Morning Vastu Rules: నిద్రలేచిన వెంటనే ఇవి మీ కంటపడితే... ఆరోజు దినదిన గండమే
ఉదయం నిద్రలేచిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వస్తువులను అస్సలు చూడకూడదు. ఒకవేళ అనుకోకుండా చూస్తే ఆరోజు ఒక్కపని ముందుకు సాగదు. వాస్తు శాస్త్రంలో దీనికి పరిష్కారాలు సూచించారు. అవేంటో తెలుసుకుందాం.
Morning Vastu Rules: మనం సాధారణంగా నిద్రలేవగానే హడావుడిగా మన ముందు ఏముందో చూసుకోకుండా మంచం దిగేసి పరుగులు తీస్తుంటాం. ఒక్కోసారి మనకు తెలియకుండా కొన్ని వస్తువులను చూడవలసి వస్తుంది. అలా చూసినట్టైతే...ఆరోజంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక్కపని ముందుకు సాగదు సరికదా... ఆటంకాలు, ఆర్థిక నష్టాలు ఎదురౌతుంటాయి. ఉదయం మనం చూసే వస్తువులు, ఆలోచించే ఆలోచనలు ఆరోజంతటినీ శాసిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం కళ్లు తెరవగానే కొన్ని వస్తువులను మనం అస్సలు చూడకూడదు. అవేంటో తెలుసుకుందాం.
ఉదయాన్నే మీ కంట పడకూడని వస్తువులు
చాలామందికి నిద్రలేవగానే మంచం పక్కనే ఉన్న అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ, రాత్రంతా మన శరీరంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తి ఉదయాన్నే అద్దం ద్వారా తిరిగి మనపైనే ప్రభావం చూపుతుంది. అందుకే స్నానం, పూజ పూర్తయ్యే వరకు అద్దం చూడకపోవడమే మంచిది. ఇక సమయం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. ఒక్కోసారి పడకగదిలో ఆగిపోయిన గడియారం ఉన్నా, అది మీ పురోగతిని ఆపేస్తుంది. ఉదయాన్నే ఆగిపోయిన గడియారాన్ని చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, చేసే పనులన్నీ చెడిపోతాయి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో రాత్రి గిన్నెలను ఉదయం తోమడం అలవాటుగా మారింది. కానీ, ఉదయం లేవగానే వంటగదిలో ఎంగిలి పాత్రలను చూడటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము. ఇది ఇంట్లో తీవ్ర ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అదేవిధంగా గోడలపై ఉండే యుద్ధ దృశ్యాలు, అడవి మృగాల చిత్రాలు ఉదయాన్నే మనస్సులో క్రోధాన్ని, ఆందోళనను నింపుతాయి. ఇవి ఇంట్లోని ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఇక్కడ చెప్పుకోవలసిన ప్రధానమైన అంశం ఒకటుంది. అదే నీడ. ఉదయం లేవగానే సూర్యకాంతి వల్ల పడే మన నీడను మనం చూసుకోకూడదు. ముఖ్యంగా పడమర దిశలో నీడ కనిపిస్తే అది 'రాహు పీడ'కు సంకేతం. ఆ రోజు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం.
ఒకవేళ పొరపాటున చూస్తే ఏం చేయాలి?
ఒకవేళ అనుకోకుండా ఈ వస్తువులు మీ కంటపడితే కంగారు పడకండి. నిద్రలేవగానే మంచంపై కూర్చుని మొదట మీ అరచేతులను చూసుకుంటూ "కరాగ్రే వసతే లక్ష్మీ..." శ్లోకాన్ని పఠించండి. ఆ తర్వాత పాదాలను నేలపై పెట్టే ముందు భూదేవికి నమస్కరించండి. ఈ చిన్న మార్పు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఐదు వస్తువులను చూడకుండా... లేచిన వెంటనే అరచేతిని చూసుకొని, అందులో లక్ష్మీదేవి శ్లోకాన్ని చదువుకొని మంచం దిగాలి. రోజంతా మనల్ని మోసే భూదేవికి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఇంకోరోజు ఆమె మనల్ని నేలపై నడిచే అవకాశం కల్పిస్తుంది కాబట్టి.




