Tirumala Yatra: తిరుమల యాత్ర చేస్తున్నారా... ఈ ఆలయాన్ని దర్శించకుంటే యాత్ర అసంపూర్ణమే

తిరుమల యాత్రకు వెళ్తున్నారా? తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఎందుకు దర్శించాలి? ఆలయ చరిత్ర, పురాణ గాథ, పూజా విశేషాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 7 Sept 2026 8:30 AM IST
Tirumala Yatra: తిరుమల యాత్ర చేస్తున్నారా... ఈ ఆలయాన్ని దర్శించకుంటే యాత్ర అసంపూర్ణమే
X

Tirumala Yatra: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఏటా తిరుపతికి వస్తుంటారు. అయితే, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారి ఆలయ పుష్కరిణి పద్మసరోవరం తూర్పు తీరాన ఉన్న అత్యంత ప్రాచీన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటేనే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని వేంకటాచల మహత్యం చెబుతోంది. స్వయంగా ఆ శ్రీనివాసుడే పద్మావతి దేవిని పొందేందుకు 12 ఏళ్ల పాటు తపస్సు చేసి ఆరాధించిన ప్రత్యక్ష దైవం ఈ సూర్యభగవానుడు. ఈ క్షేత్ర విశేషాలు, చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక మహత్యాల గురించి తెలుసుకుందాం.

లక్ష్మీదేవి కోసం శ్రీహరి తపస్సు ... ఆలయ ఆవిర్భావం

పౌరాణిక కథనం ప్రకారం, భృగు మహర్షి ఉదంతం తర్వాత వైకుంఠం వీడిన శ్రీలక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసుడికి ఒక ఆకాశవాణి ఆదేశం లభిస్తుంది. స్వర్ణముఖి నది తీరాన ఉన్న శుకమహర్షి ఆశ్రమంలో శ్రీనివాసుడు తన ఈటెతో ఒక పెద్ద తటాకాన్ని తవ్వి, దేవలోకం నుంచి తెచ్చిన బంగారు తామరలను నాటాడు. అదే నేటి పద్మసరోవరం. ఆ సరస్సు తీరాన సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన శ్రీహరి, ప్రతిరోజూ 1,000 బంగారు పద్మాలతో వరుసగా 12 సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరించాడు. ఈ తపస్సుకు మెచ్చి కార్తిక శుద్ధ పంచమి నాడు పద్మసరోవరంలో ఆవిర్భవించిన బంగారు పద్మం నుంచే పద్మావతి దేవి లక్ష్మీరూపంలో దర్శనమిచ్చింది.

6వ శతాబ్దపు చరిత్ర ... పునర్నిర్మాణం

ఈ ఆలయంలో 6, 7వ శతాబ్దాల నాటి నుంచే పూజలు జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విజయనగర రాజుల కాలంలో ఎంతో వైభవంగా విరాజిల్లిన ఈ దేవాలయాన్ని 1866లో మహంతుల పాలనలో 'ధర్మదాసు జీ మహంత్' పునర్నిర్మించి, మూలవిరాట్‌ను పునఃప్రతిష్ఠించారు. గర్భాలయంలో నల్లని రాతితో చెక్కిన నిలువెత్తు సూర్యనారాయణ స్వామి రెండు చేతుల్లో పద్మాలు ధరించి అభయమిస్తారు. ఇక్కడ సుమారు 3.5 అడుగుల ఎత్తు ఉన్న ఉత్సవమూర్తి కూడా ఉంది.

విశేష పూజోత్సవాలు ... ఆరోగ్య ప్రసాది

ప్రతి ఆదివారం ఉదయం స్వామివారికి దాదాపు గంట పాటు వేదమంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలతో వైభవంగా అభిషేకం జరుగుతుంది. ప్రతి నెలా స్వామివారి జన్మనక్షత్రమైన 'హస్తా నక్షత్రం' రోజున సాయంత్రం బంగారు తిరుచ్చిపై స్వామివారి మాడ వీధుల ఊరేగింపు ఉంటుంది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు సూర్యప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అన్నట్లు, పద్మసరోవరంలో పవిత్ర స్నానం ఆచరించి ఈ సూర్యనారాయణ స్వామిని దర్శిస్తే కంటి సమస్యలు, చర్మవ్యాధులు, దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. జాతకంలో నవగ్రహ దోషాలు, సూర్య గ్రహ పీడలు ఉన్నవారు ఇక్కడ ఆర్జిత అభిషేకం చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తిరుమల వెళ్లే భక్తులు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story