Shiva Temple: శయన భంగిమలో శివయ్య...ప్రపంచంలోనే ఏకైక ఆలయం
శివలింగం రూపంలో కాకుండా మానుష రూపంలో అందులోనూ పార్వతీదేవి తొడపై పవళించిన మహా శివుని రూపం సురటుపల్లిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని ఎంతో విశిష్టత ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Shiva Temple: మనం శివాలయానికి వెళ్తే అక్కడ మహాశివుడు లింగాకృతిలో దర్శనం ఇస్తాడు. మానుషరూపేనా అన్నట్లుగా...కొన్ని చోట్ల ధ్యానముద్రలో కూడా శివుని విగ్రహాలు మనకు కనిపిస్తాయి. కానీ శ్రీమహా విష్ణువులాగా, లక్ష్మీదేవి తొడపై తలను వాల్చి పవళించిన శయన భంగిమలో శివుడు కొలువైన అరుదైన క్షేత్రం ఒకేఒక్కటి ఉంది. అదీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటపల్లి గ్రామంలో ఉంది. ఈయన్ను సల్లికొండేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ రూపంలో శివుడు పూజలు అందుకుంటున్న ఏకైక క్షేత్రం ఇదే కావడం విశేషం.
హాలాహలం మింగిన వేళ..
సురటుపల్లి పల్లికొండేశ్వర స్వామివారి ఆలయం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవదానవులను భయపెడుతూ ఘోరమైన 'హాలాహలం' ఉద్భవించింది. లోకాలను రక్షించడం కోసం ఆ పరమశివుడు ఆ విషాన్ని అంతా తానే మింగేశాడు. అయితే, ఆ కాలకూట విషం గొంతు దాటి లోపలికి వెళ్తే ఉదరంలో ఉన్న సమస్త జీవకోటి నశిస్తుందని, అలాగని బయటకు ఉమ్మేస్తే లోకాలు దహనమవుతాయని గ్రహించిన పార్వతీ దేవి.. శివుడి కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. దాంతో ఆ విషం శివుని గొంతులోనే నిలిచిపోయి, ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనకు 'నీలకంఠుడు' అనే పేరు వచ్చింది. ఆ విష ప్రభావం వల్ల తీవ్రమైన అలసట, మైకం కమ్మేయడంతో శివుడు జగన్మాత అయిన పార్వతీ దేవి తొడపై తలవాల్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అలా స్వామివారు విశ్రమించిన పవిత్ర స్థలమే ఈ సురుటపల్లి.
ప్రదోష పూజల పురిటిగడ్డ
దేవతలందరూ శివునికి నమస్కరిస్తూ ఆయన క్షేమం కోసం ఇక్కడే వేచి చూశారు. స్వామివారు శయనం నుండి మేల్కొన్న సమయాన్నే 'ప్రదోష కాలం' అంటారు. శనివారం రోజు వచ్చే ప్రదోషాన్ని 'శని ప్రదోషం' అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రితో పాటు ప్రతి నెలా వచ్చే ప్రదోష కాల పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి. పల్లికొండేశ్వరుడిని దర్శించుకుంటే జాతకంలోని సమస్త దోషాలు, ముఖ్యంగా శని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంసారంలో సలహాలు, సమస్యలతో సతమతమయ్యే దంపతులు ఇక్కడి స్వామివారిని, అమ్మవారిని దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసం. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకొని పూజలు చేస్తుంటారు. ఇక కార్తీకమాసంలో స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు.




