Sri Bhu Varaha Temple: భూమి సమస్యలకు పరిష్కారం చూపించే ఆలయం... సికింద్రాబాద్‌లో ఎక్కడ ఉందో తెలుసా?
సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో భూమికి సంబంధించి సమస్యలను పరిష్కరించే అత్యంత పురాతనమైన భూవరాహ స్వామివారి ఆలయం ఉంది. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Sri Bhu Varaha Temple: సొంతంగా కాసింత భూమి కొనుగోలు చేయాలన్నా, స్థలానికి సంబంధించిన కోర్టు వివాదాలు తొలగిపోవాలన్నా, ఇల్లు కట్టే యోగం పట్టాలన్నా... తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో ఉన్న 'శ్రీ భూ వరాహస్వామి ఆలయం' ఒక దివ్య నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీమన్నారాయణుని మూడవ అవతారమైన వరాహస్వామి భూదేవి సమేతంగా కొలువైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ఇక్కడ ఇచ్చే పవిత్ర ప్రసాదాన్ని స్వీకరిస్తే భూ సంబంధిత చిక్కులన్నీ క్షణాల్లో తొలగిపోతాయని భక్తుల దృఢ విశ్వాసం.
క్షేత్ర మహత్యం... విశిష్టత
సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని మోండా మార్కెట్, శివాజీ నగర్ లో, సాయిబాబా ఆలయం పక్కనే ఈ పురాతన దివ్యాలయం ఉంది. ఇక్కడి స్వామివారు భూదేవితో కలిసి భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తారు. సాధారణంగా నరసింహస్వామి స్థానంలో కనిపించే 'సుదర్శన ఆళ్వార్' ఇక్కడ శ్రీ భూవరాహస్వామితో కలిసి కొలువై ఉండటం అత్యంత అరుదైన, విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టం. కేవలం భూమి సమస్యలు మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వివాహంలో జాప్యం, విద్యా విఘ్నాలతో బాధపడేవారికి కూడా ఈ క్షేత్రం గొప్ప ఊరటను ఇస్తుంది.
11 రోజుల సంకల్పం... 12వ రోజు ప్రత్యేక అభిషేకం!
ఈ ఆలయంలో కోరికలు నెరవేరడానికి భక్తులు పాటించే ప్రత్యేక పూజా విధానం ఉంది. మొదటిగా ఏదైనా బుధవారం నాడు ఆలయానికి వచ్చి, తమ సమస్య తొలగిపోవాలని స్వామివారి ముందు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. బుధవారం నుండి ప్రారంభించి వరుసగా 11 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్ష ఆచరించాలి. 12వ రోజున వచ్చే ఆదివారం నాడు సాయంత్రం 04:30 గంటల నుండి 06:00 గంటల వరకు ఉండే 'రాహుకాలం' సమయంలో స్వామివారికి విశేష అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపించాలి. ఇలా చేయడం వలన భూమికి సంబంధించిన సమస్యలు, ఆనారోగ్య, వివాహ, విద్యా సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మట్టియే ఇక్కడ మహా ప్రసాదం
ఈ ఆలయానికి ఉన్న అత్యంత ప్రత్యేకమైన ఆచారం ఏమిటంటే... ఇక్కడ భక్తులకు స్వామివారి పాదాల చెంత ఉన్న 'మట్టిని' ప్రసాదంగా అందిస్తారు. ఈ పవిత్ర మట్టిని తెచ్చి తమ ఇంట్లోని పూజా మందిరంలో భద్రపరుచుకుంటే, భూమికి సంబంధించిన రక రకాల సమస్యలు, కోర్టు వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా, నివాసంలో స్థిరాస్తులు వృద్ధి చెంది, గృహంలో లక్ష్మీదేవి తాండవిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.




