Hanuman devotion story: శ్రీరామచంద్రుడి బాధను తీర్చిన భక్తుడు.. హనుమయ్య చెప్పిన భక్తి కథ
Hanuman devotion story: భక్తుడు ఆపదలో ఉండి 'రామా' అని పిలిస్తే, ఆ కష్టాన్ని తనపైకి వేసుకునేవాడు ఆ దయామయుడు.
Hanuman devotion story: శ్రీరామచంద్రుడి బాధను తీర్చిన భక్తుడు.. హనుమయ్య చెప్పిన భక్తి కథ
Hanuman devotion story: భక్తుడు ఆపదలో ఉండి 'రామా' అని పిలిస్తే, ఆ కష్టాన్ని తనపైకి వేసుకునేవాడు ఆ దయామయుడు. హనుమంతుడు ఒక భక్తుడిని శిక్షించబోతే, ఆ దెబ్బను తన వీపుపై మోసి, భక్తికి ఉన్న శక్తిని చాటిచెప్పిన శ్రీరామచంద్రుని అద్భుత గాథ ఇది.
రామనామం.. భక్తిమార్గం
అయోధ్యలో శ్రీరాముడు సుమారు 10,000 సంవత్సరాలు ధర్మపాలన చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. అందరిలో ఒక భక్తుడు మాత్రం ప్రత్యేకం. అతను ప్రతి క్షణం “రామ” నామాన్ని జపిస్తూ జీవించేవాడు. తినేటప్పుడు, నడుస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు… ఒక్క క్షణం కూడా జపం ఆపేవాడు కాదు. ఎంతటి తన్మయత్వం అంటే.. కనీసం తాను లఘుశంక (శౌచం) తీర్చుకుంటున్నానన్న స్పృహ కూడా లేకుండా 'రామ.. రామ..' అని జపిస్తూనే ఉన్నాడు. శరణాగతి భక్తికి ఇదొక తార్కాణం.
హనుమయ్య ఆగ్రహం
రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడే హనుమయ్య ఉంటాడన్నది జగమెరిగిన సత్యం. అయితే, అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడికి ఆ దృశ్యం చూడటంతోనే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "అపవిత్రమైన సమయంలో నా స్వామి నామాన్ని ఉచ్చరిస్తావా?" అన్న కోపంతో తన బలమైన తోకతో ఆ భక్తుని వీపుపై ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు తాళలేక ఆ భక్తుడు "రామా.. రక్షించు!" అని ఆక్రందన చేశాడు. చిత్రం ఏమిటంటే, ఆ భక్తుడికి వెంటనే నొప్పి తగ్గిపోయింది.
శ్రీరాముడి వీపుపై వాతలు
కొద్దిసేపటికే అయోధ్యలోని శ్రీరాముని అంతఃపురంలో కలకలం రేగింది. రఘురాముడు వీపుపై తీవ్రమైన మంటతో విలవిలలాడిపోతున్నాడు. లక్ష్మణుడు, సీతమ్మ వారు చూసేసరికి స్వామి వీపుపై రక్తసిక్తమైన వాతలు ఉన్నాయి. వెంటనే నవనీతం (వెన్న) తీసుకొచ్చి రాశారు. ఎంత రాస్తున్నా ఆ మంట తగ్గడం లేదు. అప్పుడే అక్కడికి చేరుకున్న హనుమ ఆ దృశ్యం చూసి కన్నీరు మున్నీరయ్యాడు. "స్వామీ! ఎవరిది ఈ సాహసం?" అని గర్జించాడు.
అప్పుడు రాముడు చిరునవ్వుతో.. "హనుమా! ఇది నీవు వేసిన దెబ్బే. నా భక్తుడు ఆర్తితో నన్ను పిలిచినప్పుడు, ఆ దెబ్బను నేను స్వీకరించకపోతే వాడు ప్రాణాలు వదిలేవాడు. భక్తుడి పాపం ఏదైనా.. వాడు నన్ను శరణు కోరితే ఆ శిక్షను నేనే అనుభవిస్తాను" అని పలికాడు. హనుమయ్య హృదయం చలించిపోయింది. తప్పు తెలుసుకున్నాడు. వెంటనే ఆ భక్తుడిని స్వామి వద్దకు తీసుకువచ్చాడు. భక్తుడు, హనుమంతుడు ఇద్దరూ కలిసి రామనామమును స్మరిస్తూ నవనీతాన్ని స్వామి వీపుపై పూయగానే, ఆ గాయాలు మాయమైపోయాయి. గాయం, మంట మాయం కాగానే హనుమయ్య చిన్నపిల్లవాడిలా ఎగిరి గంతేశాడు. భక్తుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమంటే.. భక్తిలో ఆచారాల కంటే ఆరాటమే ముఖ్యం. భక్తుడు ఏ స్థితిలో ఉన్నా భగవంతుడిని పిలిస్తే, ఆ స్వామి తన దేహాన్ని కూడా లెక్కచేయకుండా పరుగెత్తుకొస్తాడు. భక్తుడి రక్షణే ఆ రామచంద్రుడి ప్రథమ కర్తవ్యం.




