంలో పూజలు, నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు? వాటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత, వాయనం, కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యంతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 13 Aug 2026 8:25 AM IST
Sravana Masam: శ్రావణమాసంలో పూజలు, నోములు ఎందుకు చేస్తారు... పూర్వీకులు చెప్పిన రహస్యాలు
X

Sravana Masam: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, మాతృత్వ భాగ్యం కోసం ఈ మాసంలో స్త్రీలు విశేషంగా నోములు, వ్రతాలు ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో చేసే ఆరాధనలు ప్రతికూల గ్రహ దోషాలను నివారించి, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదిస్తాయి. ప్రధానంగా మహిళలే ఈ వ్రతాలను ఆచరించడం వెనుక సనాతన ధర్మం అందించిన అద్భుతమైన ఆధ్యాత్మిక, సామాజిక రహస్యాలు దాగి ఉన్నాయి.

నోములు ... వ్రతాల ఆవిర్భావం

నోములు, వ్రతాల విధానం ఎలా వచ్చిందో స్కాంద పురాణంలో వివరంగా పేర్కొనబడింది. లోకకళ్యాణం కోసం కుమారస్వామి పరమేశ్వరుడిని మానవాళి దుఃఖ నివారణోపాయం కోరగా, శివుడు పార్వతీదేవి సమక్షంలో వివిధ వ్రత విధానాలను ఉపదేశించారు. వ్రతాల సమయంలో ముత్తైదువులకు ఇచ్చే వాయనాల్లో మూడు ముఖ్యమైన వస్తువులు ప్రధానమైనవి. తాంబూలంలో ఆకు, వక్క, సున్నం దానం చేయడం వల్ల సూర్య, కుజ, చంద్ర దోషాలు తొలగిపోతాయి. అలాగే నానబెట్టిన శనగలు, పెసలు వాయనంగా ఇవ్వడం వల్ల బుధ, గురు గ్రహ అనుకూలత లభిస్తుంది.

స్త్రీలే నోములు ఆచరించడం వెనుక ఉన్న కారణాలు

ఈ బృహత్తర బాధ్యతను మహిళలకే అప్పగించడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మహిళలు ఆచరించే ఏ వ్రతంలోనూ స్వార్థం ఉండదు. భర్త దీర్ఘాయుష్షు, సంతాన క్షేమం, కుటుంబ పురోగతి కోసమే మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య వంటివి నిష్ఠతో పాటిస్తారు. పూర్వకాలంలో చిన్నతనంలోనే అత్తారింటికి వెళ్లే బాలికలకు పెద్దలను గౌరవించడం, సత్ప్రవర్తనతో మెలగడం నేర్పే సాధనాలుగా 'చిట్టిబొట్టు నోము', 'పువ్వు తాంబూలం' వంటివి ఉపకరించేవి. అంతేకాదు, కఠినమైన ఉపవాస నియమాలు పాటిస్తూ, ఇంటి పనులను చక్కదిద్దుకునే అపారమైన సహనం, దయాగుణం ప్రకృతిసిద్ధంగా మహిళలకే సొంతం. ఈ కారణంగానే మహిళలు నోములు వ్రతాలు ఆచరించే బాధ్యతలను అప్పగించారు.

సామాజిక ఐక్యత, ధర్మ ప్రచారం

నోములు ఆచరించడం అంటే కేవలం పూజ చేయడమే కాదు. సంపాదించిన ధనధాన్యాలను ఇతరులతో పంచుకోవడం. ఎదుటి మనిషిని అమ్మవారి స్వరూపంగా భావించి వాయనం ఇచ్చి నమస్కరించడం వల్ల సమాజంలో సోదరీభావం, ప్రేమానురాగాలు పెంపొందుతాయి. వ్రతకథల ద్వారా ధర్మబద్ధమైన జీవితం గడపాలనే దివ్య సందేశం అందుతుంది. ఈ శ్రావణ మాసంలో శాస్త్రోక్తంగా నోములు ఆచరించి, సకల శుభాలను పొందుదాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story