Valeshwar Temple Mystery: వాలేశ్వర్ శివాలయం రహస్యం...హనుమంతుడిని ఏమార్చి కాలభైరవుడు ప్రతిష్టించిన శివలింగం
రామేశ్వర ప్రతిష్ఠ కోసం కాశీ నుండి ఆంజనేయుడు తెస్తున్న శివలింగాన్ని కాలభైరవుడు తన మాయాజాలంతో రామగిరిలో ప్రతిష్ఠింపజేయడం, దానిని కదిలించే క్రమంలో హనుమంతుడి వాలం గుర్తులు ఆ లింగంపై పడటం ఈ వాలేశ్వర్ శివలింగం ప్రత్యేకం.
Valeshwar Temple Mystery: రామేశ్వర ప్రతిష్ఠ కోసం కాశీ నుండి ఆంజనేయుడు తెస్తున్న శివలింగాన్ని కాలభైరవుడు తన మాయాజాలంతో రామగిరిలో ప్రతిష్ఠింపజేయడం, దానిని కదిలించే క్రమంలో హనుమంతుడి వాలం గుర్తులు ఆ లింగంపై పడటం ఈ వాలేశ్వర్ శివలింగం ప్రత్యేకం. రామేశ్వర క్షేత్రం తరువాత అంతటి ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం విశేషాలు తెలుసుకుందాం.
క్షేత్ర పురాణం - ఆధ్యాత్మిక గాథ
రావణ సంహారం అనంతరం, బ్రహ్మహత్యా దోష నివారణ కోసం శ్రీరామచంద్రుడు రామేశ్వర తీరంలో శివలింగ ప్రతిష్ఠకు సంకల్పించాడు. కులగురువు వశిష్ఠుడి ఆదేశానుసారం, కాశీ క్షేత్రం నుండి పవిత్ర లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడు వాయువేగంతో బయలుదేరాడు. అయితే, కాశీ నుండి లింగాన్ని తెస్తున్న తరుణంలో, హనుమంతుడు చిత్తూరు-పుత్తూరు మధ్య గల రామగిరి ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ దివ్య లింగ సౌందర్యానికి ముగ్ధుడైన కాలభైరవుడు, ఆ లింగం అక్కడే ఉండిపోవాలని ఆశించి సూర్య, వాయు దేవుల సాయం కోరాడు. వారి ప్రభావంతో హనుమంతుడికి విపరీతమైన దాహం వేసింది. ఆంజనేయుడు వాయుపుత్రుడే అయినప్పటికీ... అద్భుతమైన శివలింగం రామగిరిలో ఏర్పాటు చేయాలన్నది శివసంకల్పం కావడంతో వాయు, సూర్యుడు సహకరించాడు.
కాలభైరవుడి చమత్కారం
దాహంతో అలమటిస్తున్న హనుమంతుడి వద్దకు కాలభైరవుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చాడు. గంగాదేవి అనుగ్రహంతో అక్కడ ఒక కొలనును సృష్టించాడు. హనుమంతుడు ఆ బాలుడిని నమ్మి శివలింగాన్ని చేతికి ఇచ్చి, "నేను వచ్చే వరకు కింద పెట్టవద్దు" అని కోరాడు. కానీ, హనుమ నీళ్లు తాగి వచ్చేలోపే బాలుడు లింగాన్ని నేలపై పెట్టేశాడు. అది భూమిలో గట్టిగా పాతుకుపోయింది.
వాలేశ్వరుడిగా నామకరణం
వచ్చిన హనుమంతుడు లింగాన్ని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. ఆఖరికి తన వాలంతో ఆ లింగాన్ని చుట్టి సర్వశక్తులూ ఒడ్డి లాగాడు. అయినా శివలింగం కదలలేదు సరికదా, వాలం ఒత్తిడికి లింగంపై గుర్తులు ఏర్పడ్డాయి. అప్పుడు హనుమంతుడికి అది కాలభైరవుడి లీలతో జరిగిన 'దేవకార్యం' అని అర్థమైంది. తన వాలంతో ఎత్తడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈ స్వామికి "వాలేశ్వరుడు" అని పేరు వచ్చింది.
ఈ క్షేత్రంలో వాలేశ్వరుడిని దర్శించుకున్న దంపతులకు సంతాన దోషాలు తొలగి, పుత్ర సంతానం కలుగుతుందని వేలాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిత్యం వేలాదిమంది భక్తులు ఈ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించి రామకార్యం కోసం ఇక్కడ వెలిసిన ఈ శివలింగం ముందు మొక్కులు చెల్లించుకుంటారు.




