Varahi Navaratri: వారాహి నవరాత్రులు ... ఎలాంటి సమస్యలకైనా ఈ తొమ్మిది దీపాలే పరిష్కారం
వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాలైన దీపాలు, తొమ్మిది నైవేద్యాలు, తొమ్మిది రకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Varahi Navaratri: సనాతన శాక్తేయ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన ఉగ్రస్వరూపిణి, లలితా పరాభట్టారిక సర్వసైన్యాధ్యక్షురాలు శ్రీ వారాహి దేవి. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, శత్రుపీడలు వేధిస్తున్నా ఆ తల్లి నామస్మరణ చేస్తే చాలు.. అవన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. శ్రీ వారాహి అమ్మవారిని ఆరాధించే పవిత్రమైన నవరాత్రుల కాలంలో భక్తులు అత్యంత నిష్ఠతో పాటించాల్సిన 9 విశేష దీపారాధన పద్ధతులు, 9 ప్రత్యేక నైవేద్యాలు, 9 దివ్య శ్లోకాల రహస్యాలను ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా వెలిగించే నూనె దీపాలకంటే, వారాహి నవరాత్రులలో ప్రతి తిథికి నిర్దేశించిన ప్రత్యేక ద్రవ్యాలతో దీపాలు వెలిగిస్తే.. దీర్ఘకాలిక కోర్టు సమస్యలు, అప్పుల బాధలు తీరి అఖండ లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
మొదటి మూడు రోజుల పూజా విధానం...పాడ్యమి నుండి తదియ
మొదటిరోజు ఆదివారాహి. ఈ రోజు పంచభూతాల్లోని పృథ్వీ తత్వాన్ని ప్రతిబింబించే 'కంద దీపం' వెలిగించాలి. అమ్మకు చల్లదనాన్నిచ్చే 'పెరుగన్నం లేదా పానకం' సమర్పించి, "ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వారాహి ధరణీం ధ్రువమ్ హుం ఫట్ స్వాహా" అనే శ్లోకాన్ని పఠిస్తే భూమి, ఇల్లు, కోర్టు సమస్యలు త్వరగా తొలగిపోతాయి.
రెండోరోజు బృహద్ వారాహిని ఆరాధిస్తారు. ధైర్యాన్నిచ్చే ఈ రోజున ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలడానికి ఆవు మూత్రం, గోమయంతో చేసిన 'పంచగవ్య దీపం' వెలిగించి, 'దానిమ్మ గింజలు' నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల రక్త సంబంధ దోషాలు, నరదిష్టి, శత్రు భయం మాయమవుతాయి. ఇక మూడోరోజు స్వప్న వారాహిని ఆరాధిస్తారు. కోరికల నెరవేర్పు కోసం 'కొబ్బరి దీపం' వెలిగించి, అమ్మకు అత్యంత ప్రీతికరమైన 'మినప గారెలు' నివేదించాలి. రాత్రి పడుకునే ముందు స్వప్న వారాహి మంత్రాన్ని 11 సార్లు చదివితే, మీకున్న సమస్యలకు కలలోనే స్పష్టమైన పరిష్కారం లభిస్తుంది.
చవితి నుంచి షష్ఠి వరకు పూజా విధానం
నాలుగో రోజున ధూమ్ర వారాహిని ఆరాధిస్తారు. మానసిక ప్రశాంతత కోసం నీటితో వెలిగించే 'జల దీపం' పెట్టి, అమ్మకు 'పులిహోర' సమర్పించాలి. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు నయమై, శత్రు బాధలు, భూ తగాదాల నుండి విముక్తి కలుగుతుంది. ఇక ఐదో రోజున కిరాత వారాహిని పూజిస్తారు. అప్పుల బాధలు తొలగి ధన ప్రాప్తి కలగడానికి వరిపిండి, బెల్లంతో చేసిన 'పిండి దీపం' వెలిగించి, 'చక్కెర పొంగలి' నివేదించాలి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలిగి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆరో రోజున ఉన్మత్త వారాహిని ఆరాధిస్తారు. సమాజంలో గౌరవం, మాటకు విలువ పెరగడానికి రాళ్ల ఉప్పుపై 'ఐశ్వర్య ఉప్పు దీపం' వెలిగించి, 'కొబ్బరి అన్నం' సమర్పించాలి. దీనివల్ల తాంత్రిక బాధలు, దిష్టి దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి.
సప్తమి నుంచి నవమి వరకు పూజా విధానం
ఏడో రోజున లఘువారాహిని పూజిస్తారు. కుటుంబంలో అన్యోన్యత కోసం బెల్లం ముద్దపై 'బెల్లం దీపం' వెలిగించి, 'అటుకులు-బెల్లం' నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల చిన్న చిన్న గొడవలు సర్దుమణిగి సంతాన సౌఖ్యం సిద్ధిస్తుంది. ఎనిమిదో రోజున అశ్వారూఢ వారాహిని ఆరాధిస్తారు. నవగ్రహాల అనుకూలత కోసం 'నవధాన్యాల దీపం' వెలిగించి, 'నువ్వుల అన్నం లేదా నువ్వుల లడ్డు' సమర్పించాలి. దీనివల్ల గ్రహదోషాలు నివారణై, ఆగిపోయిన పనులు అత్యంత వేగంగా పూర్తవుతాయి. చివరిదైన తొమ్మిదో రోజున మహావారాహిని ఆరాధిస్తారు. నవరాత్రుల ముగింపు రోజైన ఈ నవమి నాడు దుష్టశక్తుల నివారణకు విశేషమైన 'కుష్మాండ దీపం' వెలిగించి, 'పూర్ణం బూరెలు లేదా పరమాన్నం' నివేదించాలి.
చివరి రోజున అత్యంత శక్తివంతమైన రాజ శ్లోకమైన "ఓం ఐం గ్లౌం మహా వారాహి సర్వ దుష్టాన్ నివారయ..." పఠిస్తే సర్వ దోషాలు తొలగిపోయి, ఆ దండనాథ దేవి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. తొమ్మిది రోజుల పాటు ఈ విశిష్ట పూజా క్రమాన్ని భక్తితో ఆచరిస్తే ఎలాంటి కష్టాలనైనా ఆ తల్లి దూరం చేస్తుందని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు.




