Vidura Neeti: మహాభారతంలో విదురుడు చెప్పిన సూత్రాలు... ఈ ఆరింటిని వదిలేస్తేనే విజయం
మహాభారతంలో విదురుడు చెప్పిన విదుర నీతి సూత్రాల్లోని ఈ ఆరు దుర్గుణాలను వదిలేస్తే జీవితంలో విజయం, జ్ఞానం, సంపద, కీర్తి పొందవచ్చని విశ్వాసం.
Vidura Neeti: మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో జ్ఞానవృద్ధుడైన విదురుడు ధృతరాష్ట్రునికి ఉపదేశించిన జీవన సూత్రాలు సకల మానవాళికి నిత్య మార్గదర్శకాలు. మనిషి తన జీవితంలో ఉన్నత స్థితిని, అంతిమంగా జీవన సాఫల్యాన్ని సాధించాలంటే ముందుగా తనలోని ఆరు ప్రధాన దుర్గుణాలను పరిత్యజించాలని విదుర నీతి స్పష్టం చేస్తోంది. రాత్రికి రాత్రే ఏ వ్యక్తి విజేత కాలేడని, ఈ 6 బలహీనతలను జయించినప్పుడే దైవానుగ్రహంతో పాటు కార్యసిద్ధి లభిస్తుందని పురాణాలు బోధిస్తున్నాయి.
అతినిద్ర
పరిమితమైన నిద్ర శరీరానికి, మనస్సుకు శక్తిని ఇస్తుంది. కానీ అవసరానికి మించిన అతినిద్ర మనిషిని చైతన్య రహితంగా చేస్తుంది. శారీరక రోగాలకు, మానసిక మందగమనానికి ఇది మొదటి మెట్టు.
తమోగుణం / బద్ధకం
అతినిద్ర వల్ల మనిషిలో రెండో అవలక్షణమైన బద్ధకం పెరుగుతుంది. బద్ధకం ఆవహించిన వ్యక్తి ఎంతటి ముఖ్యమైన కార్యానైనా వాయిదా వేసే అలవాటుకు లోనవుతాడు. కాలం విలువ గ్రహించక సత్కార్యాలకు దూరమవుతాడు.
భయం ...ఆత్మవిశ్వాస రాహిత్యం
సమయానికి పనులు పూర్తికాక పరాజయం ఎదురవుతుందనే ఆలోచనతో మూడో దుర్గుణమైన భయం ప్రవేశిస్తుంది. "నేను ఈ పని చేయగలనా? నన్ను చూసి సమాజం నవ్వుతుందా?" అనే దిగులు మనిషి ధైర్యాన్ని, సద్బుద్ధిని హరించివేస్తుంది.
కోపం
కార్యభంగం కలగడం వల్ల మానసిక సమతుల్యత దెబ్బతిని నాలుగో వినాశకర గుణమైన కోపం పుట్టుకొస్తుంది. కోసం పెరిగి క్రోధంగా మారినప్పుడు మనిషికి విచక్షణ నశిస్తుంది. శాస్త్రాల ప్రకారం క్రోధం ఉన్నచోట లక్ష్మీదేవి లేదా జ్ఞానదేవత నివసించరు.
ఆలస్యం
కోపంతో ఉత్సాహాన్ని కోల్పోయిన మనిషి పనులను తేలిగ్గా తీసుకుంటూ ఐదో లక్షణమైన తీవ్రమైన ఆలస్యానికి దోహదం చేస్తాడు. విద్యకు, జ్ఞానానికి, ధన సంపాదనకు, మిత్రులకు దూరమయ్యేలా ఈ అలవాటు చేస్తుంది.
ప్రతికూల ఆలోచన
జ్ఞానం, నిష్కామ కర్మ దూరమైనప్పుడు జీవితం శూన్యమై ఆరో దుర్గుణమైన ప్రతికూల సంకల్పాలు చుట్టుముడతాయి. నిరంతరం వ్యతిరేక ధోరణిలో ఆలోచించడం వల్ల మనిషి నాశనానికి ఆయనే మార్గం సుగమం చేసుకుంటాడు.
విదుర నీతి ప్రకారం ఈ ఆరు దుర్గుణాలు ఒకదానికొకటి గొలుసుకట్టులా అనుసంధానమై ఉంటాయి. ఇవి మనిషిలోని ఆత్మబలాన్ని, దైవచింతనను పూర్తిగా నశింపజేస్తాయి. వీటిని వదిలిపెట్టిన నాడే మనిషి విద్య, సంపద, కీర్తి, మోక్షము అనే చతుర్విధ పురుషార్థాలను సాధించగలడు. విజయతీరాలకు చేరాలన్నా, పరంధామాన్ని పొందాలన్నా విదురుడు హెచ్చరించిన ఈ ఆరు దుర్గుణాలను తక్షణమే పరిత్యజించి, సత్యం, నిష్టతో ముందుకు సాగడమే మానవ జన్మకు సార్థకత.




