Venugopala Swamy Temple Mystery: వేణుగోపాల స్వామి ఆలయంలో వేణువు శబ్ధం...సైన్స్‌కి అందని నిజం
భారతీయ ఆలయ నిర్మాణం వెనుక కేవలం రాళ్లు, నిర్మాణ వస్తువులు మాత్రమే ఉండవు. అందులో విజ్ఞానం, ఆధ్యాత్మిక తరంగాలు మేళవించి ఉంటాయి. దీనికి సాక్ష్యమే కర్ణాటకలోని వేణుగోపాల స్వామి ఆలయం.
Venugopala Swamy Temple Mystery: భారతీయ ఆలయ నిర్మాణం వెనుక కేవలం రాళ్లు, నిర్మాణ వస్తువులు మాత్రమే ఉండవు. అందులో విజ్ఞానం, ఆధ్యాత్మిక తరంగాలు మేళవించి ఉంటాయి. దీనికి సాక్ష్యమే కర్ణాటకలోని వేణుగోపాల స్వామి ఆలయం. హోయసల రాజుల కాలంలో నిర్మితమైన ఈ అపురూప కట్టడం, భక్తి పారవశ్యంతో పాటు సైన్స్‌కు సవాలు విసిరే రహస్యాలను తనలో దాచుకుంది.
జలధిలో 70 ఏళ్ల మౌన ముద్ర
కృష్ణరాజ సాగర్ ఆనకట్టు నిర్మాణ సమయంలో, సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అక్షరాలా 70 ఏళ్ల పాటు కన్నయ్య విగ్రహం నీటి అడుగునే ఉండిపోయింది. 2010లో నీటి మట్టం తగ్గడంతో ఈ ఆలయం మళ్లీ బయటపడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇన్నేళ్లు నీటిలో ఉన్నా ఆ శిల్ప కళాఖండాలు ఏమాత్రం పాడవలేదు. 2011లో దీనిని పునరుద్ధరించి భక్తుల దర్శనార్థం సిద్ధం చేశారు.
శబ్ద తరంగాల మిస్టరీ - వేణువు మోగుతోంది!
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ మురళీకృష్ణుడి విగ్రహం. ఇక్కడ స్వామివారు వేణువు పట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తారు. అయితే ఇక్కడే ఒక వింత జరుగుతుంది. గర్భాలయం ప్రశాంతంగా ఉన్న సమయంలో, స్వామివారి వేణువు నుండి అతి సన్నని, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అసలు వేణువు ఎలా మోగుతుంది అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. గర్భాలయంలో కన్నయ్య చేతిలో ఉన్న వేణువు రంధ్రాల గుండా గాలి ప్రసరించే విధానం వలనే శబ్ధం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఆలయం నిర్మాణాన్ని ధ్వని విజ్ఞానాన్ని అనుసరించి నిర్మించారని అంటారు. ఇక ఆధునిక సైన్స్ దీనిపై ఎన్నో పరిశోధనలు చేసింది. మధురగానం వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ, రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రంలో రెండు ప్రధాన గర్భాలయాలు ఉన్నాయి. ఒకవైపు కేశవుడు, మరోవైపు వేణుగోపాలుడు కొలువై ఉన్నారు. ఆలయం చుట్టూ ఉన్న వరండాలు, యాగశాలలు హోయసల వాస్తు కళకు దర్పణం పడతాయి. సైన్స్ ప్రతిదానికీ కారణం వెతుకుతుంది, కానీ భక్తి మాత్రం అనుభూతిని వెతుకుతుంది. "దేవుడు ఉన్నాడా?" అని తర్కించే వారికి, ఏడు దశాబ్దాల పాటు నీటిలో ఉండి కూడా తన వేణుగానాన్ని వినిపిస్తున్న ఈ కన్నయ్య రూపమే ఒక గొప్ప నిదర్శనం. ఆ వేణునాదం వినాలంటే అదృష్టం ఉండాలి, ఆ స్వామి కరుణ ఉండాలి. వేణువు శబ్ధం భక్తులను ఆకర్షిస్తున్నా... అంతకంటే ఆలయ నిర్మాణ శైలి, చుట్టూ ప్రకృతిని ఆస్వాదించేవారే ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.




