Brahmapureeswarar Temple: ఎంత దరిద్రంగా ఉన్నా... ఈ ఆలయాన్ని సందర్శిస్తే తలరాత మారిపోతుంది
తమిళనాడులోని తిరుపుత్తూరులో వెలసిన బ్రహ్మపురీశ్వరాలయం దోషాలు తొలగించడమే కాకుండా తలరాతను కూడా మార్చే శక్తి కలిగి ఉంది.
Brahmapureeswarar Temple: ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా అనుకున్న పనులు ముందుకు సాగవు. పైగా చికాకులు తెప్పిస్తుంటాయి. అలాంటి సమయంలో తలరాత బాగోలేదని సరిపెట్టుకుంటాం. అయితే, విధాత రాసిన విధిరాతను కూడా మార్చగలిగే శక్తి ఒకే ఒక్కటి ఉంది. ఆ విధాత బ్రహ్మదేవుని తలరాతను కూడా ఈ ఆలయం మార్చేసిందని పండితులు చెబుతున్నారు. ఆ క్షేత్రమే బ్రహ్మపురీశ్వరాలయం. తమిళనాడులో వెలసిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే జాతకంలోని దోషాలు తొలగిపోయి తలరాత మారుతుందని భక్తుల విశ్వాసం.
అహంకారం నుంచి అనుగ్రహం వరకు
పురాణాల ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మదేవుడికి తన సృష్టి శక్తిని చూసి గర్వం పెరిగింది. శివుడి కంటే నేనే గొప్ప అనే భావన కలిగింది. దీనిని గమనించిన పరమేశ్వరుడు, బ్రహ్మ యొక్క ఐదవ తలని ఖండించి, సృష్టి చేసే శక్తిని కోల్పోయేలా శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ, శాప విమోచనం కోసం దేశంలోని పలు శివాలయాలను దర్శిస్తూ, చివరకు తమిళనాడులోని తిరుపత్తూరు చేరుకున్నారు. తిరుపత్తూరులో బ్రహ్మదేవుడు ద్వాదశ శివలింగాలను ప్రతిష్టించి కఠోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుని నిష్కల్మషమైన భక్తిని మెచ్చుకొని ఆదిదంపతులు ప్రత్యక్షమై శాపవిమోచనం కలిగిస్తారు. అంతేకాకుండా, బ్రహ్మదేవుని తలరాత మారినట్టే ఇక్కడ స్వామిని దర్శించుకున్నవారికి తలరాత కూడా మారిపోతుందని, జీవితం నూతనంగా, శుభప్రదంగా మారుతుందని వరం ఇస్తాడు మహాశివుడు.
ఆలయ విశేషాలు - ప్రత్యేకతలు
ఈ ఆలయం భక్తితో పాటు ఆధ్యాత్మిక శక్తికి కూడా నిలయం. సాధారణంగా బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండవు. కానీ, ఇక్కడ బ్రహ్మ పద్మాసనంలో ధ్యానముద్రలో ఉన్న విగ్రహం ఉంటుంది. బ్రహ్మదేవుడిని దర్శించుకొని ఆయన కథ వింటే దోషాలు తొలగిపోతాయి. ఇక ఇక్కడ బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన ద్వాదశ లింగాలు వేర్వేరు ఉపాలయాల్లో కొలువై ఉన్నాయి. ద్వాదశ లింగాలను దర్శించుకుంటే జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు, ప్రపంచానికి యోగ సూత్రాలను అందించిన పతంజలి మహర్షి సజీవ సమాధి కూడా ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్రంలోనే పతంజలి మహర్షి తపస్సు చేశారని, ఆ తపస్సు ఫలితంగానే ఆయన యోగసూత్రాలను రచించారని అంటారు. ఈ కారణంగా ఇక్కడ కాసేపు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మదేవుడు ఆ పరమశివుడికి అభిషేకం చేయడం కోసం బ్రహ్మతీర్థాన్ని ఏర్పాటు చేశారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమౌతాని అంటారు.
దర్శన ఫలం
ఈ ఆలయానికి వెళ్లే భక్తులు తమ జాతక చక్రాలను వెంట తీసుకువెళ్లి బ్రహ్మ దేవుడి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహిస్తారు. గురువారం నాడు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అత్యంత శ్రేష్ఠం. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి దరిద్రం అనుభవిస్తున్నా.. ఒక్కసారి ఆ బ్రహ్మపురీశ్వరుని దర్శించుకుంటే, కర్మ ఫలం కరిగిపోయి, ఉజ్వలమైన భవిష్యత్తు ప్రారంభమవుతుందని వేలమంది భక్తుల అనుభవం చెబుతోంది.




