Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? ఆగస్టు 21 లేదా ఆగస్టు 28
Varalakshmi Vratam: ఈ ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ఆచరించాలి? ఆగస్టు 21 లేదా ఆగస్టు 28న అనే సందిగ్ధతపై జ్యోతిష పండితుల క్లారిటీ మరియు శాస్త్ర నియమాలు.
Varalakshmi Vratam: శ్రావణ వరలక్ష్మీ వ్రతం తేదిపై క్లారిటీ ఇచ్చేసిన పంచాంగకర్తలు!
Varalakshmi Vratam: పవిత్రమైన శ్రావణ మాసంలో సిరులు కురిపించే వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు తప్పకుండా ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సమస్య వచ్చి పడింది. 5 వారాలు వచ్చిన నేపథ్యంలో.. మరోవైపు విశిష్టమైన శ్రావణ పౌర్ణమి మూడో శుక్రవారం వచ్చిన నేపథ్యంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ఆచరించాలి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలింతకీ వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలో చూద్దాం.
వరలక్ష్మీ వ్రతం.. విశిష్టత
ఏడాది మొత్తం మహిళలు ఎదురు చూసే వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలోనే వస్తుంది. ఈ సందర్భంగా మహిళలు వరాలు ప్రసాదించే వరలక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామ పూజలు, తోరపూజ, ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం, తాంబూలదానం మొదలైన కార్యక్రమాలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. కుటుంబ అభివృద్ధి, సుమంగళితనం, సంతాభివృద్ధి, సిరిసంపదలు, యోగక్షేమాల కోసం సుమంగళి స్త్రీలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని స్కంద పురాణంలో వివరించి ఉంది. అయితే ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం వల్ల వరలక్ష్మీ వ్రతం విషయంలో సందిగ్ధతకు కారణమైంది
ఆగస్టు 21 లేదా ఆగస్టు 28
ఆగస్టు 21, శ్రావణ మాసంలో రెండో శుక్రవారం. సాధారణంగా ఎవరైనా ఈ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఆగస్టు 28, పౌర్ణమి తిథి, శ్రావణ మాసం మూడో శుక్రవారం రెండూ కలిసి రావడం వల్ల ఈ గందరగోళం ఏర్పడింది. పౌర్ణమికి ముందు శుక్రవారం అయినా పౌర్ణమితో కూడిన శుక్రవారం అయిన ఒకటే అని శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 28 నే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని మెజార్టీ జ్యోతిష పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రత నిర్ణయంలో ఈ ఏడాది కొంత ప్రత్యేకత ఉంది. శ్రావణ పౌర్ణమి తిథి శుక్రవారాన్ని రావడం వల్ల ధర్మనిర్ణయంలో పేర్కొన్న 'నోపాంతే భార్గవాదినే' అనే నియమం ప్రకారం పూర్ణిమ తిథి వచ్చిన శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చనే నియమం వర్తిస్తుంది. అందుకే ఆగస్టు 28 నే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు స్పష్టం చేస్తున్నారు.
జ్యోతిష్య ప్రముఖులు ఇస్తున్న క్లారిటీ
సాధారణంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజలు, వ్రతం సాయంకాలం ఆచరిస్తారు. అయితే ఆగస్టు 28 న పూర్ణిమ తిథి సాయంత్రానికి లేనందున ఈ సంప్రదాయాన్ని అనుసరించి సాయంకాలం వ్రతం ఆచరించే వారు ఆగస్టు 21, రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు మాత్రం ఆగస్టు 28, మూడో శుక్రవారం రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని మరికొందరు పండితులు చెబుతున్నారు. నిజానికి శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో శ్రేష్టమైనది. ఏ వారం చేసినా మంచి ఫలితాలే వస్తాయి. వరలక్ష్మీ పూజ మనస్పూర్తిగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, హంగూ ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమంటున్నారు ఆధ్యాత్మక ప్రముఖులు.




