Whale worship temple Gujarat: ఇక్కడ తిమింగలమే ఆరాధ్యదైవం...300 ఏళ్లుగా కొనసాగుతున్న వింత ఆచారం

Whale worship temple Gujarat: భగవంతుడిని కేవలం విగ్రహాల్లోనే కాదు..ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దర్శనమిస్తుంది.

Balachander
Published on: 15 April 2026 12:58 PM IST
Whale worship temple Gujarat
X

Whale worship temple Gujarat

Whale worship temple Gujarat: భగవంతుడిని కేవలం విగ్రహాల్లోనే కాదు..ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దర్శనమిస్తుంది. హైందవ సంప్రదాయంలో మనం జంతువులను దైవస్వరూపాలుగా భావించి పూజిస్తాం. అంతేకాదు, శ్రీమన్నారాయణుడి మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని కూడా మనం ఆరాధిస్తాం. కానీ, గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఏకంగా ఓ తిమింగలాన్ని దైవంగా ఆరాధిస్తారు. ప్రతీరోజు తిమింగలానికి పూజ చేయకుండా దినచర్యలను ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు. ఈ సంప్రదాయి గత 300 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ వింత క్షేత్రం మత్స్య మాతాజీ ఆలయం.

ప్రభు తండేల్ కల

దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ కథ ప్రారంభమైంది. గుజరాతల్లోని వల్సాద్‌ జిల్లా, మగోద్‌ దుంగ్రీ అనే గ్రామంలోని ప్రజలు మత్స్యసంపదపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఈ గ్రామంలో ప్రభు తండేల్‌ అనే పెద్ద ఉండేవాడు. ఆయనకు ఓరోజు రాత్రి మత్స్యమాతాజీ కలలో కనిపించి తాను సముద్ర తీరంలో చేప రూపంలో ఉన్నానని, తనను ఆరాధిస్తే గ్రామానికి మేలు జరుగుతుందని చెబుతుంది. అయితే, మొదట ప్రభు తండేల్‌ దీనిని ఓ కలగానే భావించాడు. కానీ, మరుసటిరోజు ఆయన తీరానికి వెళ్లగా అక్కడ భారీ తిమింగలం ఒకటి ప్రాణాలు విడిచి కనిపించింది. వెంటనే ప్రభు తండేల్‌ గ్రామస్తులను పిలిచి ఆ తిమింగలానికి పూజలు చేయించాడు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించి అందులో తిమింగలాన్ని ఉంచి పూజించడం మొదలుపెట్టారు.

విగ్రహం కాదు.. తిమింగలం ఎముకలే దైవం!

కాలంతో పాటు తిమింగలం శరీరభాగాలు మట్టిలో కలిసిపోయి ఎముకలే మిగిలాయి. నేటికీ ఆ ఎముకలనే దైవంగా పూజిస్తున్నారు. ఈ ఆలయంలో ఎలాంటి విగ్రహాలు ఉండవు. తిమింగలం ఎముకలకే నిత్యపూజలు జరుగుతాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేముందు మత్స్య మాతాజీని దర్శించుకొని చేపల వేటకు వెళ్తారు. సముద్రంపై వచ్చే తుఫానుల నుంచి, ప్రమాదాల నుంచి మత్స్యమాతే తమను కాపాడుతుందని మత్స్యకారులు చెబుతుంటారు. అమ్మవారంటే అంతటి విశ్వాసం వారికి.

భక్తికి నిదర్శనం.. పర్యాటక ఆకర్షణ

ప్రతి ఏడాది ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో వేలాదిమంది భక్తులు తరలివస్తారు. మత్స్యమాతాజీని దర్శించుకుంటారు. మన పురాణాల్లోని మత్స్యావతారాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ ఆలయం ఉంటుంది. ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడని చెప్పడానికి ఈ ఆలయమే ఓ నిదర్శనం. శాస్త్ర సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో కూడా, ప్రకృతిని దైవంగా భావించే ఇలాంటి ఆచారాలు భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి అద్దం పడుతున్నాయి. గుజరాత్ వెళ్లినవారు తప్పకుండా మత్స్యకారుల భక్తికి నిలువుటద్దంగా నిలిచే ఈ మత్స్య మాతాజీని దర్శించుకుంటుంటారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story