Tirupati Gangamma Jathara: తిరుపతి గంగమ్మ జాతరలో విచిత్ర వేషాలు...900 ఏళ్ల చరిత్ర వెనుక రహస్యం

తిరుపతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఏడుకొండల వేంకటేశ్వరస్వామి. కానీ, ఆ స్వామివారే స్వయంగా తన సోదరిగా భావించి ‘సారె’ పంపే శక్తి స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మ.

Balachander
Published on: 5 May 2026 8:54 AM IST
Tirupati Gangamma Jathara: తిరుపతి గంగమ్మ జాతరలో విచిత్ర వేషాలు...900 ఏళ్ల చరిత్ర వెనుక రహస్యం
X

Tirupati Gangamma Jathara: తిరుపతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఏడుకొండల వేంకటేశ్వరస్వామి. కానీ, ఆ స్వామివారే స్వయంగా తన సోదరిగా భావించి ‘సారె’ పంపే శక్తి స్వరూపిణి తాతయ్యగుంట గంగమ్మ. దాదాపు 900 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అన్యాయంపై ఒక సామాన్య స్త్రీ సాధించిన అసాధారణ విజయగాథ. ప్రతి ఏడాది వైశాఖమాసంలో గంగమ్మ జాతరను తిరుపతిలో ఘనంగా జరుపుకుంటారు.

ఆవిర్భావం వెనుక గగుర్పాటు కలిగించే కథ

చారిత్రక కథనం ప్రకారం.. పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలను పాలించే ఒక దుష్ట ‘పాలెగాడు’ స్త్రీల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. పెళ్లైన కొత్త వధువులను చెరబట్టేవాడు. అతని ఆగడాలను అరికట్టడానికి జగన్మాత గంగమ్మగా అవతరించింది. ఆమె సౌందర్యాన్ని చూసి మోహించిన పాలెగాడు, ఆమెను దక్కించుకోవాలని ప్రయత్నించగా.. గంగమ్మ విశ్వరూపం దాల్చింది. భయంతో ఆ పాలెగాడు అడవుల్లో దాక్కున్నాడు. ఈ కథ ఈనాటి మృగాళ్లకు కూడా ఓ కనువిప్పనే చెప్పాలి. స్త్రీల పట్ల ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కథ మనకు సూచిస్తుంది.

విచిత్ర వేషధారణలు - వేట కోసం వేసిన ఎత్తుగడ!

అడవిలో దాక్కున్న పాలెగాడిని బయటకు రప్పించేందుకు గంగమ్మ ఏడు రోజులపాటు ఏడు రకాలైన వేషాలు వేసింది. దీనికి అనుగుణంగా తిరుపతి గంగమ్మ జాతరలో భక్తులు ఏడు రోజులపాటు ఏడు రకాలైన వేషాలు ధరిస్తారు. దీని వెనుకనున్న పరమార్థం ఇదే. మొదటిరోజున భక్తులు బైరాగి వేషం వేస్తారు. ఈరోజు నుంచి భక్తులు విభిన్నరూపాల్లో మనకు దర్శనం ఇస్తుంటారు. అలాగే పాలెగాడికి స్త్రీలంటే వ్యామోహంతో ఉంటాడు కాబట్టి పురుషులు కూడా చీరలు కట్టుకొని అతడిని బ్రమింపజేసేలా వేషాలు ఉంటాయి. ఇక చివరి రోజున మాతంగి రూపంలో గంగమ్మ తల్లి పాలెగాడిని బయటకు రప్పించి సంహరిస్తుంది. ఈ జాతరలో భక్తులు నోటికి వచ్చినట్టు తిడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి ఓ కారణం ఉంది. పాలెగాడిని బయటకు రప్పించేందుకు నాడు ప్రజలు చేసిన హేళనలే నేటి బూతు తిట్ల సంప్రదాయంగా మారింది.

విశ్వరూప దర్శనం - మట్టి ప్రసాదం

జాతర ముగింపు రోజున కైకాల కులస్తులు మట్టితో చేసిన గంగమ్మ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవం పూర్తయ్యాక ఆ విగ్రహం నుంచి ‘కనుగుడ్లు’ తొలగించి విగ్రహాన్ని భగ్నం చేస్తారు. ఆ మట్టిని ‘గంగమ్మ ప్రసాదం’గా భక్తులు స్వీకరిస్తారు. ఈ మట్టి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మట్టికోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని చేరుకుంటారు. మట్టి రేణువు మాత్రం దొరికినా చాలని, ఆ ఏడాది ఎటువంటి కష్టాలు రావని భక్తుల నమ్మకం.

ఈ జాతర మే 5 నుంచి ప్రారంభం అవుతుంది. మే 12న శ్రీవారి సారెతో సమర్పణతో ముగుస్తుంది. తిరుమల శ్రీవారు గంగమ్మను స్వయానా తన సోదిరిగా భావిస్తారు. తిరుమల నుంచి పసుపు, కుంకుమ తిరుపతి గంగమ్మ వద్దకు వస్తుంది. 900 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్టుగా భక్తులు చెబుతారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story