Thiruvakkarai Temple: రాజకీయనాయకులు ఎక్కువగా ఈ ఆలయాన్ని ఎందుకు దర్శిస్తారో తెలుసా?
Thiruvakkarai Temple Mystery: తమిళనాడులోని అనేక శైవక్షేత్రాల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి, చారిత్రక ప్రాముఖ్యత, పురాణ గాథల సమ్మేళనం కనిపించే పవిత్ర క్షేత్రాలలో ఒకటి తిరువక్కరై చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం.
Thiruvakkarai Temple: రాజకీయనాయకులు ఎక్కువగా ఈ ఆలయాన్ని ఎందుకు దర్శిస్తారో తెలుసా?
Thiruvakkarai Temple: తమిళనాడులోని అనేక శైవక్షేత్రాల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి, చారిత్రక ప్రాముఖ్యత, పురాణ గాథల సమ్మేళనం కనిపించే పవిత్ర క్షేత్రాలలో ఒకటి తిరువక్కరై చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని సామాన్యులతో పాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటారు. ఎందుకు రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అని తెలుసుకోవాలంటే ముందు ఈ క్షేత్రం వెనుక ఉన్న మహిమ, పురాణం, ఆధ్యాత్మిక శక్తిని లోతుగా అర్ధం చేసుకోవాలి. ఈ సాధారణ ఆలయం కాదు. విశ్వాసానికి నిలయంగా శక్తి ప్రసరణకు కేంద్రంగా , జీవితంలో అడ్డంకులు తొలగించే దివ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది.
ఆలయం విశిష్టత
విల్లుపురం జిల్లా సమీపంలోని తిరువక్కరై గ్రామంలో వరాహ నది తీరాన వెలసిన ఈ ఆలయం సుమారు రెండువేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం... 9వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. శైవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన “పాడల్ పెట్ర స్థలాలు”లో ఈ క్షేత్రం ఒకటి కావడం దీని విశిష్టతను మరింత పెంచుతుంది.
ప్రధాన ఆలయంలో దర్శనమిచ్చే చంద్రమౌళీశ్వరుడు.... ప్రత్యేకంగా మూడు ముఖాలతో దర్శనం దర్శనం ఇస్తాడు. తూర్పు ముఖాన్ని తత్పురుష లింగమని, ఉత్తరం వైపున్న ముఖాన్ని వామదేవ లింగమని, దక్షిణంవైపున్న ముఖాన్ని అఘోరలింగమని పిలుస్తారు. ప్రతి దిశలో ఒక భావం, ఒక శక్తి, ఒక అనుభూతి దాగి ఉంది. భక్తుడు ఏ దిశనుండి చూసినా శివతత్త్వం అనుభూతి చెందేలా ఈ నిర్మాణం ఉంది.
ఉపాలయాలు
ఈ ఆలయ మహిమను మరింత విస్తరించే అంశం ఇక్కడి ఉపాలయాలు. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు “ప్రయోగ చక్రేశ్వరుడు”గా దర్శనమివ్వడం విశేషం. పురాణం ప్రకారం వక్రాసురుడు అనే రాక్షసుడు సమస్త జీవరాశిని బాధిస్తున్న సమయంలో మహాశివుని ఆదేశాల మేరకు శ్రీ మహావిష్ణువు కదనరంగంలోకి దిగి వక్రాసురుడిని తన సుదర్శన చక్రంతో తలను ఖండిస్తాడు. వక్రాసురుడి రక్తం నేలపై పడగానే వేల కొలది రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ సమయంలో కాళికాదేవి ఆవిర్భవించి, రక్త బిందువులు నేలపై పడకుండా తన నాలుకతో అడ్డుకుంటూ, ఆ రాక్షస సంహారాన్ని పూర్తి చేస్తుంది. ఈ కారణంగా ఆమెను “వక్రకాళి”గా పూజిస్తారు.
వక్రకాళి
వక్రకాళి అమ్మవారి రూపం ఉగ్రంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆమెను శాంతింపజేయడం కోసం ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో శక్తి, శాంతి సమన్వయం కనిపిస్తోందని భక్తులు చెబుతారు. శివుడు, విష్ణువు, శక్తి వంటి దైవిక శక్తులు ఒకే క్షేత్రంలో ఉండడం అరుదైన విశేషం.
ఈ కారణంగానే ఈ ఆలయానికి రాజకీయ నాయకులు ఎక్కువగా వస్తుంటారు. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన వారు, అధికార బాధ్యతలు చేపట్టే వారు, ఎన్నికల ముందు లేదా ముఖ్యమైన కార్యక్రమాల ముందు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. వక్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే అడ్డంకులు తొలగి, పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్ముతారు. “వక్రం” అంటే వంకరలు, అడ్డంకులు.... ఆ వక్రతను సరిచేసే శక్తి వక్రకాళిదేవికి ఉందనే నమ్మకం బలంగా ఉంది.
ఇక శివరాత్రి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చిన్న గ్రామం అయినా, ఆ రోజుల్లో ఈ ప్రాంతం ఒక ఆధ్యాత్మిక మహానగరంలా మారిపోతుంది. భక్తులు కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చి ఆలయంలోని స్వామివార్లను దర్శించుకుంటారు. రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సాధారణ భక్తులకూ ఇది ఆశ్రయస్థలం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పకుండా కష్టాల నుంచి బయటపడతారని నమ్మకం.




