Sri Rama Navami 2026: శ్రీరామనవమి ఎప్పుడు? భద్రాచలంలో కళ్యాణం అప్పుడే!

Sri Rama Navami 2026: శ్రీరామనవమి ఏరోజు వస్తుంది అనే గందరగోళం ఉంది. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే..

KVD Varma
Published on: 20 March 2026 11:15 AM IST
Sri Rama Navami 2026: శ్రీరామనవమి ఏరోజు వస్తుంది అనే గందరగోళం ఉంది.
X

Sri Rama Navami 2026

Sri Rama Navami 2026: శ్రీరాముడు భారతావని గుండె చప్పుడు. శ్రీరాముని ప్రతి మనిషికీ ఆదర్శప్రాయుడు. రాముడు దేవుడు అంటే అది ఆయన ఖ్యాతిని పరిమితం చేసేదిగా అయిపోతుంది. ఎందుకంటే, ఆయన అంతకు మించి. దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం అయితే.. రాముని అడుగుజాడలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం అనేది నిజం. అలాంటి రాములోరి జన్మదినం.. కల్యాణం ఒకేరోజు వస్తాయి. ఆ పవిత్రమైన రోజునే శ్రీరామనవమి గా ఊరూ వాడా వేడుకగా జరుపుకుంటాయి. రాములోరి కల్యాణం చూడాలని ప్రతి ఏటా భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తారు.

ఈ సంవత్సరం శ్రీ రామనవమిని ఎప్పుడు జరుపుకోవాలి అనేదానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, మనకి భద్రాచలంలో కళ్యాణం జరిగే రోజే శ్రీరామనవమి ఉత్సవం జరుపుకునే రోజు అవుతుంది. శ్రీరామనవమిని భద్రాచలంలో ఎప్పుడు జరుపుతారు? అసలు ఈ తేదీ గందరగోళానికి కారణమేంటి? పండితులు ఏమి చెప్పారు తెలుసుకుందాం.

శ్రీరామనవమి తిథి:

శ్రీరాముడు దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి తీసుకున్న ఏడవ అవతారం. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు.

తేదీల్లో గందరగోళం..

2026లో, నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో పండగ 26నా.. 27నా అనే డౌట్ ప్రతిఒక్కరిలోనూ ఉంది. దేశవ్యాప్తంగా క్యాలెండర్లలో 26వ తేదీని శ్రీరామనవమిగా చూపించారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. దీంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడింది.

పండితులు చెప్పింది ఇదే..

సాధారణంగా, సూర్యోదయ సమయంలో నవమి తిథి వచ్చే రోజును రామ నవమిగా జరుపుకుంటారు. దీని ప్రకారం, పంచాంగ సూచనల ప్రకారం 2026, మార్చి 27, శుక్రవారం నాడు రామ నవమిని జరుపుకోవాలి.

పూజా సమయం:

శ్రీరామ నవమి నాడు శ్రీరాముడిని పూజించడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. రామ నవమి పూజ సమయం (మధ్య ముహూర్తం): మార్చి 27, 2026 ఉదయం 11.06 నుండి మధ్యాహ్నం 1.31 వరకు. ఈ రెండు గంటల సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా అదే సమయంలో జరుగుతుంది.

నవమి తిథి వివరాలు:

నవమి తిథి 2026, మార్చి 26న మధ్యాహ్నం 2.18 గంటలకు ప్రారంభమై, 2026, మార్చి 27న మధ్యాహ్నం 12.36 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం, చైత్ర మాసంలోని నవమి తిథి నాడు రఘువంశానికి చెందిన దశరథ మహారాజు, కౌసల్య దేవిల కుమారుడిగా శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో అవతరించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న రామ మందిరాలలో ప్రత్యేక పూజలు, భజనలు, రథయాత్రలు నిర్వహిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అదేరోజు సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్ముతారు. అందుకే అదే ముహూర్తానికి భద్రాచలంతో పాటు పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంటి మిట్టలో ఆరోజు కళ్యాణం నిర్వహించరు. ఇక్కడ చైత్రమాసం పౌర్ణిమ రోజున సాయంత్రం వేళలో కళ్యాణం జరుపుతారు.

ఈ రోజున ఉపవాసం ఉండి, రామాయణం పఠించి, శ్రీరాముని నామాన్ని జపించడం ద్వారా చెడు తొలగిపోయి, జీవితంలో సుఖాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా భక్తులకు పానీయాలు, మజ్జిగ అందించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనకు ధర్మ మార్గంలో నడవాలని నేర్పే ఒక పవిత్రమైన రోజు. అందుకే ఊరూ వాడా.. ప్రతి చోట శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు సీతారాములను సేవిస్తారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. పండితులు వెలువరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ ఆర్టికల్ ఇస్తున్నాం. శ్రీరామనవమికి సంబంధించి అవసరమైన ఇతర సమాచారం కోసం పండితులను సంప్రదించాల్సిందిగా సూచిస్తున్నాం.

KVD Varma

KVD Varma

Next Story