Velleeswarar Temple: వెల్లీశ్వరర్ సన్నిధిలో కాసేపు కూర్చుంటే చాలు... కంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది
చెన్నై మైలాపూర్‌లోని వెల్లీశ్వరర్ ఆలయం కంటి సమస్యలు, శుక్ర దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పవిత్ర శివక్షేత్రం. ఆలయ పురాణం, పూజా విశేషాలు, భక్తుల విశ్వాసాలు, దర్శన ఫలితాల గురించి తెలుసుకుందాం.
Velleeswarar Temple: కలియుగంలో మానవాళిని వేధించే శారీరక, మానసిక రుగ్మతలకు దైవచింతనే పరమౌషధం. సాధారణంగా జాతకంలో గ్రహదోషాలు ఉంటే శాంతి హోమాలు చేస్తాం, అనారోగ్యం వస్తే ఆసుపత్రులకు పరుగులు తీస్తాం. కానీ, భక్తిపూర్వకమైన ప్రార్థనతోనే నయం కాని దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే మహిమాన్విత క్షేత్రాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కంటి చూపు సమస్యలను, దృష్టి లోపాలను దూరం చేసే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమే మైలాపూర్ వెల్లీశ్వరర్ ఆలయం. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో కొలువై ఉన్న ఈ శివాలయం, కంటి జబ్బులతో బాధపడే భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది.
ఆలయ పురాణ గాథ... శుక్రాచార్యుడికి చూపునిచ్చిన పరమేశ్వరుడు
ఈ క్షేత్ర మహిమ వెనుక ఒక ఆసక్తికరమైన పౌరాణిక వృత్తాంతం ఉంది. శ్రీమహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానమడిగినప్పుడు, రాక్షస గురువైన శుక్రాచార్యుడు దానాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. నీటి పాత్ర ద్వారానికి అడ్డంగా చిన్న కీటకం రూపంలో దూరిన శుక్రాచార్యుడి కంటిని, వామనుడు ఒక దర్భతో పొడుస్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు తన కంటి చూపును కోల్పోతాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని, పోయిన చూపును తిరిగి ప్రసాదించమని శుక్రాచార్యుడు ఈ మైలాపూర్ ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన ముక్కంటి ప్రత్యక్షమై, శుక్రుడికి తిరిగి సంపూర్ణ కంటి చూపును అనుగ్రహించాడు. 'వెల్లీ' అంటే తమిళంలో శుక్రుడు అని అర్థం. శుక్రుడికి ఈశ్వరుడైనందున ఇక్కడి స్వామివారికి వెల్లీశ్వరర్ అనే నామధేయం స్థిరపడింది.
కంటి సమస్యలకు దివ్యౌషధం ... భక్తుల ఆరాధన
దృష్టి లోపాలు ఉన్నవారు, శుక్లాలు లేదా ఇతర కంటి నరాల బలహీనతలతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారి సన్నిధిలో కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు.. ఆ దివ్య వర్చస్సు వల్ల కంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి పవిత్రమైన గంగాజలంతో, బిల్వదళాలతో అభిషేకం చేయిస్తారు. స్వామివారి ముఖమండలం వైపు చూస్తూ మనసారా ప్రార్థించి, నెయ్యితో దీపారాధన చేస్తారు. కంటి ఆపరేషన్ చేయించుకునే ముందు లేదా చేయించుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటూ వందలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.
నవగ్రహ దోష నివారణా క్షేత్రం
ఈ ఆలయం ద్రావిడ శైలిలో అత్యద్భుతమైన శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు వెల్లీశ్వరర్‌గా లింగరూపంలో దర్శనమిస్తే, అమ్మవారు కామకాశి అమ్మాన్ పేరుతో పూజలందుకుంటున్నారు. వీరితో పాటు వినాయకుడు, మురుగన్ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఈ క్షేత్రం శుక్ర గ్రహ స్థలంగా ప్రసిద్ధి గాంచింది. జాతకంలో శుక్రదోషం వల్ల పెళ్లిళ్లు కాకపోయినా, భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నా, లక్ష్మీ కటాక్షం లోపించినా.. ఈ ఆలయంలోని అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. కంటి సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక ధామం ఈ వెల్లీశ్వరర్ ఆలయం.




