Tirumala Darshan Tips: వేసవిలో శ్రీవారిని శీఘ్రంగా ఎలా దర్శించుకోవాలంటే

గీష్మంలో ఎండలు మండుతున్నా... వేసవి సెలవుల్లో ఆపదమొక్కులవాడిని దర్శించుకోవాలనే భక్తుల తపన తగ్గదు. అయితే, ఈ రద్దీ సమయంలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా, ప్రణాళికాబద్ధంగా స్వామివారిని

Balachander
Published on: 5 May 2026 1:17 PM IST
Tirumala Darshan Tips:   వేసవిలో శ్రీవారిని శీఘ్రంగా ఎలా దర్శించుకోవాలంటే
X

Tirumala Darshan Tips: గీష్మంలో ఎండలు మండుతున్నా... వేసవి సెలవుల్లో ఆపదమొక్కులవాడిని దర్శించుకోవాలనే భక్తుల తపన తగ్గదు. అయితే, ఈ రద్దీ సమయంలో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా, ప్రణాళికాబద్ధంగా స్వామివారిని ఎలా దర్శించుకోవాలో సూచించే సమగ్ర సమాచారం ఇది. ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రద్దీ అంచనాలకు మించి ఉంటుంది. అడుగడుగున స్వామివారి నామాలతో మారుమ్రోగే వేంకటాద్రిపై సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేటందుకు టీటీడీ పలు దర్శన మార్గాలను అందుబాటులో ఉంచింది.

ముందస్తు ప్రణాళిక - ప్రత్యేక ప్రవేశ దర్శనం

కరోనా తరువాత తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ప్రతి నెలా ముందుగానే టీటీడీ ప్రత్యేక టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతోంది. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను కనీసం రెండు నుంచి మూడు నెలల ముందే బుక్‌ చేసుకోవాలి. దీని వలన క్యూలైన్లలో ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. సామాన్యంగా ఈ టిక్కెట్ ఉన్నవారికి రెండు నుంచి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుంది.

ఉచిత దర్శన టోకెన్లు

ఇక ఆన్‌లైన్లో టిక్కెట్లు లేని భక్తుల కోసం తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వంటి చోట్ల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. వేసవి రద్దీ దృష్ట్యా ఉదయం 4 గంటల నుంచే ఈ టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లో ఉంటున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలోనే ఈ టిక్కెట్లు జారీ చేయడం పూర్తవుతాయి. ఈ టోకెన్లు పొందినవారు వారికి కేటాయించిన స్లాటెడ్‌ సమయం ప్రకారం స్వామివారిని దర్శించుకోవచ్చు.

శ్రీవాణి ట్రస్ట్ - అప్పటికప్పుడు దర్శనం

ఎలాంటి టిక్కెట్లు దొరకని వారు, దానగుణం కలిగిన భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ. 10,000 విరాళం ఇచ్చి, అదనంగా రూ. 500 టిక్కెట్ కొనుగోలు చేయడం ద్వారా 'బ్రేక్ దర్శనం' పొందవచ్చు. ఇది అత్యంత వేగంగా స్వామిని చేరుకునే మార్గం. అంతేకాదు, తిరుమలలో గదులు దొరకడం వేసవిలో పెద్ద సవాలు. ఆన్‌లైన్‌లో బుకింగ్ లభించని వారు, తిరుమలలోని సీఆర్‌వో ఆఫీసు వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా ఆన్‌లైన్‌లో గదులు కావాలనుకునేవారు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. గదులు దొరకని పక్షంలో పీఏసీ (PAC) లలోని లాకర్లను వాడుకోవడం ఉత్తమం.

తిరుమల మాడ వీధుల్లో ఎండ తీవ్రత నుంచి రక్షణకు టీటీడీ కూల్ పెయింటింగ్ వేసినా, భక్తులు తగినంత నీరు తాగుతూ ఉండాలి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారు మధ్యాహ్న సమయాల్లో దర్శనానికి వెళ్లకుండా ప్లాన్ చేసుకోవడం మంచిది. "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అన్నట్లు, భక్తితో పాటు కాస్త ఓర్పు, సరైన సమాచారం ఉంటే తిరుమల యాత్ర పరమానందదాయకం అవుతుంది. వెళ్లేముందు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా 'గోవింద' యాప్‌ను ఒకసారి తనిఖీ చేయడం మరువకండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story