Tirumala Secrets: తిరమల రహస్యాలు... నడక మార్గం నుంచి రోడ్డు మార్గం వరకు మార్పులు ఎలా జరిగాయో తెలుసా?

నేడు తిరుమలకు భక్తులు అత్యంత సులభంగా వెళ్లి వస్తున్నారు. కానీ, పూర్వం రోజుల్లో తిరుమలకు చేరుకోవడాలంటే చాలా కష్టంగా ఉండేది. రోడ్డు మార్గం ఏర్పడిన విధానం అత్యంత ఆశ్చర్యకరమనే చెప్పాలి.

Balachander
Published on: 19 Sept 2026 8:41 AM IST
Tirumala Secrets: తిరమల రహస్యాలు... నడక మార్గం నుంచి రోడ్డు మార్గం వరకు మార్పులు ఎలా జరిగాయో తెలుసా?
X

Tirumala Secrets: తిరుమల వెళ్లాలంటే ఒకప్పుడు ఏడు కొండలను కాలినడకన దాటాల్సిందే. అడవి దారులు.. చీకటి.. క్రూరమృగాల భయం.. దొంగల బెడద.. ఇవన్నీ దాటి భక్తులు శ్రీవారి దర్శనానికి చేరుకునేవారు. నేడు అదే కొండపైకి నిమిషాల్లో వాహనాలు చేరుతున్నాయి. అసలు కాలిబాట నుంచి ఘాట్‌ రోడ్డు వరకు ఈ మార్పు ఎలా జరిగింది?

కాలిబాట ద్వారా ప్రయాణం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు తిరుమలలో నిత్య పూజలు పూర్తయిన తర్వాత అర్చకులు, సేవకులు కొండ దిగువకు వచ్చేవారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. కొండపై శాశ్వత నివాసాలు పెద్దగా లేకపోవడంతో రాత్రివేళ తిరుమలలో ఉండటం కూడా సులభం కాదు. తరువాత కాలంలో రామానుజాచార్యుల ప్రభావంతో తిరుమలలో పూజా విధానాలు, నిర్మాణాలు, సేవా వ్యవస్థ క్రమంగా రూపుదిద్దుకున్నాయి. తిరుమల నంబి, అనంతాళ్వార్‌ వంటి భక్తులు కొండపైనే ఉండి ఆలయానికి సంబంధించిన సేవల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో తిరుమల కేవలం దర్శన స్థలంగా కాకుండా నిరంతరం భక్తుల సందడి ఉండే క్షేత్రంగా మారడం మొదలైంది. అయితే అప్పట్లో అసలు సవాలు తిరుమలకు చేరుకోవడమే. శేషాచల అడవుల మధ్య నుంచి వెళ్లే కాలిబాటలే ప్రధాన ఆధారం. భక్తులు గుంపులుగా ప్రయాణించేవారు. మార్గమధ్యంలో విశ్రాంతి కోసం సత్రాలు ఏర్పడ్డాయి. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రయాణ సౌకర్యాల అవసరం కూడా పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి నుంచి తిరుమలకు మెట్ల మార్గం ఏర్పడింది. సుమారు 1870 ప్రాంతంలో అలిపిరి మెట్టు మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చినట్లు చారిత్రక వివరాలు పేర్కొంటున్నాయి. నేటికీ వేలాది మంది భక్తులు ఈ మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకోవడం ఆ పాత సంప్రదాయానికి కొనసాగింపే.

బ్రిటీష్‌ కాలంలో మరో కీలక మలుపు

తిరుమల ప్రాచుర్యం పెరుగుతున్న సమయంలో బ్రిటీష్‌ పాలనలో ఆలయ నిర్వహణపై కూడా అధికారిక జోక్యం ఏర్పడింది. 1817లో ఆలయ నిర్వహణ బాధ్యతలు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిధిలోకి వెళ్లాయి. 1821లో బ్రూస్‌ అనే అధికారి కాలంలో కొన్ని పరిపాలనా నిబంధనలు రూపొందించబడ్డాయి. ఇవే తర్వాత ‘బ్రూస్‌ నియమాలు’గా ప్రాచుర్యం పొందాయి. అయితే కొంతకాలానికే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆలయ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. 1843లో ఆ బాధ్యతలు హథీరాంజీ మఠానికి అప్పగించబడ్డాయి. సుమారు తొమ్మిది దశాబ్దాల పాటు మహంతుల ఆధ్వర్యంలో ఆలయ వ్యవహారాలు కొనసాగాయి. తిరుమలకు రోడ్డు నిర్మాణం మాత్రం మరో పెద్ద మార్పుకు నాంది పలికింది.

విశ్వేశ్వరయ్య సర్వే.. ఘాట్‌ రోడ్డుకు బాట

రోడ్డు రవాణా విస్తరిస్తున్న కాలంలో తిరుమలకు కూడా వాహనాలు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలనే ఆలోచన ముందుకు వచ్చింది. దీనికోసం ప్రముఖ భారతీయ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించినట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. కొండల స్వభావం, మలుపులు, ఎత్తుపల్లాలను పరిశీలించిన అనంతరం రోడ్డు నిర్మాణానికి అనువైన మార్గాన్ని గుర్తించారు. చివరకు 1944 ఏప్రిల్‌ 10న తొలి ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొత్తం 57 మలుపులతో ఈ మార్గాన్ని రూపొందించారు. ఆ రోజుల్లో అది సాధారణ రోడ్డు కాదు. అడవి జంతువులు, దొంగల భయం మధ్య కొండపైకి వస్తువులను తరలించడం పెద్ద సవాలుగా ఉండేది. మొదట్లో ఎడ్లబండ్ల ద్వారా సరుకులు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత భక్తుల రాక పెరగడంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో కేవలం రెండు బస్సులతోనే రాకపోకలు సాగినట్లు చెబుతారు.

రెండో ఘాట్‌ రోడ్డుతో ప్రయాణం మరింత సులభం

భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటంతో ఒకే రహదారిపై రద్దీ, ప్రమాదాల సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మరో రహదారి అవసరం ఏర్పడింది. 1974లో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం దీనిని సాధారణంగా ఎగువ ఘాట్‌ రోడ్డుగా పిలుస్తారు. ఇప్పటి విధానంలో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలు ఒక మార్గాన్ని, తిరుమల నుంచి తిరుపతికి దిగే వాహనాలు మరో మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రాకపోకలు సులభమయ్యాయి. కాలానుగుణంగా రోడ్లను ఆధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేస్తూ భక్తుల ప్రయాణానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా చూస్తే తిరుమల ప్రయాణం కూడా ఒక చారిత్రక పరిణామమే. ఒకప్పుడు అడవి కాలిబాట.. తర్వాత మెట్ల మార్గం.. ఆపై 57 మలుపుల ఘాట్‌ రోడ్డు.. చివరకు రెండు ఘాట్‌ రోడ్లతో భారీ వాహన రాకపోకలు. శతాబ్దాలుగా మారింది ప్రయాణ విధానమే కానీ, శ్రీవారి దర్శనం కోసం కొండెక్కే భక్తుడి ఆరాటం మాత్రం ఇప్పటికీ అదే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.