Tirumala Golla Mandapam: తిరుమల గొల్లమండపం రహస్యం...మజ్జిగతో వైకుంఠాన్ని చేరిన మహిళ
తిరుమల గొల్లమండపం వెనుక ఉన్న పవిత్ర కథ ఏమిటి? మజ్జిగతో స్వామివారి సేవ చేసిన గొల్లపిల్లకు శ్రీరామానుజాచార్యుల అనుగ్రహంతో మోక్షం ఎలా లభించిందో తెలుసుకుందాం.
Tirumala Golla Mandapam: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధి అయిన తిరుమల ఆనంద నిలయం ఎదుట దర్శనమిచ్చే నాలుగు కాళ్ల గొల్లమండపం కేవలం ఒక చారిత్రక నిర్మాణం మాత్రమే కాదు, అది ఒక సామాన్య యాదవ వనిత నిష్కామ సేవకు లభించిన మోక్షానికి ప్రతీక. త్రేతాయుగంలో శ్రీరాముని కార్యానికి ఒక చిన్న ఉడత చేసిన సాయం ఎలా చిరస్థాయిగా నిలిచిపోయిందో, ఈ కలియుగంలో స్వామివారి సేవకులకు మజ్జిగ అందిస్తూ ఉడతాభక్తిగా సేవ చేసిన ఒక గొల్లపిల్ల సైతం సాక్షాత్తు రామానుజాచార్యుల దివ్య ఆశీస్సులతో పరమపదాన్ని పొందింది. ఈ పవిత్ర స్థల పురాణ ప్రాశస్త్యం గురించి గొల్ల మండపం గురించి తెలుసుకుందాం.
తిరుమల నివాసాల నిర్మాణం ... గొల్లపిల్ల సేవ
9వ శతాబ్దానికి పూర్వం తిరుమల కొండపై కేవలం స్వామివారి పూజాది కైంకర్యాలు మాత్రమే జరిగేవి, ఉత్సవాలన్నీ కింద ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయంలో సాగేవి. జగద్గురు శ్రీ రామానుజాచార్యులవారు పట్టుబట్టి తిరుమలలోనే నిత్య ఉత్సవాలు జరగాలని నిశ్చయించారు. అందుకోసం కొండపైన అర్చకులు, ఆచార్యుల కోసం నివాసాల నిర్మాణ పనులు చేపట్టారు. ఆ నిర్మాణ బాధ్యతలను రామానుజుల గురువైన తిరుమల నంబి, శిష్యుడైన అనంత ఆళ్వార్ పర్యవేక్షించేవారు. ఆ నిర్మాణ సమయంలో ప్రతిరోజూ ఒక యాదవ గొల్లపిల్ల నిండు కడవలో మజ్జిగ తీసుకుని దట్టమైన అటవీ బాట వెంట కొండపైకి వచ్చేది. కూలీలు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎండనకా వాననకా నిస్వార్థంగా ప్రతిరోజూ శ్రామికులకు, సేవకులకు మజ్జిగను చల్లగా అందించేది.
వైకుంఠ ప్రాప్తి కై వేడుకోలు
ఆమె నిష్కల్మషమైన సేవను చూసి ముచ్చటపడిన భక్తులు ఆమెను తిరుమల నంబి గారి వద్దకు తీసుకెళ్లారు. ఆమె ఆయనకు మజ్జిగ సమర్పించి ... "సామీ! మీరు రోజూ గోవిందస్వామితో మాట్లాడతారు కదా, నాకూ వైకుంఠం వస్తుందో రాదో ఆ స్వామిని కాస్త అడిగి చెప్పరూ" అని అడిగింది. అప్పట్లో తిరుమల నంబి చిరునవ్వుతో వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించే అధికారం రామానుజాచార్యులకే ఉందని తెలిపారు.
శ్రీ రామానుజుల అనుగ్రహం ... మోక్ష సిద్ధి
కొద్దిరోజుల తర్వాత రామానుజాచార్యులవారు తిరుమలకు విచ్చేసినప్పుడు, ఆ గొల్లపిల్ల ఆయనకు కూడా భక్తితో మజ్జిగను సమర్పించి తన మనసులోని వైకుంఠ కోరికను విన్నవించుకుంది. ఆమె అమాయకత్వంతో కూడిన నిశ్చల భక్తికి, నిస్వార్థ సేవకు ముగ్ధుడైన రామానుజులవారు "పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక" అని మంత్రించిన ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారు. ఆ దివ్య స్పర్శ, ఆశీర్వచనం పొందిన మరుక్షణమే ఆ గొల్లపిల్ల జీవుడు కర్మబంధాల నుండి విముక్తి పొంది పరమపదాన్ని చేరుకున్నాడు.
నాలుగు కాళ్ల గొల్లమండపం విశ్లేషణ
సాధారణ మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన ఆ గొల్లపిల్ల సేవను, ఆమె పవిత్ర జ్ఞాపకాన్ని యుగయుగాలు నిలబెట్టేందుకు ఆలయ మహ ద్వారానికి ఎదురుగా ఈ నాలుగు కాళ్ల గొల్లమండపాన్ని ఏర్పాటు చేశారు. భగవంతుడికి కోట్లాది రూపాయల సంపద కంటే నిస్వార్థమైన చిన్న సేవ, స్వచ్ఛమైన భక్తి మాత్రమే ముఖ్యమని ఈ పవిత్ర ఘట్టం మనకు బోధిస్తోంది.




