Vaishakha Purnima: వైశాఖ పౌర్ణమి రోజున వెలిగించే దీపం... మీ బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకం
హైందవ ధర్మంలో వైశాఖ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. మాధవ మాసంగా వైశాఖమాసాన్ని పిలుస్తారు. ఈ మాసంలో చేసే స్నాన, దాన,జపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది.
Vaishakha Purnima Lamp Ritual: హైందవ ధర్మంలో వైశాఖ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. మాధవ మాసంగా వైశాఖమాసాన్ని పిలుస్తారు. ఈ మాసంలో చేసే స్నాన, దాన,జపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున నదీ లేదా సముద్రస్నానం చేసి దీపం వెలిగిస్తే చాలు... జీవితంలోని చీకట్లు తొలగిపోతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడనున్న అరుదైన గ్రహ యోగాలు సామాన్యుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ముహూర్తం - విశిష్టత
వేద గణితం ప్రకారం, ఈ ఏడాది పౌర్ణమి తిథి ఏప్రిల్ 30 రాత్రి ప్రారంభమైనప్పటికీ, ఉదయ కాలంలో తిథి ఉండటం వలన మే 1వ తేదీనే పౌర్ణమి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆ రోజున సిద్ధి యోగం, స్వాతి నక్షత్రం కలవడం ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. ఈ అరుదైన సమయంలో చేసే దీపారాధన మీ అదృష్టపు తలుపులను తెరుస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు. నిత్యం దీపాన్ని వెలిగించేవారింట ఆ పరబ్రహ్మం కొలువై ఉంటుంది.
అదృష్టాన్ని వరించే 4 దీపారాధన మార్గాలు
వైశాఖ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్కకు నీరు పోయాలి. నెయ్యితో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా పౌర్ణమిరోజు రాత్రి ఇంటి ప్రధానద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా వెలిగించడం వలన లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఇంటి గుమ్మంముందు ప్రతిరోజూ దీపం వెలిగిస్తే గురువు అనుగ్రహం కూడా కలుగుతుంది. దీంతో పాటుగా వంటగదిలో అన్నపూర్ణ దీపం వెలిగించాలి. ఇలా వంటగదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ధాన్యానికి, ధనానికి ఎల్లప్పుడూ లోటు ఉండదు. నదీ తీరంలో లేదా సముద్రతీరంలో దీపం వెలిగించి ఆ దీపాన్ని నదిలో లేదా చెరువులో వదలాలి. ఇలా చేయడం వలన పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మనసులో అశాంతి తొలగిపోతుంది. వీలైనంత వరకు ప్రశాంతత లభిస్తుంది.
ఎవరైతే నమ్మకంతో వైశాఖ పౌర్ణమి రోజున మట్టిప్రమిదలో ఇలా దీపం వెలిగిస్తారో...వారింట అనంతమైన అనుకూలమైన శక్తుల ప్రవేశం జరుగుతుంది. భక్తితో చేసే ఏ చిన్న కార్యమైనా వృథాపోదు. సంకల్పం బలంగా ఉంటే ఆ దీపపు కాంతి మీ భవిష్యత్తును వెలిగిస్తుంది.




