Srikurmam Temple Mystery: శ్రీకూర్మం రహస్యం... పితృదేవతలకు మోక్షం
భారతదేశంలో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. అయినప్పటికీ శ్రీమహావిష్ణువు రెండో అవతారంగా చెప్పబడే కూర్మావతారం రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం.
Srikurmam Temple Mystery: భారతదేశంలో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. అయినప్పటికీ శ్రీమహావిష్ణువు రెండో అవతారంగా చెప్పబడే కూర్మావతారం రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. ఇక్కడ స్వామివారు స్వయంభూవుగా వెలియడం ఒకెత్తైతే, పితృకార్యాలకు ఈ క్షేత్రం కాశీ కంటే మిన్నగా పేరుగాంచడం మరో విశేషం.
క్షీరసాగర మధనం - కూర్మ ఆవిర్భావం
పురాణగాథల ప్రకారం, దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మధించే సమయంలో మందర పర్వతం ఆధారం లేక అట్టడుగుకు కుంగిపోసాగింది. అప్పుడు లోక రక్షణార్థం శ్రీమన్నారాయణుడు భారీ కూర్మం రూపం ధరించి, ఆ పర్వతాన్ని తన వీపుపై మోశాడు. ఆ అమృత ఘట్టానికి సజీవ సాక్ష్యమే ఈ ఆలయం. ఇక్కడి గర్భాలయంలో స్వామివారు శిలా రూపంలో, తోక భాగం తూర్పుకు, ముఖం పశ్చిమం వైపుకు ఉండేలా కొలువై ఉన్నారు. కూర్మావతారం పొందిన రోజును కూర్మజయింతిగా జరుపుకుంటారు. వైశాఖ పూర్ణిమ తిథిని కూర్మజయింతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీకూర్మం ప్రత్యేకాంశాలు - 7 అద్భుతాలు
శ్రీకూర్మం క్షేత్రం అద్భుతాలకు నిలయం అనే చెప్పాలి. సాధారణంగా గర్భాలయంలో మూలవిరాట్ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. స్వామివారు భక్తుల భక్తికి మెచ్చి ఇలా పశ్చిమం వైపుకు తిరిగాడని అంటారు. అంతేకాదు, ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. శివకేశవుల మధ్య బేధం లేదని చెప్పడానికి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక మూడోది శ్వేత పుష్కరిణి. ఇక్కడ కోనేరులో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాతకాల నుంచి బయటపడొచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే పితృదేవతలకు పిండప్రదానం చేయడం వలన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఆలయంలో శిల్పకళాచాతుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి మంటపంలోని ఏ రెండు స్తంభాలను చూసినా ఒకే విధంగా కనిపించవు. ప్రతి స్తంభంలో అద్భుతమైన శిల్పకళ దాగి ఉంటుంది. ప్రతి ఏడాది వైశాఖ పూర్ణిమ రోజున కూర్మజయంతి ఉత్సవాలు అత్యద్భుతంగా జరుగుతాయి. అంతేకాదు, ఈ ఆలయం 7 వశతాబ్దం నుంచే ఉనికిలో ఉన్నట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఇక అరసవెల్లి సూర్యనారాయణుడిని దర్శించుకున్న తరువాత శ్రీకూర్మం క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. అలా దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణం అవుతుందని భక్తుల నమ్మకం.




