Water Lamp: ఈ ఆలయంలో నీటితోనే దీపం...శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న గడియాఘాట్ మాతాజీ ఆలయం

మధ్యప్రదేశ్‌లోని ఓ పురాతన ఆలయంలో నీటితోనే దీపం వెలిగిస్తారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ వింత భక్తులను ఆకర్షిస్తోంది.

Balachander
Published on: 15 May 2026 8:43 AM IST
Water Lamp:  ఈ ఆలయంలో నీటితోనే దీపం...శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న గడియాఘాట్ మాతాజీ ఆలయం
X

Water Lamp: శిరిడీ సాయిబాబా నీళ్లను నూనెలా మార్చి దీపాలు వెలిగించారని మనం సచ్చరిత్రలో చదువుకున్నాం. మనం అలా చేయగలమా చెప్పండి. కానీ, ఈ ఆలయంలోని పూజారి మాత్రం నూనెతో కాకుండా నీటితోనే దీపం వెలిగిస్తున్నాడు. ఇప్పటికీ ఇలానే జరుగుతున్నది. మన కళ్లముందే ఈ అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది మధ్యప్రదేశ్‌లోని ఓ పురాతన ఆలయం. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, ఇది అక్షర సత్యం. శాస్త్రవేత్తల మేధస్సుకు సైతం సవాలు విసురుతున్న ఈ ఆధ్యాత్మిక వింత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాళీసింధ్ నది తీరాన కొలువుదీరిన శక్తి

మధ్యప్రదేశ్ రాష్ట్రం, షాజాపూర్ జిల్లాలోని నల్ఖేడా గ్రామ సమీపంలో ప్రవహించే కాళీసింధ్ నది ఒడ్డున "గడియాఘాట్ మాతాజీ" ఆలయం ఉంది. ఈ క్షేత్రం కొన్ని వందల ఏళ్లుగా భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. షిరిడీ సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారని మనం కథల్లో చదువుకున్నాం. కానీ, నేటికీ కళ్లెదుట కనిపిస్తున్న అద్భుతం ఈ గడియాఘాట్ ఆలయం.

నీరు నూనెగా మారే రహస్యం

ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆలయ అర్చకులు కాళీసింధ్ నది నుంచి నీటిని తీసుకువస్తారు. ఆ నీటిని ప్రమిదలో పోసి ఒత్తి వెలిగిస్తారు. విచిత్రం ఏమిటంటే, ఆ నీరు ప్రమిదలో పోయగానే ఒక రకమైన జిగట పదార్థంగా మారి నూనెలా పనిచేస్తుంది. అలా వెలిగించిన దీపం ఏకంగా 24 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుంది. సాయంత్రం సమయంలో ఇలా దీపం వెలిగిస్తే మరుసటి రోజు సాయంత్రం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది. సాధారణంగా ఆలయాల్లో దీపారాధన ఉదయం సాయంత్రం చేస్తారు. కానీ, ఇక్కడ ఆలయంలోని గర్భగుడిలో కేవలం సాయంత్రం వేళ మాత్రమే చేయడం విశేషం.

శాస్త్రీయ పరిశోధనలు - తేలని నిజాలు

ఈ వింతను తెలుసుకున్న అనేకమంది శాస్త్రవేత్తలు, భూగర్భ జల నిపుణులు ఇక్కడి నీటిని సేకరించి పరీక్షించారు. ఆ నది నీటిలో ఏవైనా మండే గుణమున్న రసాయనాలు ఉన్నాయేమోనని పరిశోధనలు చేశారు. కానీ, ఆ నీటిని ఆలయం బయట మరెక్కడ వెలిగించినా వెలగకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఇది కేవలం ఆ తల్లి కొలువై ఉన్న గర్భాలయంలో మాత్రమే సాధ్యమవుతోంది. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఆలయం ఓ సజీవ సాక్ష్యం. ఆలయం బయట ఎక్కడ ఇలా దీపం వెలిగించినా వెలగదు. కేవలం అమ్మవారి సన్నిధిలోనే ఇలా దీపం వెలుగుతుంది అంటే అక్కడ శక్తి ఉందని అర్ధం. అందుకే ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఈ వింతను, అమ్మవారి మహిమను చూడాలంటే శీతాకాలం, ఎండాకాలంలో మాత్రమే ఆలయానికి వెళ్లాలి. వర్షాకాలంలో ఆలయం లోపల దీపం వెలిగించరు. కారణం అమ్మవారు ఆ సమయంలో మాతాజీ జలగర్భంలో ఉన్నట్టుగా భావిస్తారు. కాళీనది ఒడ్డున ఆలయం ఉండటం వలన వర్షాకాలంలో నది ఉదృతి పెరుగుతుంది. అమ్మవారి ఆలయం నీటిలో మునిగిపోతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story