Tirumala Ananda Nilayam Secret: శ్రీనివాసుడి ఆవిర్భావ రహస్యం...ఆనందనిలయం వెనుక ఈ చిన్నరంధ్రాన్ని మీరెప్పుడైనా చూశారా?

తిరుమల ఆనందనిలయం వెనుక ఉన్న రామానుజాచార్యుల విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏంటి? వెయ్యేళ్ల క్రితం స్వామివారి భుజాలపై శంఖచక్రాలు ఎలా చేరాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 21 May 2026 10:29 AM IST
Tirumala Ananda Nilayam Secret: శ్రీనివాసుడి ఆవిర్భావ రహస్యం...ఆనందనిలయం వెనుక ఈ చిన్నరంధ్రాన్ని మీరెప్పుడైనా చూశారా?
X

Tirumala Ananda Nilayam Secret: కలియుగంలో కోరిన కోరికలు తీర్చే దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు. ఆ స్వామివారు కొలువైన ప్రదేశం ఆనందనిలయం. అనంతకోటి భక్తుల నమ్మకానికి నిలువుటద్దం ఈ ఆనందనిలయం. ఇక్కడ కొలువైన కోనేటిరాయుడిని ఒక్క క్షణం కన్నులారా దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అయితే, ఈనాడు మనం పూజిస్తున్న ఆ వేంకటేశ్వరుని మూలవిరాట్‌ సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువుదే అని నిరూపించిన ఒక చారిత్రక ఘట్టం, ఆనంద నిలయం వెనుక ఉన్న ఒక రహస్య రంధ్రం గురించిన కథ ప్రతి భక్తుడూ తెలుసుకోవాలి. సుమారు 1000 సంవత్సరాల క్రితం తిరుమల ఆలయంలో జరిగిన ఓ అద్భుత లీలకు, ఆనందనిలయం వెనుకభాగంలో నేటికీ దర్శనమిచ్చే శ్రీ రామానుజాచార్యుల విగ్రహానికి ఉన్న సంబంధం సామాన్య భక్తులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

ఈ విగ్రహం ఎవరిది? వెయ్యేళ్ల క్రితం చెలరేగిన వివాదం!

ఆ రోజుల్లో తిరుమల కొండపై కేవలం ఉదయం వేళల్లో మాత్రమే పూజలు జరిగేవి. స్వయంభూవుడిగా వెలసిన ఆ మూలమూర్తి చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో, ఆ విగ్రహం ఎవరిదనే విషయంలో పెద్ద వివాదం నడిచింది. వైష్ణవులు ఆయనను విష్ణువు అని, శైవులు శివుడని, శాక్తేయులు అమ్మవారి స్వరూపమని వాదించుకున్నారు. ఈ సంశయాన్ని తీర్చగలిగే ఏకైక మహానుభావుడిగా భావించి అందరూ శ్రీ రామానుజాచార్యుల వారిని ఆశ్రయించారు.

ఆనందనిలయం వెనుక తూము.. రామానుజుల దివ్య పరీక్ష

రామానుజులవారు అందరికీ ఆమోదయోగ్యమైన ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఆనందనిలయం గర్భగుడిని శుభ్రం చేసిన నీరు వెనుక వైపు ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా బయటకు వచ్చేది. రామానుజులవారు బంగారం, వెండితో శంఖ చక్రాలను తయారు చేయించి, రాత్రి వేళ తూము వద్ద ఉంచి ఆలయ తలుపులు మూసివేయించారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచి చూసేసరికి, ఆ శంఖ చక్రాలు స్వామివారి భుజస్కందాలపై అలంకరింపబడి ఉన్నాయి. ఈ అద్భుతాన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని లోకానికి స్పష్టమైంది. పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి శేషతల్పమైన ఆదిశేషుడు పాము రూపంలో ఆ చిన్న రంధ్రం ద్వారా గర్భగుడిలోకి ప్రవేశించి, ఆ శంఖచక్రాలను స్వామివారి భుజాలపై ఉంచాడని పెద్దలు చెబుతారు.

నేటికీ సజీవ సాక్ష్యం

ఈ అద్భుతం జరిగి సుమారు వెయ్యేళ్లకు పైగా అయింది. ఈ అద్భుతం జరిగిన తరువాత పవిత్రమైన ఆ రంధ్రాన్ని మూసివేశారు. ఆ రంధ్రం వద్ద అద్భుతం జరిగిందని చెప్పడానికి గుర్తుగా, భవిష్యత్‌ ప్రపంచానికి ఈ అద్భుతాన్ని తెలియజేసేందుకు వెనుక భాగంలో రామానుజులవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేటీకీ తిరుమల వెళ్లే భక్తులు ఆనందనిలయం చుట్టూ ప్రదక్షిణ చేసేసమయంలో వెనుకభాగంలో ఉన్న రామానుజుల వారి విగ్రహాన్ని, ఆనాటి లీలకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు. నమ్మి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కలియుగదైవంగా ఆ కోనేటిరాయుడు కీర్తించబడుతున్నాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story