Laghu Varahi: వారాహి నవరాత్రులు - కుటుంబంలో అన్యోన్యతను పెంచే లఘువారాహి... పూజా విధానం
గుప్త నవరాత్రుల్లో భాగంగా ఏడో రోజు లఘువారాహిని ఇలా ఆరాధించాలి. తద్వారా కుటుంబంలో సంతోషం, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Laghu Varahi: కుటుంబంలో ఎప్పుడూ కలహాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమయ్యే నిరుత్సాహానికి అద్భుతమైన దివ్య ఔషధం వారాహి అమ్మవారి లఘువారాహి ఆరాధన! గుప్త నవరాత్రులలో అత్యంత శోభాయమానమైన ఏడో రోజున అమ్మవారిని 'లఘు వారాహి' రూపంలో ఉపాసించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగి అన్యోన్యత పెరుగుతుందని, సంతాన ప్రాప్తి లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున బెల్లం ముద్దపై దీపాన్ని వెలిగించడం వల్ల గృహంలో ఐశ్వర్యం పెంపొందడమే కాకుండా, అటుకులు-బెల్లం నైవేద్య సమర్పణతో దీర్ఘకాలిక అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది.
బెల్లం ముద్దపై దీపం... ఐశ్వర్య ప్రాప్తి
ఏడో రోజు పూజలో భాగంగా ఒక శుద్ధమైన బెల్లం ముద్దను ఉంచి, దానిపై మట్టి ప్రమిదను అమర్చి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు. ఈ విశేష దీపారాధన లక్ష్మీదేవి కటాక్షాన్ని అందిస్తుంది. కుటుంబంలో ఉన్న మనస్పర్థలను తుడిచిపెట్టి సభ్యుల మధ్య ప్రేమానురాగాలను రెట్టింపు చేస్తుంది. కలహాలతో సతమతమవుతున్న కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కలహాలు లేని కుటుంబమే ఆరోగ్యం అనే నానుడిని నిజం చేస్తుంది లఘువారహి.
అటుకులు-బెల్లం నైవేద్యం... రుణ విముక్తి
లఘువారాహి అమ్మవారికి అటుకులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని అత్యంత భక్తితో నివేదించాలి. ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల నిరంతరం వేధించే అప్పుల బాధల నుండి ఉపశమనం లభించి, రావలసిన ధనం తిరిగి చేతికి అందుతుంది. ఈరోజుల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నవి రుణ బాధలే. ఈ బాధల నుంచి విముక్తి లభిస్తే జీవితంలో సుఖసంతోషాలకు లోటు ఉండదు. ఇక ఈరోజున సంతానం ప్రాప్తి, కుటుంబ సంతోషం కోసం లఘు వారాహి నమస్తుభ్యం సంతాన సౌఖ్యం దేహి మే కుటుంబ వృద్ధిం కురు స్వాహా అనే మంత్రాన్ని భక్తి శ్రద్దలతో 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వలన ఒకవేళ ఎవరికైనా సంతానం లేకుంటే వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా మనం కోరుకున్నట్టుగా కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహమే స్వర్గసీమ అవుతుంది. ప్రశాంతమైన జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.




