Ayodhya: శ్రీరాముని వనవాస సమయంలో అయోధ్యను పరిపాలించిన చెట్టు
భగవంతుని అనుగ్రహం ఉంటే ఒక సాధారణ చెట్టు కూడా చక్రవర్తి కాగలదు అనడానికి రామాయణంలోని ఒక అద్భుత ఘట్టమే నిదర్శనం.
Ayodhya: మనపై భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు. దానికి కావలసింది పరోపకారం, ఓర్పు, శ్రమ. ఈ మూడు ఎవరైనా సరే చక్రవర్తి కాగలరు. ఓ సాధారణ చెట్టు కూడా చక్రవర్తి కాగలదు అని నిరూపించింది. దీనికి సంబంధించిన ఘట్టం రామాయణంలో ఉంది. శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేశాడు. ఆ సమయంలో అయోధ్యను పరిపాలించింది ఎవరో తెలుసా... ఓ పరోపకారి వృక్షం. ఈ వృక్షం నుండి తయారైన దివ్యపాదుకలు సింహాసనాన్ని అధిరోహించి పరిపాలన సాగించాయి. ఈ పరమపవిత్రమైన పాదుకల చెట్టు కథ గురించి తెలుసుకుందాం.
గురువుగారి దివ్య దృష్టి – చెట్టు కోరిక
అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ మార్గంలో ఒక సిద్ధ పురుషుడు తన శిష్య బృందంతో కలిసి ప్రయాణిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయిన ఆ బృందం, మార్గమధ్యంలో ఉన్న ఒక పెద్ద వృక్షం నీడన విశ్రాంతి తీసుకుంది. ఆ రాత్రికి అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి భయంకరమైన ఈదురు గాలులు... భీకరమైన శబ్ధాలు. కానీ, ఆ గాలులను తట్టుకొని తన కింద నిద్రపోతున్న గురువు, ఆయన శిష్యబృందానికి ఇబ్బంది లేకుండా చూసింది చెట్టు. శిష్యులంతా నిద్రపోతున్నా, గురువుగారు మాత్రం మేల్కొనే ఉన్నారు. తెల్లవారిన తర్వాత గురువుగారు ఆ చెట్టు వైపు తదేకంగా చూస్తూ, అత్యంత భక్తితో "తథాస్తు! నీ కోరిక నెరవేరుగాక" అని ఆశీర్వదించారు.
దీన్ని గమనించిన ఒక శిష్యుడు ఆశ్చర్యపోయి, "గురుదేవా! చేతన లేని వృక్షాన్ని ఎందుకు ఆశీర్వదించారు?" అని అడిగాడు. దానికి ఆ గురువు చిరునవ్వుతో, "ఈ చెట్టుకు ఈ జన్మలోనే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలనే కోరిక ఉంది. అది త్వరలోనే నెరవేరుతుంది" అన్నారు. చెట్టు చక్రవర్తి కావడం ఏమిటని శిష్యుడు మనసులోనే నవ్వుకున్నాడు.
పరోపకారానికి లభించిన పరమార్థం
గురువుగారు శిష్యుని సందేహాన్ని గమనించి ఇలా వివరించారు. "నాయనా! ఈ వృక్షం పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలను, ఎండను, వానను తట్టుకుని పెరిగింది. అయినా స్వార్థం లేకుండా మనలాంటి బాటసారులకు నీడను, ఆకలితో ఉన్నవారికి తీపి ఫలాలను ఇచ్చింది. ఇంతటి పరోపకార గుణం ఉన్న వృక్షం కోరికను ఆ భగవంతుడు తప్పక తీరుస్తాడు." అంటాడు. ఆ మరుసటి రోజే ఒక పెద్ద గాలివానకు ఆ చెట్టు నేలకూలింది. కొద్దిరోజుల తర్వాత ఆ అడవికి వచ్చిన వడ్రంగులు, కూలిపోయిన ఆ వృక్షపు కలపతో అందమైన పాదుకలను తయారుచేశారు. ఆ పాదుకలను మరెవరో కాదు, ఆ శ్రీరామచంద్రమూర్తి తన పాదాలకు ధరించారు.
14 ఏళ్ల రాజ్యపాలన
రాముడు వనవాసానికి వెళ్లే సమయంలో, భరతుడు అన్నగారి పాదాలపై పడి ఆ దివ్య పాదుకలను యాచించి తెచ్చుకున్నాడు. రాముడు లేని అయోధ్య సింహాసనంపై ఆ పాదుకలను ఉంచి, భరతుడు ప్రతినిధిగా సేవచేశాడు. అలా ఆ వృక్షం, పాదుకల రూపంలోకి మారి 14 సంవత్సరాల పాటు అయోధ్య సామ్రాజ్యానికి అప్రతిహతమైన చక్రవర్తిగా పూజలందుకుంది. జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకుని, ఇతరులకు మేలు చేస్తూ బతికేవారిని భగవంతుడు ఏదో ఒక రూపంలో అందలం ఎక్కిస్తాడు అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. స్వార్థం లేని సేవకు ఎప్పుడైనా సరే దైవకృప లభించి తీరుతుంది. పరులను దూషించకుండా పరులకు ఉపయోగపడే పనులు చేస్తూ జీవితాన్ని గడుపుదాం... మనం కూడా ఆ చెట్టు మాదిరిగానే పుణ్యాన్ని సంపాదించుకుందాం.




