Tulsi Vivah 2026: జీవితంలో సుఖసంతోషాలను నింపే తులసి వివాహం..పూజ ఎలా చేయాలంటే
2026 తులసి వివాహం నవంబర్ 21న జరగనుంది. తులసి కల్యాణం పూజా ముహూర్తం, పూజా విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పాటించాల్సిన సంప్రదాయాలను తెలుసుకుందాం.
Tulsi Vivah 2026: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో తులసి కోటను ఏర్పాటు చేసి ప్రతిరోజూ దీపం వెలిగించి పూజించడం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ప్రత్యేకమైన సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి ఆరాధనకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో నిర్వహించే తులసి వివాహం అత్యంత విశిష్టమైన పర్వదినంగా గుర్తింపు పొందింది. తులసి దేవిని శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపంతో వివాహం చేసే ఈ వేడుకను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వివాహం జరిపించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని, కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. మరి 2026లో తులసి వివాహం ఎప్పుడు? పూజకు అనుకూలమైన సమయాలు ఏవి? ఈ వేడుకను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.
తులసి వివాహం 2026 తేదీ, శుభ ముహూర్తాలు
హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి రోజున తులసి వివాహాన్ని నిర్వహిస్తారు. 2026లో నవంబర్ 21, శనివారం ఈ పర్వదినం వచ్చింది. ఈ సందర్భంగా తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావించి, శాలిగ్రామ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుతో వివాహం జరిపిస్తారు. తులసి వివాహం నవంబర్ 21, 2026, శనివారం నిర్వహిస్తారు. ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ 21 ఉదయం 6:31 గంటలకు ప్రారంభమై నవంబర్ 22 ఉదయం 4:56 గంటలకు వరకు ఉంటుంది. ఇక ప్రదోషకాల పూజా సమయం సాయంత్రం 5:25 నుంచి 7:49 గంటల వరకు ఉంటుంది.
తులసి వివాహం పూజా విధానం ఎలా ఉంటుంది?
తులసి వివాహాన్ని ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవచ్చు. ముందుగా ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటను శుభ్రం చేసి పూలు, మామిడి ఆకులు, రంగవల్లులతో అందంగా అలంకరించాలి. తులసి మొక్కను వధువుగా భావించి చీర, గాజులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. అనంతరం తులసి మొక్కకు సమీపంలో శాలిగ్రామాన్ని ఉంచి శ్రీమహావిష్ణువును వరుడిగా భావించి పూజిస్తారు. తులసి దేవికి కుంకుమ, పసుపు సమర్పించాలి. శాలిగ్రామానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. పూలు, పండ్లు, చెరకు, పంచామృతం, స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. దీపధూపాలు వెలిగించి విష్ణుమంత్రాలు, తులసి స్తోత్రాలు పఠించాలి. అనంతరం వివాహ సంప్రదాయంలో భాగంగా తులసి, శాలిగ్రామాల చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. శాలిగ్రామానికి బియ్యం సమర్పించకుండా నువ్వులు లేదా తెల్ల చందనాన్ని ఉపయోగించడం సంప్రదాయంగా పాటిస్తారు.
తులసి వివాహం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఇదే!
తులసి వివాహం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉండాలనే సందేశాన్ని కూడా ఈ వేడుక గుర్తుచేస్తుంది. తులసి దేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీమహావిష్ణువుతో ఆమె వివాహం జరిపించడం ద్వారా ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వివాహాన్ని నిర్వహించడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. పెళ్లైన దంపతులు తమ వైవాహిక జీవితంలో సుఖశాంతులు ఉండాలని ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. వివాహం కాని యువతులు కూడా తమకు మంచి జీవిత భాగస్వామి లభించాలని తులసి దేవిని ఆరాధిస్తారు.




