Srirangam: శ్రీరంగనాథుడు ఇచ్చిన భరోసా... రెండు శ్లోకాలు చెబితే సగం ప్రసాదం

శ్రీరంగనాథుడు తన భక్తుడి కోసం ప్రతిరోజూ శ్రీరంగంలోని సగం ప్రసాదాన్ని ఇచ్చేవాడు. రామానుజుల వారు చెప్పిన రెండు శ్లోకాలే దీనికి నిదర్శనం.

Balachander
Published on: 14 July 2026 8:04 AM IST
Srirangam: శ్రీరంగనాథుడు ఇచ్చిన భరోసా... రెండు శ్లోకాలు చెబితే సగం ప్రసాదం
X

Srirangam: భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న పరమ పవిత్ర క్షేత్రం శ్రీరంగం. ఇక్కడ శేషతల్పంపై పవళించిన శ్రీరంగనాథుని దర్శనం ఎంత పుణ్యదాయకమో, ఆ స్వామివారి దివ్య ప్రసాదం లభించడం కూడా అంతే మహాభాగ్యం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి మాట. శ్రీరంగంలో నివసించే ఒక పేద బ్రాహ్మణుడికి విష్ణు సహస్రనామాల్లోని కేవలం రెండు నామాలు తప్ప మరేమీ తెలియవు. కానీ, ఆ రెండు నామాలపైనే పూర్తి భారం వేసిన ఆ నిరుపేద భక్తుని కోసం, శ్రీరంగనాథుడే ఆలయంలోని 50 శాతం ప్రసాదాన్ని స్వయంగా మోసుకెళ్లి అతని కుటుంబానికి అందించిన అద్భుత లీలా ఘట్టం భక్తులను నేటికీ పరమానందభరితులను చేస్తుంది.

రామానుజాచార్యుల ఉపదేశం ... రెండు నామాల బలం

పూర్వం పేద బ్రాహ్మణుడు తన పిల్లల ఆకలి తీర్చడం కోసం రోజూ ఆలయానికి వచ్చి, ప్రసాదం కోసం అక్కడి అధికారులతో దీనంగా గొడవపడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీరామానుజాచార్యులు ఆ భక్తుడిని పిలిపించారు. ఆలయంలో ఏదైనా చిన్న కైంకర్యం చేసి, గౌరవంగా ఎక్కువ ప్రసాదం తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అందుకు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి.. "స్వామి! నాకు నా పిల్లల సేవకే సమయం సరిపోతుంది. పైగా నాకు చదువు రాదు. విష్ణు సహస్రనామాల్లో కేవలం 'నారాయణో నరసింహః' అనే రెండు నామాలు తప్ప మరేమీ తెలియవు" అన్నాడు. రామానుజులవారు చిరునవ్వుతో.. "అయితే ఆ రెండు నామాలనే నిరంతరం జపిస్తూ ఇల్లే దైవంగా భావించు" అని చెప్పారు. ఆ రోజు నుండి ఆయన ఆలయానికి రావడం పూర్తిగా మానేశాడు.

ఆలయంలో మాయమవుతున్న సగం ప్రసాదం!

చిత్రంగా, ఆ మరుసటి రోజు నుండి శ్రీరంగం ఆలయంలో వండిన మహాప్రసాదంలో సరిగ్గా సగం ప్రసాదం ఎవరికీ తెలియకుండా మాయం కావడం ప్రారంభమైంది. నిత్యం లెక్కలు చూసే రామానుజులవారు ఈ వింతకు ఆశ్చర్యపోయారు. ఆలయ అధికారులు ఎంత కాపలా కాసినా ప్రసాదం మాయమవడం ఆగలేదు. దీనితో రామానుజాచార్యులు తన యోగదృష్టితో ఆలోచించి, ఆ పేద బ్రాహ్మణుడిని వెతుక్కుంటూ ఆయన నివాసానికి వెళ్లారు.

శిష్యుడి రూపంలో వచ్చిన జగన్నాథుడు

అప్పటికే ఆ బ్రాహ్మణుడి ఇల్లు ధాన్యంతో, సంపదతో తులతూగుతోంది. రామానుజులను చూడగానే ఆ బ్రాహ్మణుడు పాదాభివందనం చేసి.. "స్వామి! మీ దయ వల్ల మాకు తిండికి లోటు లేదు. మీరు చెప్పినట్లే నేను ఆ రెండు నామాలను పఠిస్తున్నాను. ప్రతిరోజూ మీ శిష్యుడనంటూ ఒక చిన్న బాలుడు వచ్చి, ఆలయ సగం ప్రసాదాన్ని మా ఇంటి గుమ్మంలో పెట్టి వెళ్తున్నాడు" అని అమాయకంగా చెప్పాడు. ఆ మాట వినగానే రామానుజులవారి కళ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. తన శిష్యులెవరూ అక్కడికి వెళ్లలేదని, సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే తన భక్తుడి ఆకలి తీర్చడానికి బాలుడి రూపంలో ప్రసాదం మోసుకొచ్చాడని గ్రహించారు. అనన్యమైన భక్తి ముందు ఆ పరమాత్ముడు దాసుడవుతాడని ఈ సంఘటన నిరూపించింది. భగవంతునికి కావలసింది వేదమంత్రాల హోరు కాదు, నిష్కల్మషమైన హృదయం. నమ్మకంతో కేవలం రెండు నామాలు తలచుకున్నా, ఆపదలో ఉన్న భక్తునికి ఆ రంగనాథుడు కరవాలంబమై నిలుస్తాడనడానికి ఈ పవిత్ర గాథే నిదర్శనం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story