Stambheshwar Mahadev Temple: మహాశివుడిని మాయం చేస్తున్న సముద్రం...రోజుకు రెండుసార్లు అదృశ్యం
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మహాశివుడు రోజుకు రెండుసార్లు సముద్రంలో కలిసిపోతాడు. నదీ, సముద్రం సంగమం ప్రాంతంలో ఉన్న ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం విశేషాలను తెలుసుకుందాం.
Stambheshwar Mahadev Temple: భారతదేశంలో ఉన్న వేలాది శివాలయాల్లో కొన్నింటి క్షేత్ర చరిత్ర అద్భుతమైతే, మరికొన్నింటి విశేషాలు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి అరుదైన, ఆధ్యాత్మిక వింతకు నిలయమే గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కవి కాంబోయ్ తీరంలో ఉన్న 'స్తంభేశ్వర్ మహాదేవ్' ఆలయం. రోజుకు రెండుసార్లు సముద్ర అలల మధ్య పూర్తిగా మునిగిపోయి, ఆపై తిరిగి భక్తులకు దర్శనమిచ్చే ఈ స్వయంభూ క్షేత్రం ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అద్భుతంగానూ ప్రాచుర్యం పొందింది.
ప్రకృతివింత... సముద్రుడే స్వయంగా అభిషేకం
ప్రకృతి సిద్ధంగా ఏర్పడే సముద్రపు ఆటు, పోటు ప్రక్రియల వల్ల ఈ వింత జరుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మహి సాగర్, అరేబియా సముద్రాల సంగమ ప్రాంతంలో అలలు ఎగసిపడి దాదాపు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో నీరు ఆలయాన్ని కప్పేస్తుంది. ఆ సమయంలో శివలింగం పూర్తిగా నీటి అడుగున మునిగిపోతుంది. తిరిగి అలల తాకిడి తగ్గి సముద్రం వెనక్కి తగ్గగానే, ఆలయం స్పష్టంగా దర్శనమిస్తుంది. భక్తులు ఈ దృశ్యాన్ని పరమశివుడికి సముద్రుడే స్వయంగా చేస్తున్న నిత్య అభిషేకంగా భావిస్తారు.
స్తంభేశ్వర్ క్షేత్ర మహిమలు
పురాణాల ప్రకారం ఈ ఆలయం దాదాపు 2 వేల సంవత్సరాలకు పైబడిన ప్రాచీన చారిత్ర ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం గుజరాత్ సముద్రతీరంలోని కవికాంబోయ్ అనే గ్రామం వద్ద మహిసాగర్ అనే నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో ఉండటం విశేషం. అలల తాకిడి తగ్గి సముద్రం వెనక్కి వెళ్లగానే ఆలయం బయటకు వస్తుంది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. ఇలా స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల కొద్ది వేచి ఉంటారు.
ఆవిర్భావ రహస్యం
ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక 'స్కాంద పురాణం'లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. రాక్షస రాజైన తారకాసురుడు శివుని గురించి తీవ్ర తపస్సు చేసి, కేవలం ఆరు రోజుల వయసున్న బాలుడి చేతిలోనే తనకు మరణం సంభవించేలా వరం పొందుతాడు. వర గర్వంతో దేవాదిదేవతలను, మునులను హింసిస్తున్న తారకాసురుడిని సంహరించడానికి లోకకళ్యాణం కోసం కుమారస్వామి జన్మిస్తాడు. రాక్షసుడు కోరిన విధంగానే ఆరు రోజుల వయసులోనే స్కంధుడు తారకాసురుడిని వధిస్తాడు. అయితే, తాను సంహరించినది పరమశివుడి గొప్ప భక్తుడని తెలుసుకున్న కార్తికేయుడు తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఆ పాప పరిహార్థం శ్రీమహావిష్ణువు సూచన మేరకు తారకాసురుడి మరణించిన ప్రదేశంలోనే కార్తికేయుడు శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేస్తాడు. దేవతలందరూ కలిసి అక్కడ 'విశ్వానందక స్తంభాన్ని' నెలకొల్పడం వల్ల ఈ క్షేత్రానికి 'స్తంభేశ్వర్ మహాదేవ్' అనే పేరు వచ్చింది. సముద్ర గర్భంలో దాగి ఉండే ఈ పరమశివుడిని దర్శించుకోవడం భక్తులకు ఒక దివ్యానుభూతిని అందిస్తుంది.




