Vaishakha Masam 2026: వైశాఖమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఇవే

Vaishakha Masam 2026: శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు.

Balachander
Published on: 17 April 2026 9:01 AM IST
Vaishakha Masam 2026 Important Festivals, Dates and Spiritual Significance Explained
X

Vaishakha Masam 2026: వైశాఖమాసంలో వచ్చే పండుగలు పర్వదినాలు ఇవే

Vaishakha Masam 2026: హైందవ సంప్రదాయంలో చైత్ర మాసానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఆ తరువాత వచ్చే వైశాఖ మాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో దానధర్మాలకు, పవిత్ర స్నానాలకు, జ్ఞానబోధకు, మహాపురుషుల జయంతి ఉత్సవాలకు ప్రసిద్ది. ఈ మాసాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అద్భుతమైన కాలంగా కూడా చెబుతారు. వైశాఖమాసం ఏప్రిల్‌ 18న ప్రారంభమై మే 16తో ముగియనున్నది. ఈ నెల రోజుల కాలంలో ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు భక్తి మార్గంలో పలు పండుగలు కూడా రానున్నాయి.

వైశాఖ శుక్ల పక్షంలో ఏప్రిల్‌ 18 మే 1 వరకు వచ్చే పర్వదినాలు

ఏప్రిల్ 20 (అక్షయ తృతీయ): ఈ మాసంలో అత్యంత కీలకమైన రోజు. కృతయుగం ప్రారంభమైన రోజుగా దీనికి గుర్తింపు ఉంది. అక్షయ తృతీయ నాడు చేసే ఏ చిన్న దానమైనా, పూజ అయినా అక్షయమై మనకు తిరిగి లభిస్తుంది. ఇదే రోజున పరశురామ జయంతి, సింహాచల అప్పన్న చందనోత్సవం ఘనంగా జరుగుతాయి.

ఏప్రిల్ 21, 22: అద్వైత సిద్ధాంత కర్త శ్రీ ఆది శంకరాచార్యుల జయంతి . విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యుల జయంతి. భారతీయ ఆధ్యాత్మికతను నిలబెట్టిన ఇద్దరు మహానుభావుల పుట్టినరోజులు ఈ మాసానికే వన్నె తెచ్చాయి.

ఏప్రిల్ 27 (మోహిని ఏకాదశి): క్షీరసాగర మథనం సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తిన పవిత్ర తిథి. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

ఏప్రిల్ 30 (నృసింహ జయంతి): హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి ఉద్భవించిన రోజు. భయం పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చే పర్వదినం ఇది.

మే 1 (బుద్ధ పూర్ణిమ): శాంతి కపోతం, అహింసా మూర్తి గౌతమ బుద్ధుడు జన్మించిన, జ్ఞానోదయం పొందిన పవిత్ర పూర్ణిమ. బుద్దుడు బోధించిన సూత్రాలను, జీవిత ధర్మాలను తెలుసుకొని ముందుకు సాగడం ఎంతో అవసరం. రోజుతో శుక్ల పక్షం ముగుస్తుంది.

వైశాఖ బహుళ పక్షంలో మే 2 నుంచి మే 16 వరకు వచ్చే పర్వదినాలు

మే 2 (అన్నమయ్య జయంతి): పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మదినం. తిరుమల వేంకటేశ్వరుడిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు పాడారు. నేటికీ ఆ కీర్తనలను తిరుమలలో స్వామివారి కైంకర్య సేవలో ప్రధానంగా ఉండటం విశేషం.

మే 5 (తిరుపతి గంగ జాతర ప్రారంభం): లోకమాత గ్రామదేవత శక్తులకు ప్రతీకగా జరిగే జాతర. తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ జాతర చిత్తూరు, అన్నమయ్య, మదనపల్లి జిల్లాల్లో కొనసాగుతుంది. గ్రామదేవతను ఆరాధించడం వలన దక్షిణాయనంలో వచ్చే రుగ్మతల నుంచి బయటపడతారని అంటారు.

మే 12 (హనుమజ్జయంతి): తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. హనుమంతుని దీక్షలు విరమించే భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతాయి.

మే 16 (అమావాస్య): ఈ రోజుతో వైశాఖ మాసం ముగిసి, మరుసటి రోజు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్టమాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమౌతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story