Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఈసారి రెండు తేదీలు ఎందుకు?
2026లో వరలక్ష్మీ వ్రతానికి రెండు తేదీలు ఎందుకు వచ్చాయి? ఆగస్టు 21, 28 తేదీల ఆచరణల వెనుక పంచాంగ నిర్ణయం ఏంటో తెలుసుకోండి.
Varalakshmi Vratham 2026
శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు, పేరంటాలతో తెలుగు లోగిళ్లలో సందడి మొదలవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి.
అయితే 2026లో వరలక్ష్మీ వ్రతం తేదీ విషయంలో ప్రత్యేకత కనిపిస్తోంది. ఈసారి వ్రతానికి ఆగస్టు 21, ఆగస్టు 28 అనే రెండు తేదీలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి కారణం వ్రతాన్ని నిర్ణయించే విధానం, పూర్ణిమ తిథి వ్యాప్తి, ఆయా సంప్రదాయాల్లో పాటించే ఆచారాల్లో ఉన్న స్వల్ప భేదాలే.
వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారు?
వరాలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన, తోరపూజ, వాయనదానం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించడం సంప్రదాయం.
కుటుంబ క్షేమం, భర్త ఆయురారోగ్యాలు, సంతానాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి, సౌభాగ్యం కోసం సుమంగళి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం ఎందుకు?
శృంగేరీ శ్రీశారదాపీఠం సంప్రదాయం ప్రకారం వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రధాన పూజలను సాయంకాలంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది పూర్ణిమ తిథి సాయంకాలంలో వ్యాపించి ఉండకపోవడంతో.. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.
అందువల్ల శృంగేరీ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులకు ఆగస్టు 21 తేదీ వరలక్ష్మీ వ్రతంగా పరిగణించబడుతోంది.
ఆగస్టు 28న కూడా ఎందుకు?
సాధారణంగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతానికి ఎంపిక చేస్తారు. అయితే ఈసారి పూర్ణిమ తిథి శుక్రవారాన్ని స్పృశిస్తున్నందున.. ఉదయకాలంలో వ్రతాన్ని ఆచరించే సంప్రదాయంలో ఆగస్టు 28న వ్రతాన్ని నిర్వహించవచ్చనే నిర్ణయం ఉంది.
అందుకే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతానికి రెండు ఆచరణలు కనిపిస్తున్నాయి. శృంగేరీ సంప్రదాయం ప్రకారం ఆగస్టు 21, పూర్ణిమ-శుక్రవార నియమాన్ని అనుసరించే ఉదయకాల వ్రతాచరణలో ఆగస్టు 28 తేదీలు ఉన్నాయి.
భక్తులు తమ కుటుంబ ఆచారం, గురుపరంపర, తాము అనుసరించే పంచాంగ నిర్ణయాన్నే ప్రామాణికంగా తీసుకోవడం మంచిదని ధార్మిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆగస్టు 23న పుత్రద ఏకాదశి
శ్రావణ శుక్లపక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశిగా ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 23న పుత్రద ఏకాదశి రానుంది. సంతానప్రాప్తి, సంతాన శ్రేయస్సు, కుటుంబాభివృద్ధిని కోరుకునేవారికి ఈ ఏకాదశి ప్రత్యేకమైనదిగా పురాణ సంప్రదాయం చెబుతోంది.
ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం, విష్ణుసహస్రనామ పారాయణం, హరినామస్మరణ చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.
ఆగస్టు 26, 27న ఉపాకర్మలు
శ్రావణ మాసానికి వేదాధ్యయన సంప్రదాయంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా వివిధ వేదశాఖలకు సంబంధించిన ఉపాకర్మలను నిర్వహిస్తారు.
ఆగస్టు 26న రుగ్వేద ఉపాకర్మ జరగనుంది. రుగ్వేద పండితులు, విద్యార్థులు రుషితర్పణం, నూతన యజ్ఞోపవీతధారణ, వేదారంభ సంకల్పం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఆగస్టు 27న యజుర్వేద ఆపస్తంబ ఉపాకర్మ నిర్వహిస్తారు. గత ఏడాది వేదాధ్యయనంలో తెలిసీ తెలియక జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, రుషులను స్మరించడం, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం, వేదాధ్యయనాన్ని పునఃప్రారంభించడం ఇందులో ప్రధాన అంశాలు.
అయితే ఉపాకర్మ తేదీల్లో వేదశాఖ, గృహ్యసూత్రం, పూర్ణిమ తిథి వ్యాప్తి, స్థానిక పంచాంగ సంప్రదాయం ఆధారంగా స్వల్ప భేదాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రాఖీ పూర్ణిమకు ప్రత్యేక ప్రాధాన్యం
శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధనంగా కూడా జరుపుకుంటారు. సోదరి తన సోదరుడి చేతికి రక్షాసూత్రం కట్టి అతడి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలను కోరుకోవడం సంప్రదాయం.
అదే సమయంలో సోదరుడు తన సోదరికి ప్రేమ, ఆదరణ, రక్షణ అందిస్తాననే భావాన్ని వ్యక్తం చేస్తాడు. రక్షాబంధనం కేవలం సోదర, సోదరీ బంధానికే పరిమితం కాకుండా పరస్పర విశ్వాసం, ప్రేమ, బాధ్యత, రక్షణకు ప్రతీకగా భావిస్తారు.
గురుమౌఢ్యం తర్వాత శుభకార్యాలకు ముహూర్తాలు
ఈ ఏడాది గురుమౌఢ్యం శ్రావణ శుద్ధ విదియ వరకు కొనసాగుతోంది. దీంతో గురుమౌఢ్యం ముగిసే వరకు వివాహం, గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనం వంటి ప్రధాన శుభకార్యాలను వాయిదా వేయడం సంప్రదాయం.
గురుమౌఢ్య నివృత్తి తర్వాత ఆగస్టు 20, 22, 27, 28, 30, 31 తేదీలను వివాహం, గృహప్రవేశం, గృహారంభం, దేవతా ప్రతిష్ఠ, ఉపనయనం, నామకరణం, అన్నప్రాశనం వంటి శుభకార్యాలకు అనుకూలమైన తేదీలుగా పరిగణించవచ్చని పేర్కొంటున్నారు.
అయితే శుభకార్యానికి తుది ముహూర్తాన్ని నిర్ణయించే ముందు జన్మనక్షత్రం, జన్మరాశి, తారాబలం, చంద్రబలం, లగ్నం, పంచకరహితం, దుర్ముహూర్తం, వర్జ్యం, స్థానిక సూర్యోదయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.




