Tiruchuli Shiva Temple: విశ్వనాథుడు ప్రళయాన్ని అడ్డుకుంది ఇక్కడే... ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే జాతకం మారిపోవడం ఖాయం

Tiruchuli Shiva Temple: తమిళనాడులోని తిరుచిళి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివుని క్షేత్రం.

Balachander
Published on: 25 April 2026 2:37 PM IST
Tiruchuli Shiva Temple
X

Tiruchuli Shiva Temple

Tiruchuli Shiva Temple: తమిళనాడులోని తిరుచిళి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివుని క్షేత్రం. ప్రళయకాలంలో వరదను పరమశివుడు తన త్రిశూలంతో నిరోధించిన పవిత్ర క్షేత్రమే ఈ తిరుచిళి. సామాన్య మానవులకు అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలకు శివయ్య అపార కరుణకు ఈ ఆలయం ఓ నిలువుటద్దం. ఇక్కడ కొలువైన స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోవడమే కాదు, పితృదేవతల ఆత్మలకు శాంతి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.

త్రిశూలంతో ప్రళయాన్ని అడ్డుకున్న 'ప్రళయ విధాంగర్'

ఈ తిరుచిళి క్షేత్రం పేరు వెనుక అద్భుతమైన గాథ ప్రచారంలో ఉంది. పురాణ కాలంలో ప్రళయం సంభవించి జగమంతా జలమయమవుతున్న తరుణంలో, ఈ ప్రాంతాన్ని రక్షించమని భక్తులు పరమేశ్వరుడిని వేడుకున్నారు. అప్పుడు శంకరుడు తన త్రిశూలాన్ని భూమిపై గుచ్చి, ఆ ప్రళయ జలాన్ని ఒక సుడిగుండంలా మార్చి భూగర్భంలోకి పంపించేశారట. తమిళంలో 'సుడి'ని 'చుళి' అంటారు, అందుకే ఈ ఊరికి 'తిరుచుళి' అనే పేరు వచ్చింది. ఇక్కడి స్వామిని 'తిరుమేనినాథర్' అని, 'ప్రళయ విధాంగర్' అని భక్తులు కొలుచుకుంటారు. ప్రతి సోమవారం ఈ క్షేత్రాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. భూమిపై మనుషులు ప్రశాంతంగా జీవించడానికి తిరుమేనినాథర్‌ కారణమని చెబుతారు.

వింతలు.. విశేషాలు!

తిరుచుళి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ అడుగుడుగునా మనకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. ఇందులో ప్రధానమైనది చతురస్ర శివలింగం. సాధారణంగా శివలింగాలు గుడ్రంగా ఉంటాయి. కానీ, ఇక్కడి స్వామివారు చతురస్రాకారంలో ఉంటాడు. ఇక్కడ మరణించినవారి పేరుమీద దీపం వెలిగిస్తే వారి ఆత్మలు సద్గతులు పొందడమే కాకుండా, 21 తరాల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని చెబుతారు. పార్వతీ దేవి ఇక్కడే తపస్సు చేసి మహాశివుడిని వివాహం చేసుకుందని చెబుతారు. అందుకే పెళ్లి సంబంధాలు కుదరనివారు అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని అంటారు.

ఇక్కడి కట్టడం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉండటం విశేషం. 9 వ శతాబ్ధానికి చెందిన ఈ ప్రఖ్యాత క్షేత్రం తిరుచుళిలోనే రమణ మహర్షి జన్మించారు. మధురై నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనసుకు తెలియని ప్రశాంతత లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story