Talakadu Temples: ఇసుకలో కూరుకుపోతున్న తలకాడు ఆలయాలు... ఆ రాజ వంశానికి మహాశాపం
తలకాడులో అత్యంత ప్రసిద్ది చెందిన ఆలయాలు 30 వరకూ ఉన్నా... అన్ని ఆలయాలు రాణి శాపం కారణంగా ఇసుకలో కూరుకుపోయాయి. దానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
Talakadu Temples: రాజకీయ దురాశ, అధికారాంతర మార్పిడులు ఒక్కోసారి చారిత్రక నగరాల విధ్వంసానికి, శతాబ్దాల నాటి శాపాలకు దారితీస్తాయి. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న 'తలకాడు' పట్టణ కథ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 30కి పైగా ప్రసిద్ధ ఆలయాలు ఇసుక తిన్నెల కింద కూరుకుపోవడం, మైసూర్ ఒడయార్ రాజవంశానికి ప్రత్యక్ష వారసులు లేకపోవడం వెనుక ఒక చారిత్రక రాజకీయం, శాపం దాగి ఉన్నాయి.
చారిత్రక నేపథ్యం.... ఆధిపత్య పోరు
మైసూరు నుంచి 45 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 133 కిలోమీటర్ల దూరంలో కావేరి నది ఒడ్డున ఉన్న తలకాడు ఒకప్పుడు వ్యూహాత్మక ప్రాంతంగా ఉండేది. 11వ శతాబ్దంలో పశ్చిమ గంగ వంశాన్ని ఓడించి చోళులు దీనిని స్వాధీనం చేసుకోగా, ఆ తర్వాత హొయసల రాజు విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని వశం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఏడు పట్టణాలు, ఐదు మఠాలతో తలకాడు వైభవంగా విరాజిల్లింది.
శాపం వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు
విజయనగర సామ్రాజ్య ప్రతినిధి తిరుమల రాయలు తీవ్ర అనారోగ్యంతో తలకాడులోని వైద్యేశ్వర ఆలయానికి చేరుకున్న సమయంలో, ఆయన భార్య రాణి అలమేలమ్మ పాలన వ్యవహారాలను చూసుకునేవారు. భర్త చివరి రోజుల్లో ఆయన వద్దకు వెళ్తూ, పాలనా పగ్గాలను మైసూర్ ఒడయార్లకు అప్పగించారు. కొంతకాలం తరువాత, రాణి వద్ద ఉన్న విలువైన రాజ ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు మైసూర్ రాజు సైన్యాన్ని పంపించారు. అయితే, రాజద్రోహాన్ని నిరసిస్తూ అలమేలమ్మ తన నగలను కావేరి నదిలో విసిరేసి, నదిలో దూకి ప్రాణత్యాగం చేశారు. తలకాడు ఇసుకమయమై పోవుగాక... మాలంగి సుడిగుండంగా మారుగాక... మైసూర్ రాజులకు సంతానం లేకుండా పోవుగాక! - అని రాణి అలమేలమ్మ శపించారు. ఈ సంఘటన తర్వాత కావేరి నది తన దిశను మార్చుకుని తలకాడు నగరమంతటా భారీగా ఇసుక మేటలు వేసింది. ఫలితంగా 30కి పైగా ప్రాచీన దేవాలయాలు మట్టిలో కలసిపోయాయి. అంతేకాకుండా, ఒడయార్ రాజవంశంలో శతాబ్దాల పాటు ప్రత్యక్ష మగ సంతానం లేక దత్తతలపైనే ఆధారపడాల్సి రావడం ఈ శాప తీవ్రతకు అద్దం పడుతోంది.
అయితే, కర్ణాటకలోని ప్రాచీన క్షేత్రమైన తలకాడులో నిర్వహించే 'పంచలింగ దర్శనం' అత్యంత అరుదైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన మహా క్షేత్ర మహోత్సవం. సాధారణంగా ఆలయాల్లో నిత్య పూజలు జరిగినప్పటికీ, ఈ ఉత్సవం కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించబడే ఒక విశిష్ట ఘట్టం. ఈ ఉత్సవం జరిగే సమయంలో పెద్ద ఎత్తున భక్తులు తలకాడుకు చేరుకుంటారు. స్వామివారిని భక్తిశ్రద్దలతో సేవిస్తారు.
పంచలింగ దర్శనం అంటే ఏమిటి?
పంచలింగం అంటే ఐదు ముఖాలు కలిగిన శివలింగం అని అర్ధం. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం వీటి పేరు. తలకాడుతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న శివలింగాలను దర్శించుకోవడాన్ని పంచలింగ దర్శనం అంటారు. ఈ దర్శనం అత్యంత అరుదుగా మాత్రమే లభిస్తుంది. ఇందులో మొదటిది వైద్యేశ్వర ఆలయం. ఇది ప్రధాన క్షేత్రం. స్వామివారు వైద్యునిగా రోగాలను నయం చేస్తారని నమ్ముతారు. ఇక రెండోది శ్రీ పాతాళేశ్వర ఆలయం. ఈ శివలింగం రోజులో వివిధ వేళ్లల్లో రంగులు మారుతుంది. ఇక మూడో ఆలయం శ్రీ మరుళేశ్వర ఆలయం. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు. ఇక నాలుగోది ఆర్కేశ్వర ఆలయం. సూర్య భగవానుడు మహాశివుడిని పూజించిన క్షేత్రంగా చెబుతారు. ఇకపోతే, చివరిది శ్రీ మల్లికార్జున ఆలయం. ఇది కావేరి నదీ తీరాన చిన్న గుట్టపై ఉంటుంది. స్వామివారిని మల్లికా అనే పుష్పాలతో ప్రత్యేకంగా పూజిస్తారు.




