కాళికా మాత పాదాల కింద పరమశివుడు ఎందుకు ఉంటాడో తెలుసా.? ఆ పురాణ కథ వింటే పరవశించిపోతారు..

Kalika Matha: కాళికా మాత చిత్రాల్లో ఆ తల్లి పాదాల కింద పరమశివుడు ఎందుకు ఉంటాడో మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా.?

Ravi
By Ravi
Published on: 4 Jun 2026 6:50 AM IST
Kalika Matha
X

కాళికా మాత పాదాల కింద పరమశివుడు ఎందుకు ఉంటాడో తెలుసా.? ఆ పురాణ కథ వింటే పరవశించిపోతారు..

Kalika Matha: భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు, విశేషాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కాళికా దేవి చిత్రాలను చూసినప్పుడు, భయంకరమైన రూపంలో ఉన్న ఆ తల్లి పాదాల కింద సాక్షాత్తూ పరమశివుడు పడుకుని ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. సాధారణంగా భార్యల పాదాల దగ్గర ఉండే దేవుళ్లు చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరి అలా శివుడు కాళీ మాత పాదాల కింద ఎందుకు ఉంటాడు?

రాక్షసులతో జరిగిన భీకరమైన యుద్ధంలో దుర్గాదేవి అన్నీ శక్తులూ కూడగట్టుకుని పోరాడుతుంటుంది. ఆ రాక్షస సైన్యంలో 'రక్తబీజుడు' అనే ఒక అత్యంత శక్తివంతమైన రాక్షసుడు మిగులుతాడు. అతనికి బ్రహ్మదేవుడు ఒక విచిత్రమైన వరాన్ని ప్రసాదిస్తాడు. అదేంటంటే, అతని శరీరంలోని రక్తం ఒక్క చుక్క భూమి మీద పడినా, ఆ రక్తం నుంచి అప్పటికప్పుడే మరో వందలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. దుర్గాదేవి ఆ రక్తబీజుడిని గాయపరచిన కొద్దీ, అతని శరీరం నుంచి కారుతున్న రక్తం వల్ల క్షణాల్లో రాక్షస సైన్యం మూకుమ్మడిగా పెరిగిపోయి దేవిపై దాడికి దిగుతుంది. దీంతో దుర్గాదేవికి వచ్చిన విపరీతమైన కోపం నుంచి అత్యంత భయంకరమైన రూపంతో 'కాళికా దేవి' ఆవిర్భవిస్తుంది.

కాళికా దేవి ఆ రక్తబీజుడి సైనికులను వధించి, ఆ తర్వాత రక్తబీజుడిని ఒడిసిపట్టుకుని అతని రక్తం ఒక్క చుక్క కూడా కింద పడకుండా పూర్తిగా తాగేస్తుంది. రక్తబీజుడు మరణించిన తర్వాత కాళీమాత ఆ రాక్షసుడి చెడు రక్తం తాలూకు దుష్ప్రభావంతో విపరీతమైన ఉగ్రరూపం దాల్చి, భీకరమైన నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. ఆమె వేస్తున్న ఒక్కొక్క అడుగుతో లోకాలన్నీ వినాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు శివుడు ఆ దేవి నాట్యాన్ని ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆమె ఎవరి మాట వినిపించుకోదు. చివరకు గత్యంతరం లేక, దేవిని శాంతించమని కోరుతూ ఆమె వెళ్లే దారిలో పాదాల దగ్గర వెళ్లి పడుకుంటాడు. నృత్యం చేస్తున్న కాళికా మాత తన పాదాల దగ్గర ఉన్నది తన భర్త అని గ్రహించి వెంటనే తన క్రోధాన్ని ఉపసంహరించుకుంటుంది.

అంతేకాదు, పార్వతీదేవి ఒకసారి పరమశివునితో, "నేను సప్త మాతృకా, నవదుర్గ తదితర ఎన్నో రూపాలు ధరించాను కదా, వీటిలో మీకు ఏ రూపం అంటే ఇష్టం?" అని అడిగినప్పుడు, "కాళికా రూపమే నాకు అత్యంత ఇష్టం" అని శివుడు బదులిచ్చాడట. ఎందుకంటే, ఆ రూపంలోనే ఆమె నిరాడంబరంగా, నిజమైన దివ్య సౌందర్యంతో, జ్ఞాన స్వరూపిణిగా ప్రకాశించిందని శివుడు వివరిస్తాడు. అందుకే శివుడికి ఆమె కాళీ రూపం అంటే అంత ఇష్టం. కాళీమాత ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికే పరమశివుడు ఆమె పాదాల కింద అలా పడుకోవాల్సి వచ్చింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story