Varahi Devi: కోర్టు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా... నవరాత్రుల్లో వారాహిదేవిని ఇలా ఆరాధించండి
గుప్త నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం అమ్మవారిని ఇలా ఆరాధించడం వలన కోర్టు, ఆనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
Varahi Devi: సనాతన శక్తి ఆరాధనలో ఆషాఢ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. లౌకిక ప్రపంచానికి పెద్దగా తెలియని, కేవలం ఉపాసకులకు మాత్రమే తెలిసిన అత్యంత శక్తిమంతమైన పర్వదినాలే 'గుప్త నవరాత్రులు'. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి గడ్డు కాలన్నైనా, తీవ్రమైన కష్టాలనైనా ఎదుర్కొనే మనోధైర్యాన్ని ఇచ్చే మహాశక్తి వారాహి దేవి. ప్రస్తుతం సాగుతున్న ఈ గుప్త నవరాత్రులలో భాగంగా నాలుగో రోజు అంటే జూలై 19 ఆదివారం నాడు అమ్మవారిని 'ధూమ్ర వారాహి మాత'గా సనాతన గ్రంథాలు కీర్తిస్తున్నాయి. ఈ పవిత్ర దినాన శత్రుబాధలు, భూ తగాదాలు, కోర్టు సమస్యలతో సతమతమవుతున్న వారు, అలాగే దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడిన వారు అమ్మవారిని ప్రత్యేక పద్ధతిలో అర్చిస్తే సకల పీడల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆదివారం నాడు అమ్మవారికి సమర్పించే జల దీపం, పులిహోర నైవేద్యం వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం.
కోర్టు తగాదాలు, శత్రుబాధలు తొలగించే 'జల దీపం... పులిహోర' నివేదన
ఆదివారం ఉదయం నుంచే ధూమ్ర వారాహి దేవి ఆరాధనలు ప్రారంభమవుతాయి. ఈ రోజున భక్తులు ఆచరించాల్సిన విధి విధానాలను తెలుసుకుందాం. ఒక ప్రమిదలో లేదా పాత్రలో నీటిని ఉంచి, దానిపై నూనె లేదా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. నీటిపై వెలిగే ఈ ప్రత్యేక దీపం వల్ల మనిషిలో ఉన్న అజ్ఞాత భయాలు, మానసిక అశాంతి క్షణాల్లో తొలగిపోతాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శైలిలో, పవిత్రంగా తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నివేదించడం వల్ల ఏళ్ల తరబడి వేధిస్తున్న కోర్టు కేసులు, భూమికి సంబంధించిన వివాదాలు అనుకూలంగా మారుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులను హరించే దైవిక మంత్ర సాధన
ఎంతో కాలంగా మందులు వాడుతున్నా నయం కాని సంక్లిష్టమైన రోగాలతో బాధపడేవారికి ఈ నాల్గవ రోజు ఒక గొప్ప దివ్యౌషధం లాంటిది. ఆదివారం నాడు నిశ్చలమైన మనసుతో, పూజా మందిరంలో కూర్చుని "ధూమ్ర వారాహి సమాయుక్తే సర్వ రోగ వినాశిని మమ దేహం పవిత్రం కురు కురు స్వాహా" అనే శక్తిమంతమైన మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించాలి. కనీసం 108 సార్లు మనస్పూర్తిగా పఠించడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ 23 అక్షరాల మహా మంత్రానికి శారీరక రుగ్మతలను నయం చేసే అద్భుతమైన దైవిక కంపనాలు ఉన్నాయి. సంపూర్ణ విశ్వాసంతో ఈ నామాన్ని స్మరిస్తే దేహం పవిత్రమై, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఉపాసకులు నమ్ముతారు. సకల లోకాలను రక్షించే ఆ వారాహి దేవిని ఈ ఆషాఢ గుప్త నవరాత్రులలో ఆరాధించి, కోర్టు ఇబ్బందుల నుండి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది ఆనందమయ జీవితాన్ని సాగిద్దాం.




